ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకూ కూరుకుపోతున్న వ్యసనం బెట్టింగ్. దీని బారినపడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ మధ్య తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎవరు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ అడిక్షన్ జనాల్లోకి చొచ్చుకుపోతూనే ఉంది. ఎందుకంటే, బెట్టింగ్ యాప్స్ అన్నీ మనిషి మెదడు బలహీనతను బేస్ చేసుకుని తయారు చేసినవి కాబట్టి. దీని వెనుక ఉన్న మాయాజాలం ఏంటో తెలుసుకోండి మరి!
బెట్టింగ్ అనేది కేవలం డబ్బు గెలవాలనే ఆశతో చేసే పని మాత్రమే కాదు. దాని వెనుక ఒక సంక్లిష్టమైన మానసిక శాస్త్రం దాగి ఉంది. చాలామంది సరదాగానో, పాకెట్ మనీ కోసమో బెట్టింగ్ ప్రారంభించి మెల్లమెల్లగా దానికి బానిసలుగా మారిపోతుంటారు. డిజిటల్ యుగంలో ఆన్లైన్ రమ్మీ, క్రికెట్ బెట్టింగ్, క్యాసినో యాప్స్ వంటివి స్మార్ట్ఫోన్లలోకి రావడంతో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటో చూద్దాం..
మనం ఏదైనా విజయాన్ని సాధించినప్పుడు లేదా అనుకోకుండా డబ్బు గెలిచినప్పుడు మన మెదడులో డోపమైన్ అనే ఫీల్‌గుడ్ కెమికల్ విడుదలవుతుంది. ఇది మనకు విపరీతమైన సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. కష్టపడకుండా కేవలం ఒక్క క్లిక్‌తో డబ్బు గెలవగానే మెదడు ఆ కిక్‌ను మళ్లీ మళ్లీ కోరుకుంటుంది. బెట్టింగ్‌లో పూర్తిగా ఓడిపోకుండా, గెలుపు అంచుల్లోకి వచ్చి ఓడిపోవడాన్ని సైకాలజీలో ‘నియర్ మిస్’ అంటారు. మెదడు దీనిని ఓటమిగా గుర్తించదు. ‘అయ్యో! కొద్దిలో మిస్ అయింది, వచ్చేసారి కచ్చితంగా గెలుస్తా’ అనే భ్రమను కలిగించి, మళ్లీ బెట్టింగ్‌కు పాల్పడేలా ప్రేరేపిస్తుంది.
చాలామంది బెట్టర్లు తాము ఆడే ఆటపై లేదా బెట్టింగ్ వేసే టీమ్‌పై తమకు పూర్తి అవగాహన, నియంత్రణ ఉందని నమ్ముతారు. దీనినే ‘ఇల్యూషన్ ఆఫ్ కంట్రోల్’ అంటారు. స్పోర్ట్స్ బెట్టింగ్ ఆడేవారు తాము గణాంకాలు, పిచ్ రిపోర్ట్ అన్నీ విశ్లేషించామని, తమ గెలుపు కేవలం అదృష్టం మీద కాకుండా తమ ప్రతిభ మీద ఆధారపడి ఉందని భావిస్తారు. కానీ, నిజానికి బెట్టింగ్ అనేది పూర్తిగా ‘వేరియబుల్ రేషియో షెడ్యూల్’పై నడుస్తుంది. అంటే ఎప్పుడు గెలుస్తామో, ఎప్పుడు ఓడిపోతామో ఎవరికీ తెలియదు. ఈ సస్పెన్స్ లేదా అంచనా వేయలేని తత్వమే మనిషిని బానిసగా మారుస్తుంది.
మానసిక శాస్త్రం ప్రకారం మనిషికి గెలుపు ఇచ్చే సంతోషం కంటే, ఓటమి ఇచ్చే బాధ రెట్టింపు బలంగా ఉంటుంది. దీనిని లాస్ ఎవేర్షన్ అంటారు. బెట్టింగ్‌లో ఒకసారి పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాక, సగటు మనిషి భయపడి వెనక్కి తగ్గాలి. కానీ, అడిక్షన్ ఉన్న వ్యక్తి, ‘పోయిన డబ్బును ఎలాగైనా తిరిగి సంపాదించాలి’ అనే పట్టుదలతో మరింత పెద్ద మొత్తంలో బెట్టింగ్ వేస్తాడు. ఈ క్రమంలో అప్పులు చేయడం, ఇంట్లో వాళ్లకు అబద్ధాలు చెప్పడం, బంగారం తాకట్టు పెట్టడం వంటివి చేస్తూ మరింత ఊబిలోకి కూరుకుపోతారు.
చాలామంది జీవితంలో ఉండే ఒత్తిడి, డిప్రెషన్, ఒంటరితనం లేదా బోర్డమ్ నుంచి తప్పించుకోవడానికి బెట్టింగ్‌ను ఒక సాధనంగా ఎంచుకుంటారు. ఆన్లైన్ యాప్స్ ఓపెన్ చేసి బెట్టింగ్ వేస్తున్నంత సేపు వారు తమ నిజ జీవిత సమస్యలను, బాధ్యతలను మర్చిపోతారు. ఆ సమయంలో వారి మెదడు కేవలం గెలుపోటములపైనే దృష్టి పెట్టడం వల్ల, అదొక తాత్కాలిక ఉపశమనంగా మారుతుంది.
ఇది బెట్టర్లలో ఉండే ఒక విచిత్రమైన మానసిక ఆలోచన. ఉదాహరణకు, కాయిన్ టాస్ వేసినప్పుడు వరుసగా ఐదుసార్లు ‘హెడ్స్’ పడితే, ఆరోసారి కచ్చితంగా ‘టెయిల్స్’ పడుతుందని గట్టిగా నమ్మడం. ‘నేను వరుసగా 10 మ్యాచ్‌లు ఓడిపోయాను, కాబట్టి ఈ 11వ మ్యాచ్ కచ్చితంగా గెలుస్తాను’ అని అహేతుకంగా ఆలోచించి సర్వస్వం పణంగా పెడతారు. కానీ, ప్రతీ బెట్ లేదా ప్రతీ టాస్ మునుపటి ఫలితంతో సంబంధం లేని ఒక స్వతంత్ర ప్రక్రియ అని వారు మర్చిపోతారు.
బెట్టింగ్ వ్యసనం అనేది కేవలం డబ్బుకు సంబంధించిన సమస్య కాదు; అది మెదడు ఆలోచనా సరళిని, భావోద్వేగాలను నియంత్రించే ఒక తీవ్రమైన మానసిక రుగ్మత. దీని నుంచి పూర్తిగా బయటపడటానికి సంకల్ప బలంతో పాటు కొన్ని శాస్త్రీయమైన మానసిక వ్యూహాలు తోడ్పడతాయి. ఆ వ్యూహాలు ఏంటో వచ్చేవారం చూద్దాం.