మానసిక ఆరోగ్యం చిన్నప్పుడు ఎంతెంత దూరం ఆట ఆడే ఉంటారు గుర్తుందా? మన దేశంలో మానసిక ఆరోగ్య సేవల పరిస్థితి కూడా అలాగే ఉంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు.. ప్రజల్లో ఉన్న అపోహలు, ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోకపోవడం లాంటివి ఈ పరిస్థితి తెచ్చిపెడుతున్నాయి. రోజురోజుకీ మానసిక సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మానసిక ఆరోగ్యం, సేవల అందుబాటు పై దృష్టి సారించకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏటా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. ‘మానసిక సేవల అందుబాటు’ను ఈ ఏడాది థీమ్‌గా తీసుకున్నందున మన దేశంలో మానసిక ఆరోగ్య సేవల పరిస్థితిని పరిశీలిద్దాం.
భారతదేశంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్నప్పటికీ, అవసరమైన సేవలు ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఒక పెద్ద సమస్య. ఈ అంతరం మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సరైన చికిత్స అందకుండా అడ్డుకుంటున్నది. దీనివల్ల వారి పరిస్థితి మరింత దిగజారుతున్నది.
నిపుణుల కొరత..
భారతదేశంలో మానసిక ఆరోగ్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం ప్రతి లక్ష జనాభాకు సరాసరిన 0.7 మంది మానసిక వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. సైక్రియాట్రిస్ట్ లు 0.75, క్లినికల్ సైకాలజిస్టులు 0.07 అందుబాటులో ఉన్నారు. మన దేశంలో సైకాలజిస్టులకు ఇప్పటి వరకు చట్టపరమైన గుర్తింపు ప్రక్రియ లేకపోవడంతో వారికి సంబంధించిన లెక్కలు లేవు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం లక్ష మందికి కనీసం ముగ్గురు మానసిక వైద్య నిపుణులు ఉండాలి. ప్రపంచ సగటుతో పోలిస్తే మానసిక సేవలు మన దేశంలో చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి.
పట్టణ-గ్రామీణ వ్యత్యాసం..
చాలావరకు మానసిక ఆరోగ్య నిపుణులు, క్లినిక్‌లు, దవాఖానలు పట్టణ ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య నిపుణులు చాలా అరుదుగా ఉన్నారు దీనివల్ల గ్రామీణ ప్రజలు చికిత్స కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తున్నది. మానసిక ఆరోగ్య చికిత్సలు చాలా ఖరీదైనవి. ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు ఉన్నా వాటి కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుంది. ప్రైవేట్ కౌన్సెలింగ్ సెషన్స్, చికిత్సలు సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అందుబాటులో ఉండటం లేదు.
అపోహతో అనర్థం..
సమాజంలో మానసిక అనారోగ్యంపై ఉన్న అపోహల కారణంగా చాలామంది సహాయం తీసుకోవడానికి భయపడుతున్నారు. మానసిక సమస్యలను బలహీనతగా లేదా పిచ్చిగా భావించడంతో ప్రజలు బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (NIMHANS) నివేదిక ప్రకారం చాలామంది మానసిక సమస్యలు ఉన్నా, కేవలం 10-12% మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. దేశ జనాభాలో 10.6 శాతం మందికి మానసిక సమస్యలు ఉన్నా 70 శాతం నుంచి 92 శాతం మంది సరైన చికిత్స తీసుకోవడం లేదు. దీనికి మానసిక ఆరోగ్య సేవలపై ఉన్న అపోహలే కారణం.
సేవలపై శీతకన్ను..
మానసిక ఆరోగ్య సేవల అందుబాటు లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సైకియాట్రీ, సైకాలజీ కోర్సులకు తగినంత ప్రోత్సాహం లేకపోవడం, శిక్షణ పొందిన నిపుణులు అందుబాటులో లేకపోవడం ప్రధాన లోపం. ఆరోగ్య సంరక్షణలో మానసిక ఆరోగ్యానికి చాలా తక్కువ నిధులు కేటాయిస్తున్నారు. 2025 కేంద్ర బడ్జెట్ లో మానసిక ఆరోగ్య సేవలకు కేవలం 1,004 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది మొత్తం ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్లో కేవలం ఒక శాతం. ఇందులో కూడా 860 కోట్లు బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నింహాన్స్)కు, 80 కోట్లు టెలిమానస్‌కు కేటాయించడంతో మానసిక ఆరోగ్య సేవలు మారుమూల ప్రాంతాలకు ఎప్పటికి చేరుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా మానసిక ఆరోగ్య విభాగాలకు తగినన్ని సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడం సమస్యను మరింత పెంచుతోంది.
ఇలా చేస్తే నయం..
మానసిక ఆరోగ్యం ఒక సమస్య అని, దానికి చికిత్స అవసరమని ప్రజలకు సరైన అవగాహన లేదు. అందుకే చాలామంది తమ ఇబ్బందులను గుర్తించలేకపోతున్నారు. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలియడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక సమగ్ర, బహుముఖ వ్యూహం అవసరం. అందుకు ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకోవాలి.
భారతదేశంలో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి మానసిక ఆరోగ్యం ప్రాథమిక అవసరం. దీనిని కేవలం వైద్య సమస్యగా కాకుండా, సామాజిక బాధ్యతగా భావించి అందరూ కలిసి పనిచేస్తేనే బలోపేతమైన సమాజాన్ని నిర్మించగలం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించిన రోజునే అది సాధ్యమవుతుంది.
-బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261