గేమ్ స్టార్ట్తాను చెప్పిన 18వ పునర్జన్మ బలిపీఠ యాగం-భస్మాసుర ఆగమనం కథను సినిమా స్టోరీగా నిరూపించిన ఇన్స్పెక్టర్ రుద్రపై కోపంతో రగిలిపోయిన సీఐ శరత్ అంతెత్తున లేచాడు. తనను వెధవ అంటూ సంభోదించడంపైనా ఊగిపోయాడు. ఇంతలో సూర్యాస్తమయం కావోస్తున్నది. అది గమనించిన శరత్..తన అనుచరులకు ఏవో సైగ చేసి వెళ్లమని చెప్పాడు. అందరూ వెళ్లిపోయారు.
ఆతర్వాత శరత్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ రుద్ర.. 18వ పునర్జన్మ బలిపీఠ యాగం ఈ రాత్రి నుంచే మొదలు కాబోతున్నది. తొలి బలికి సమయం ఆసన్నమైంది. 16 రోజులపాటు ఈ బలిపర్వం కొనసాగుతుంది. ‘వెధవ’ అని నన్ను ఎగతాళి చేసిన నిన్ను ఇప్పుడే చంపెయ్యాలని ఉంది. అయితే, నాకు అంత టైమ్‌లేదు. ఈ రోజు సరైన ముహూర్తంలో బలి ప్రక్రియ జరుగకుంటే, రేపటి నుంచి అన్ని సక్రమంగా చేసినా.. ఫలితం దక్కదు. నేను వెళ్లాలి. రేపు ఉదయం వచ్చి మీ అందరి సంగతి చూస్తా!’ అంటూ అక్కడి నుంచి బయల్దేరబోయాడు. ఇంతలో తాళ్లతో కట్టేసి ఉన్న రుద్ర నోటితో సన్నగా విజిల్ వేస్తూ శరత్‌తో ఇలా అన్నాడు.
‘రేయ్.. వెధవ! వెళ్లేముందు ఒక్క విషయం. నీలాంటి బుద్ధితక్కువ వ్యక్తులు కూడా మన డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారా? అని నాకు ఆశ్చర్యం కలుగుతున్నది’ అంటూ రుద్ర అనగానే.. ఆ మాటలు శరత్ అహాన్ని దెబ్బతీశాయి. రుద్ర మీదకు కోపంతో శరత్ రాబోతుండగా.. ‘ఆగురా వెధవ.. ఆగు. నల్లమల వంటి దట్టమైన అడవిలోకి ఒక ఇన్స్పెక్టర్, అతని టీమ్ వచ్చిందంటే, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ లేకుండా వస్తారనుకొన్నావా? మాకు ఏమైనా అయితే, వెంటనే కంట్రోల్‌రూమ్‌కు మెసేజ్ పోయేలా ప్రత్యేక మెసేజ్ సెండింగ్ డివైజ్, జీపీఎస్, ట్రాకింగ్, అలర్ట్ డివైజ్‌లను మా బ్యాగుల్లోనే పెట్టాం. ఇప్పటికే, కంట్రోల్ రూమ్‌కు మనం మాట్లాడుకొన్న మాటలు, ఇక్కడి లొకేషన్ వెళ్లిపోయి ఉంటుంది’ అంటూ తన పక్కన పడిఉన్న ఓ బ్యాగ్వైపు రుద్ర చూశాడు. అంతే, ఆ డివైజ్‌లను నాశనం చేయాలని రుద్ర చూసిన బ్యాగ్‌ను కాలితో బలంగా తొక్కాడు శరత్. ఏదో గ్యాస్ నింపిన కవర్ ఒకటి కాలికి మెత్తగా తగులుతున్నట్టు గమనించాడు. మరింత గట్టిగా తొక్కాడు. అది పగిలిపోయింది. దీంతో ఆ వెంటనే బ్యాగ్‌ను తెరిచాడు శరత్. అంతే, సెకండ్ల వ్యవధిలోనే స్పృహ కోల్పోయి పడిపోయాడు. అదంతా చూస్తున్న వారికి జరుగుతుందో అర్థంకాలేదు.
మెలకువలోకి వచ్చిన శరత్ కండ్లు తెరిచాడో లేదో.. కుర్చీలో తాను తాళ్లతో కట్టి ఉండటం చూసి విస్తుపోయాడు. బ్యాగ్‌లో డివైజ్లంటూ నమ్మించి క్లోరోఫామ్ గ్యాస్‌తో తనను రుద్ర బురిడీ కొట్టించాడని అర్థంచేసుకొన్న శరత్.. కిటికీలో సూర్యుడు ఉదయిస్తుండటాన్ని చూసి గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. ‘ఒరేయ్.. రుద్ర. ఐదేండ్ల నా శ్రమను బూడిదలో పోసిన పన్నీరుగా మార్చావు కదరా. బలిచ్చే 16 మంది, ఆత్మబలిదానం చేసుకొనే ఇద్దరు అందుబాటులో ఉండి కూడా మా తాతమ్మల తాతమ్మకు ముత్తాతల తాత అయిన భస్మాసురుడిని భూమి మీదకు తీసుకొచ్చే అదృష్టాన్ని దూరం చేశావ్ కదరా. ఐదేండ్లుగా సాగిస్తున్న నా నల్లమల ఆపరేషన్‌ను ఐదు సెకండ్లలోనే ముగించేశావ్ కదరా’ అంటూ గుండెలవిసేలా ఏడ్చాడు. ఇంతలో రుద్ర ఏదో చెప్పబోతుండగా.. ‘ఒరేయ్ రుద్ర. 18వ పునర్జన్మ బలిపీఠ యాగాన్ని ఆపేసి నువ్వు గెలిచానని అనుకోవద్దు. బలిచ్చే ఆ 16 మంది ఎక్కడ ఉన్నారో నీకు తెలియదు. నీకే కాదు.. నా అనుచరులు సహా ఈ లోకంలో ఎవరికీ తెలియదు. నా యాగాన్ని చెడగొట్టిన నీకు అనుక్షణం భయమేంటో రుచి చూయిస్తా. ఆ బలిపశువులను నువ్వు ఎలా కాపాడుతావో చూస్తా. వాళ్లను రక్షించడానికి నిన్ను పిచ్చి కుక్కలా పరిగెత్తిస్తా. ఐదేండ్ల నా నిరీక్షణను నీ కంట రక్తకన్నీరుగా కార్పిస్తా. దమ్ముంటే వాళ్లను కాపాడుకో..’ అంటూ చనిపోవడానికి ఊపిరి బిగబట్టాడు శరత్. ఆ మాటలకు రుద్ర.. చిన్నగా నవ్వాడు. అది చూసిన శరత్‌కు మరింత చిర్రెత్తుకొచ్చింది. ‘ఏరా.. ఎవరికి వారు సొంతగా ఊపిరి బిగబట్టి చనిపోవడం సాధ్యంకాదని నాకు తెలియదనుకొంటున్నావా? కానీ, నేను అక్యూట్ రెస్పిరేటరీ పేషెంట్‌ను. పైగా ఇంతకు ముందు ఒకసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. ఒక్క 30 సెకండ్లు ఊపిరి బిగబడితే, చస్తాను’ అంటూ శరత్ చెప్పడంతో రుద్ర షాకయ్యాడు.
‘బలిపీఠంపై సిద్ధంగా ఉన్న వాళ్లను నువ్వు కాపాడుకోవాలంటే, నేను బతికి ఉండాలి. నేను బతికి ఉండాలంటే, నేను ఏం చెప్తే అది నువ్వు చేయాలి. ఏమంటావ్?’ అంటూ గట్టిగా నవ్వాడు శరత్. బంధించిన ఆ 18 మందిని ఎలాగైనా కాపాడాలనుకొన్న రుద్ర.. ‘ఏం చెప్తే అది చేస్తా’ అని శరత్‌తో అన్నాడు. ‘వెల్డన్ రుద్ర. 18వ పునర్జన్మ బలిపీఠ యాగాన్ని చెడగొట్టిన నీకు అనుక్షణం భయం, టెన్షన్ ఏంటో చూపించాలని నాకు ఉంది. సో.. నేను ఎవరిని, ఎక్కడ బంధించానో నీకు తెలియాలంటే, ఒక్కొక్కరి జాడను చెప్పడానికి 5 ప్రశ్నలు వేస్తా. వాటిని నువ్వు 5 సెకండ్లలో చెప్పాలి. సైకో కేసు గుర్తుంది కదా. నీకు ఆ ఫార్మెటే కరెక్టు. సో.. నేను వేసిన మొదటి ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే.. రెండో ప్రశ్న అడుగుతా. ఒకవేళ, ఆన్సర్ తప్పు చెప్పావో.. గేమ్ ఎండ్ అవుతుంది. అక్కడ బంధించిన బలి పశువు చిరునామా నీకు దొరకదు. ఎందుకంటే, నువ్వు తప్పు ఆన్సర్ చెప్పిన నెక్ట్స్ సెకండ్ నేను ఊపిరి బిగబట్టడం మొదలుపెడ్తా. ఆ వెంటనే చనిపోతా. అది జరుగకూడదు అంటే.. ఆలోచించి ఆన్సర్లు చెప్పు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. గేమ్ స్టార్ట్’ అంటూ శరత్ అనగానే.. సైకో ఎపిసోడ్స్‌ను గుర్తు చేసుకొన్న రుద్ర ఏమీచేయలేక సరేనన్నాడు. అందరూ ఆందోళనతో చూస్తూ ఉండిపోయారు.
ఫస్ట్ క్వశ్చన్.. ‘అది పక్షి ఈక కంటే తేలిక. అయితే, ఎంత బలవంతుడైనా దాన్ని కొంతసేపు కూడా పట్టుకోలేడు. ఏంటది?’ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అనేలోపు రుద్ర ఆన్సర్ చెప్పాడు. రెండో ప్రశ్న.. ‘కాకులు అరిస్తే, చుట్టాలు వస్తారంటారు. ఎందుకు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ‘వన్, టూ, త్రీ’. రుద్ర ఆన్సర్ చెప్పాడు. మూడో ప్రశ్న.. పోలీసులమైన మనకు ఖాకీ రంగు యూనిఫారమే ఎందుకిచ్చారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ‘వన్..’. రుద్ర ఆన్సర్ చెప్పాడు. నాలుగో ప్రశ్న.. ఎప్పుడూ నీతిగా తన పని తాను చేసినా అందరూ తిడుతుంటారు ఏంటది? ‘వన్, టూ, త్రీ’. రుద్ర ఆన్సర్ చెప్పాడు. ఐదో ప్రశ్న.. ‘నార చీరలో రాముడితో అడవికి వెళ్లిన సీత.. రావణుడు ఎత్తుకుపోతున్నప్పుడు మాత్రం.. ఒంటిమీద నగలను మూటగట్టి కిందకు ఎలా జారవిడిచింది? ఆ నగలు ఆమెకు ఎక్కడివి?’ అని అడిగిన శరత్.. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ‘వన్, టూ, త్రీ, ఫోర్..’ అన్నాడు. రుద్ర కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పాడు. ‘వెల్డన్ రుద్ర.. నేను అడిగిన 5 ప్రశ్నలకు నీ టాలెంట్‌తో కరెక్ట్‌గా ఆన్సర్లు చెప్పావ్. సో.. నేను బతికి నిన్ను కూడా బతికిస్తున్నా. అయితే, ఒక విషయం. నిన్న నన్ను క్లోరోఫామ్‌తో అడ్డుకొన్న నువ్వు.. తొలి బలిని ఆపావుగానీ, ఆ వ్యక్తి ప్రాణాలు పోకుండా మాత్రం కాపాడలేకపోయావ్. కావాలంటే, ఈ డెన్‌కు ఉత్తరాన అరకిలోమీటర్ దూరంలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్లి చూడు’ అంటూ అసలు విషయం చెప్పాడు శరత్. దీంతో ఆందోళనగా అటువైపు పరిగెత్తారు రుద్ర అండ్ టీమ్. అది పక్కనబెడితే, శరత్ అడిగిన 5 ప్రశ్నలకు రుద్ర ఏం సమాధానాలు ఇచ్చాడో..కనిపెట్టారా??
మొదటి సమాధానం: ఊపిరి
రెండో సమాధానం: పూర్వకాలంలో వార్తలను బట్వాడా చేయడానికి పావురం వంటి పక్షులను వాడేవారు. ఉత్తరం తెచ్చిన పావురం కొత్త ఊరికి రాగానే, తమ ఏరియాలోకి కొత్త పక్షి వచ్చిందని కాకులు అరిచేవి. ఊళ్లలోకి కొత్త వ్యక్తులు వచ్చినా అలాగే చేసేవి. అలా.. కాకులు అరిస్తే, చుట్టాలు వస్తారన్న నానుడి మిగిలిపోయింది.
మూడో సమాధానం: పోలీసులు దుమ్ము-ధూళి, ఎండ తదితర పరిస్థితుల్లో పనిచేయాలి. తెల్లని బట్టలైతే త్వరగా మాసిపోతాయి. ఎప్పటికప్పుడు ఉతకడం కష్టం. అందుకే, బ్రిటిష్ కాలంలో ఉన్న తెల్లని యూనిఫామ్‌ను ఖాకీరంగులోకి మార్చారు. ఖాకీ రంగుకు వేడిని తక్కువగా గ్రహించే గుణముంది. అందుకే ఎండాకాలంలో ఈ దుస్తులు చలువ చేస్తాయి.
నాలుగో సమాధానం: సమయం
ఐదో సమాధానం: దీనికి రెండు సమాధానాలు ఉన్నాయి. జనబాహుళ్యంలో ఉన్న మొదటి సమాధానం ప్రకారం.. రావణుడు ఎత్తుకుపోవడానికి ముందు ఓ మహర్షి ఆశ్రమాన్ని సీతారాములు దర్శించారు. అక్కడే ఆ మహర్షి భార్య సీతమ్మకు ఈ ఆభరణాలు ఇచ్చారు. వాల్మీకి రామాయణంలోని మరో సమాధానం ప్రకారం.. అడవిలోకి వెళ్లేటప్పుడు సీతమ్మ తన పుట్టింటి వారు ఇచ్చిన నగలు, పట్టుచీరనే ధరించారు. తన కోడలు ఎప్పుడూ మహాలక్ష్మిలాగా ఉండాలని దశరథుడు పట్టుబట్టడంతోనే ఆమె ఇలా చేశారు.
-రాజశేఖర్ కడవేర్గు