Laptop | ల్యాప్టాప్స్ ఇప్పుడు మన జీవితాల్లో విడదీయరాని భాగమైపోయాయి. ల్యాప్‌టాప్ అంటారు కాబట్టి, దీన్ని చాలామంది ఒడిలో పెట్టుకుని హాయిగా పనిచేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయట. ముఖ్యంగా పురుషుల విషయంలో ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకోవడం వల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంతేకాకుండా వృషణాలు ఎలెక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్‌కు గురవుతాయి. ఉష్ణోగ్రత పెరుగుదల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. మిగతా శరీర భాగాలతో పోలిస్తే వృషణాల దగ్గర ఉష్ణోగ్రత రెండు మూడు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఇందులో ఏ మాత్రం పెరుగుదల కనిపించినా అది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ… ల్యాప్‌టాప్‌లను డెస్క్లపైనో, టేబుల్‌పైనో పెట్టి పనిచేసుకుంటే మంచిదని నిపుణుల సలహా.
ఎండాకాలం వచ్చిందంటే చెరకురసానికి గిరాకీ పెరుగుతుంది. అయితే, వంద మిల్లీలీటర్ల చెరకురసంలో 13 నుంచి 15 గ్రాముల చక్కెర ఉంటుంది. అంటే చక్కెర స్థాయులు చాలా ఎక్కువ అన్నమాట. పెద్దలైతే రోజుకు 30 గ్రాములు, ఏడు నుంచి పదేండ్ల పిల్లలైతే 24 గ్రాముల చక్కెర వరకు తీసుకోవచ్చట. అందువల్ల చెరకురసం తాగే పరిమాణాన్ని తగ్గించుకోవాలని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), భారతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) మార్గదర్శకాలు వెలువరించాయి. ఇక శీతలపానీయాలు ఆరోగ్యానికి అసలే మంచివికాదు కాబట్టి, చక్కెర పానీయాలకు బదులుగా బటర్‌మిల్క్, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, చక్కెరలు కలపని పండ్లరసాలు తీసుకోవాలి. పండ్లరసాల కంటే ఫైబర్, పోషకాలు సమృద్ధిగా ఉండే తాజా పండ్లు తినడమే మంచిది.
పొగతాగడం అంటే శారీరక, మానసిక ఆరోగ్యం మీద మాత్రమే చెడు ప్రభావం పడుతుందని అనుకుంటాం. కానీ, ఈ దురలవాటు అంతకుమించి ప్రమాదకరమైనది. పొగాకు వాడకం వల్ల వచ్చే రోగాలు రోగి ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేస్తాయి. అంతేకాదు పొగాకు ఒక్క ఊపిరితిత్తుల మీద మాత్రమే కాకుండా డయాబెటిస్, క్యాన్సర్, వయసు పెరిగినట్టు అనిపించడం, దంతక్షయం, దంతాలు ఊడటం, గారపట్టడం, నోటి దుర్వాసన లాంటి సమస్యలతోపాటు అన్నవాహిక జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీటికితోడు దీర్ఘకాలం పొగాకు వినియోగం మానసిక ఆందోళనకు, కుంగుబాటుకు కారణమవుతుంది. కాబట్టి పొగతాగే అలవాటును వీలైనంత త్వరగా వదిలించుకోవడం ఉత్తమం.