Internet | ఒకప్పటి సంగతి. మెయిల్ ఐడీ ఉండటం కూడా గొప్ప విషయం. ఆ మెయిల్‌కి ఏదైనా సందేశం వస్తే… దగ్గర్లో ఉన్న ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్లి నిమిషాల చొప్పున అద్దె చెల్లించి… బఫర్ అవుతున్న తెర వంక ఓపికగా చూడాల్సిన పరిస్థితి. కాలం మారిపోయింది. గూగుల్ తల్లి నట్టింట నాట్యమాడుతున్నది. అరచేతిలో వైకుంఠం అన్న మన పెద్దలు.. స్మార్ట్‌ఫోన్‌ని ముందే ఊహించారేమో అని అనుమానం వస్తున్నది. ఇదంతా సమాచార విప్లవమే అని మురిసిపోయే ముందు ఓ ‘విష’యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
పిల్లలకు ప్రాజెక్ట్ కావాలంటే ఇంటర్నెట్. పెద్దలకు వార్తలు తెలియాలంటే నెట్. సులువుగా సమాచారం దొరికే ఆ సంతలో… కనిపించేదంతా నిజం కాదట. దీనికి 1% రూల్ అనే సిద్ధాంతం కూడా ఉంది. అంటే ఇంటర్నెట్లో దొరికే సమాచారాన్ని కేవలం ఒక్క శాతం మంది సృష్టిస్తే, దాన్ని 99 శాతం మంది గుడ్డిగా నమ్మేస్తారని ఈ సిద్ధాంతం చెబుతున్నది. ఓ ఇరవై ఏళ్ల క్రితం, ఇంటర్నెట్ తీరుతెన్నులను గమనించిన ఇద్దరు బ్లాగర్లు రూపొందించిన సిద్ధాంతం ఇది. ఈ థియరీకి కాస్త వైవిధ్యం జోడించిన మరో మాట 1990 రూల్. అంటే ఒక్క శాతం వ్యక్తులు సమాచారాన్ని వదిలితే, మరో తొమ్మిది శాతం దానికి మార్పులూ చేర్పులూ చేస్తారనీ… మిగతా 90 శాతం దాన్ని విశ్వసిస్తారనీ దీనర్థం. ఈ సూత్రం నిజమా, కాదా! అని నిర్ధారించుకునేందుకు చాలా పరిశోధనలే జరిగాయి. అతివాదం నుంచి ఆరోగ్యం మీద దుష్ప్రచారం వరకూ చాలా సందర్భాలలో ప్రజలు తప్పుదోవ పట్టేందుకు ఈ 1% రూల్ కారణం అని తేలింది. ఉదాహరణకు 2007లో జరిగిన ఓ పరిశోధనలో కొన్ని మత ఛాందస వెబ్సైట్లను పరిశీలించినప్పుడు… వాటిలో ఒక్క శాతం మందే తరచూ పోస్ట్ చేస్తున్నారనీ. 13 శాతం మంది అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తుండగా, ఏకంగా 86 శాతం మంది పోస్ట్ చేయడం అనే ఆలోచనే లేకుండా, చర్చలే చేయకుండా… అక్కడ ఉన్నవాటిని అనుసరిస్తున్నారనీ తేలింది. అప్పుడే అలా ఉంటే.. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిందని చెప్పకతప్పదు.
దూరం… దూరం!
కొందరి మాటలు అందరూ వినడం అనేది పార్టిసిపేషన్ ఇనీక్వాలిటీ అనే సమస్యకు దారితీస్తుంది. న్యూనత వల్లో, జంకుతోనో, ఎవరేమనుకుంటారనే భయంతోనో, తనది తప్పవుతుందనే అనుమానం కారణంగానో.. మాట వినిపించాల్సిన సందర్భంలో మౌనంగా ఉండిపోవడమే ఈ సమస్య. ఇందుకు వికీపీడియాను ఉదాహరణగా తీసుకోవచ్చు. అందులో సమాచారాన్ని సరిదిద్దే అవకాశం అందరికీ ఉన్నా కూడా, కొందరే ఆ చొరవ చూపిస్తారు. జీమెయిల్, జూమ్ లాంటి వేదికల మీద జరిగే చర్చావేదికలలోనూ ఇదే పరిస్థితి. ఓ పదిమంది తమ మాటను వినిపిస్తే… మిగతా 90 మంది వేడుకను చూసేందుకు సిద్ధపడిపోతారు. వెబ్సైట్లను సామాన్యులకు చేరువ చేయడంలో అద్భుతాలు సృష్టించాడని చెప్పుకొనే జాకబ్ నీల్సన్ అనే శాస్త్రవేత్తే ఈ ప్రతిపాదన చేయడం గమనార్హం. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే ఈ తరం ఇంటర్నెట్లో ఉన్న నకిలీ కంటెంట్ మీద మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం బాధాకరం. పొలిటీషియన్లు, సెలెబ్రిటీలు నోరుజారితే ట్రోల్స్‌తో రెచ్చిపోయే యంగిస్థాన్‌లు.. ఫేక్ న్యూస్‌పై స్పందించడంపై మాత్రం చొరవ చూపడం లేదు. ‘నిజం నిద్రలేచే లోగా.. అబద్ధం ఊరంతా తిరిగొస్తుంద’న్న తాతల నాటి సామెత నేటికీ పచ్చిగానే ఉందని ఇంటర్నెట్ నిరూపిస్తున్నది. గతంలో అబద్ధం ఊరిలోనే తిరిగేది.. ఇప్పుడు నిజమేంటో తెలిసేలోగా ప్రపంచాన్నే చుట్టేస్తుండటం విడ్డూరం!
కొన్ని జాగ్రత్తలు అవసరం
ఈ కృత్రిమ మేధ కాలంలో నిజమైన సమాచారానికి మరింత గడ్డు కాలం రానుంది. పదాలే కాదు వాటిని పలికే స్వరాలు… ఆ స్వరానికి మూలమైన మనుషులను కూడా నమ్మే పరిస్థితులు లేవు. కాబట్టి సమాచారాన్ని సేకరించేటప్పుడు, దాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే!