తెలుగు సినీ పరిశ్రమలో కన్నడ భామల హవా కొనసాగుతూనే ఉంది. నితిన్ హీరోగా వచ్చిన ‘తమ్ముడు’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ సప్తమి గౌడ. ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ సినిమాతో తెరంగేట్రం చేసిన సప్తమి ‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అభిమానుల్ని సంపాదించుకుంది. ‘తమ్ముడు’తో తెలుగువారికి దగ్గరైన సప్తమి గౌడ పంచుకున్న కబుర్లు..
మాది బెంగళూరు. నాన్న ఉమేశ్ గౌడ రిటైర్డ్ పోలీస్ ఇన్స్పెక్టర్, అమ్మ శాంత గౌడ. నేను సివిల్ ఇంజినీరింగ్ చేశాను. కానీ, నటనపై ఇష్టంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. కన్నడలో వచ్చిన ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ నా మొదటి సినిమా. తొలి చిత్రంతోనే నాకు మంచి గుర్తింపు వచ్చింది.
‘తమ్ముడు’ సినిమాలో నేను రత్న అనే పాత్రలో నటించాను. రత్న పవన్ కళ్యాణ్ అభిమాని. నిజ జీవితంలోనూ పవర్‌స్టార్ సినిమాలు ఎక్కువగా చూస్తాను. ఆయన స్టయిల్ చాలా నచ్చుతుంది. ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం.
సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ నాకు ఇష్టమైన హాబీలు. ఖాళీ సమయంలో నవలలు చదువుతాను. తెలుగు వంటకాలు, ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీ నాకు చాలా ఇష్టం! మరిన్ని తెలుగు, కన్నడ సినిమాల్లో నటించాలని ఆశిస్తున్నా. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకోవాల నుకుంటున్నా.
‘తమ్ముడు’లో నేను, వర్ష బొల్లమ్మ ఫైట్ సీక్వెన్స్‌లలో నటించాం. సాధారణంగా హీరోయిన్లు డ్యాన్స్ సీన్స్‌లో కనిపిస్తారు, కానీ ఇందులో ఫైట్ చేయడం కొత్త అనుభవం. షూటింగ్ కోసం కొండలు, గుట్టల్లో హార్స్ రైడింగ్ చేయాల్సి వచ్చినా.. ధైర్యంగా చేసేశాం.
నటనకు స్కోప్ లేని పాత్రల కారణంగా కొన్ని ఆఫర్స్ వదులుకున్నాను. నాకు పవర్ఫుల్, సబ్‌స్టాన్స్ ఉన్న పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో మరో రెండు చిత్రాలతోపాటు తమిళంలో, కన్నడలో మూవీస్ చేస్తున్నా.
‘పుష్ప’లో రష్మిక పాత్ర నాకు చాలా నచ్చింది. అలాంటి ఆఫర్స్ వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ‘కాంతార’ సక్సెస్ తర్వాత నాకు అదే తరహా పాత్రలే వచ్చాయి. అందుకే చాలా మూవీస్ వదులుకున్నాను. అందుకే ఎక్కువ చి్రత్రాల్లో కనిపించలేకపోయా.
తెలుగు సినిమా రంగం చాలా సపోర్టివ్‌గా ఉంది. ఇక్కడ పనిచేయడం వల్ల తెలుగు సంస్కృతిని దగ్గరగా చూశాను. ‘తమ్ముడు’ సెట్స్‌లో నితిన్, లయ, వర్ష బొల్లమ్మతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం కోసం అంబరగొడుగు అడవిలో షూట్ చేశాం. అక్కడి వాతావరణం, లొకేషన్లో సవాళ్లు ఎదురయ్యాయి. కానీ టీమ్ సపోర్ట్‌తో వాటన్నిటినీ అధిగమించగలిగాం.