ఓంకార నాద శబ్దంతో బయోకెమీ క్రియేచర్ వైరస్‌ను పూర్తిగా దిగ్బంధనంలోకి పూజారి తీసుకెళ్లడంతో మిషన్ డోలో ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. అది తెలుసుకొన్న ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్ పూజారికి కృతజ్ఞతలు చెప్పి.. మిషన్ డోలోకు తెరపడినట్టు పీఎంవో అధికారులకు సమాచారమిచ్చారు. అందరూ కొంత ఊపిరి పీల్చుకున్నారు.
ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టు రుద్ర.. పూజారితో ఇలా అన్నాడు. ‘స్వామీ.. నాకో విషయం అర్థంకావట్లేదు. మూడో దశను నిలిపేయడానికి మన సైంటిస్టులు వారణాసినే ఎందుకు ఎంచుకొన్నారు? ఇక్కడే ఆ బాక్స్‌ను ఎందుకు ఉంచారు? పైగా ‘ఇండియాను నాశనం చేయాలనుకొన్న వారి ఆటలు సాగొద్దన్న ఉద్దేశంతో ఇటలీలో ఈ బయోకెమీ క్రియేచర్ దశ యాక్టివేట్ అయినా.. దాని మూలాన్ని పండితుల సలహాతో వారణాసిలో కావాలనే పెట్టాం’ అంటూ బాక్స్ గోడలపై వాళ్లు రాశారు. ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడంలో పండితులు సూచనలు చేయాల్సిన అవసరం ఏమున్నది?’ అంటూ రుద్ర ప్రశ్నించాడు. చిన్నగా నవ్విన స్వామీజీ.. ‘బాబూ రుద్ర.. నువ్వు నిల్చొన్న ఈ ప్రాంతం గురించి నీకు తెలుసా?’ అని అడిగాడు. తెలుసు అంటూ సమాధానమిచ్చాడు రుద్ర. ‘అయితే, నేను అడిగే, మూడు ప్రశ్నలకు నువ్వు సమాధానమివ్వు.. నీ ప్రశ్నకు నేను బదులిస్తా’ అన్నాడు స్వామీజీ. స్వామీజీ ఎందుకు అలా అంటున్నాడో అర్థంకాకపోయినప్పటికీ.. సరేనన్నాడు రుద్ర. స్వామీజీ మొదలు పెట్టాడు.
‘మొదటి ప్రశ్న.. వారణాసికి ఆ పేరు ఎలా వచ్చింది? రెండో ప్రశ్న వారణాసిని కాశీ అని కూడా ఎందుకు అంటారు? మూడో ప్రశ్న.. వారణాసిని బనారస్ అని కూడా అంటారు ఎందుకో?’ అంటూ స్వామీజీ ప్రశ్నలు ముగియకముందే అన్నింటికీ సమాధానాలు చెప్పాడు రుద్ర. ముచ్చటపడిన స్వామీజీ.. ‘రుద్ర.. నువ్వు ఇంత చురుకైన వ్యక్తివి కాబట్టే, ఇంతటి క్లిష్టమైన మిషన్‌ను ఆపేయగలిగావు. సరే.. మిషన్ డోలో మూడో దశను ఇక్కడే ఎందుకు పెట్టారో? దానికి పండితులు ఎందుకు సూచనలు చేశారో చెప్తాను’ అంటూ స్వామీజీ మొదలుపెట్టాడు. స్వామీజీ వివరణను రుద్రతో పాటు అక్కడే ఉన్న కరణ్, జయ, స్నేహిల్, రామస్వామి, హరిశ్వ కూడా ఆసక్తిగా వింటున్నారు.
‘శివపురాణం ప్రకారం.. కల్పం మొదట్లో ప్రకృతి మొత్తం నీటితో నిండి ఉండేదట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి సాగించే సామర్థ్యం కోసం తపస్సు చేసుకోవడానికి ఆ పరమ శివుడి త్రిశూలాగ్రం మీద ఓ ప్రాంతాన్ని సృష్టించాడు. అదే కాశీ. దీనిమీద కూర్చొనే బ్రహ్మ దేవుడు సమస్త లోకాలనూ అందులో భాగంగా భూగ్రహాన్నీ సృష్టించాడట. అయితే, భూమి సిద్ధమైన నేపథ్యంలో శివుడి త్రిశూలం మీదనే ఉన్న కాశీ పట్టణాన్ని భూమి మీదకు తరలించాలని దేవతలు, రుషులు బ్రహ్మను వేడుకొన్నారు. అలా భూగ్రహం పుట్టకముందే అవతరించిన కాశీ పట్టణం ఎట్టకేలకు భూమి మీదికి చేరింది. అందుకే, సృష్టి ప్రళయకాలంలో సమస్తం నశించినా కాశీ పట్టణం మాత్రం చెక్కుచెదరదని అంటారు.
ఈ విషయాన్ని గ్రహించే వైరస్ బాక్స్‌ను కాశీలో ఉంచాలంటూ పండితులు సూచించారు. ఒకవేళ, వైరస్ లీకైనా.. అది ఈ కాశీ పట్టణంలో ఎవర్నీ ఏమీ చేయబోదని వాళ్లు అనుకొని ఉండొచ్చు’ అంటూ ముగించాడు స్వామీజీ. ఇంతలో కలుగజేసుకొన్న స్నేహిల్.. ‘అంటే స్వామీ.. ఇప్పుడు ఈ బాక్స్ నుంచి వైరస్ లీకైనా.. ఈ కాశీలో దాని ప్రభావం ఉండదా?’ అంటూ అడిగాడు. దానికి స్వామీజీ నవ్వుతూ.. ‘విశ్వాసాలను నమ్మాలి. కానీ, పరీక్షించకూడదు. ఏమో.. ఆ విషయం శివయ్యకే తెలుసునేమో!’ అంటూ స్వామీజీ ముగించారో లేదో.. కాశీ విశ్వేశ్వరుడికి రుద్రాభిషేకం జరుగబోతున్నదంటూ ఎవరో అన్నారు. వెంటనే గొంతుకలిపిన కరణ్, స్నేహిల్, జయ, రామస్వామి, హరిశ్వ.. మా రుద్రతో కలిసి ఆ రుద్రాభిషేకంలో మేమూ పాల్గొంటాం అంటూ మందిరం వైపునకు కదిలారు. అది పక్కనబెడితే, స్వామీజీ అడిగిన ప్రశ్నలకు రుద్ర ఏం సమాధానాలు ఇచ్చాడో మీకు తెలుసా?
స్వామీజీ అడిగిన మూడు ప్రశ్నలకు రుద్ర ఇలా సమాధానం ఇచ్చాడు. వారణాసిలో వరుణా, అస్సీ అనే నదులు ప్రవహిస్తూ గంగలో కలుస్తాయి. ఆ నదుల పేరు మీదే వారణాసి అని వచ్చింది. ఇక, వారణాసికి ముందు ఈ ప్రాంతాన్ని కాశీ అని పిలిచేవారు. కాశీ అనే పదం కాశ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. దీనర్థం మోక్షం కలిగించే నగరం అని అర్థం. ఇక, మొఘల్, బ్రిటిష్ కాలంలో వారణాసి పేరు కాలక్రమేణా బారణసి ఆ తర్వాత బనారస్‌గా మారినట్టు భాషా పరిశోధకులు చెప్తారు.