‘ఛలో’ అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించి రెండో సినిమాతోనే నేషనల్ క్రష్‌గా ఎదిగిన హీరోయిన్ రష్మికా మందన్న. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆమె సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. తాజాగా పుష్ప-2తో శ్రీవల్లిగా మరోసారి ప్రేక్షకులను పలకరించిన పాన్ ఇండియా బ్యూటీ రష్మిక పంచుకున్న కబుర్లు..
నాకంటే అందమైన, తెలివైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వాళ్లు నటనలోనూ ప్రతిభావంతులే. మనల్ని మనం నిరూపించుకునే అవకాశం కొద్దిమందికే వస్తుంది. నాకు అలాంటి అవకాశాలు వచ్చాయి కాబట్టే ఈ స్థానంలో ఉన్నాను.
‘యానిమల్’ తర్వాత నా గురించి చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఒక డైలాగ్ దగ్గర నా ఎక్స్ప్రెషన్ బాగాలేదని విమర్శించారు. నటిగా అరంగేట్రం చేసినప్పటి నుంచి నాపై ఈ విమర్శల దాడి జరుగుతూనే ఉంది. మొదట్లో ఇలాంటివి చూసి బాధపడేదాన్ని. దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అది మితిమీరితే మాత్రం నా శైలిలో ఘాటుగా స్పందిస్తా.
నా జీవితం పూలపాన్పేమీ కాదు. చిన్నతనంలో దుర్భరమైన పేదరికం అనుభవించా. నాన్న చేసిన వ్యాపారాలు ఒక్కసారిగా నష్టాల్లో కూరుకుపోవడంతో మా కుటుంబం కొన్నేళ్లపాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఆ సమయంలో ఇంటిని నడిపించేందుకు నాన్న చాలా కష్టపడ్డారు. ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితికి వచ్చేశాం. దాంతో ఇల్లు ఖాళీ చేయమని యజమాని ఒత్తిడి చేసేవారు. అద్దె కట్టలేక ప్రతీ రెండు నెలలకొకసారి ఇల్లు మారేవాళ్లం.
ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా వర్కవుట్స్ అస్సలు మిస్సవ్వను. మొదట్లో వర్కవుట్స్, ఆహార నియంత్రణ ఎవరికైనా చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ, ఒక్కసారి అలవాటుపడ్డాక అద్భుతాలు గమనించొచ్చు. సహజంగానే ప్రయాణాలంటే నాకు చాలా ఇష్టం. కాస్త విరామం దొరికితే విదేశాలకు వెళ్లిపోతా.
దాదాపు పాతిక ఆడిషన్స్‌లో నన్ను రిజెక్ట్ చేశారు. నా నటనపై వాళ్లకెప్పుడూ అనుమానం ఉండేది. ఇలాంటి సవాళ్లు ఎన్నో ఎదుర్కొన్నా. అయితే ఎప్పుడూ వెనక్కి తగ్గాలనుకోలేదు. ప్రతీ సినిమాకు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ వచ్చా. నేనెప్పుడు నా సినిమాలు చూసినా, ఇంకాస్త బాగా చేస్తే బాగుండేదేమో అనుకుంటా.
ఏ కెరీర్ అయినా జయాపజయాలు మామూలే! వాటిని పట్టించుకుంటే అక్కడితో ఆగిపోతాం. ప్రశంసలు, విమర్శలు ఎదురవుతాయి. పొగడ్తలకు పొంగిపోయినా, విమర్శలకు కుంగిపోయినా జీవితంలో ముందుకుసాగలేం. అందుకే వాటిని పట్టించుకోను.నాకు డిసెంబర్ నెలంటే చాలా సెంటిమెంట్. ఒక విధంగా లక్కీమంత్. ఎందుకంటే నా తొలి సినిమా ‘కిరాక్ పార్టీ’ ఈ నెలలోనే విడుదలైంది. ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్‌తో నటించిన ‘అంజనీపుత్ర’, ‘చమక్’ సినిమాలు డిసెంబర్లోనే వచ్చి, సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. జాతీయస్థాయిలో నాకు గుర్తింపు తీసుకొచ్చిన ‘పుష్ప- ది రైజ్’, ‘యానిమల్’ సినిమాలు సైతం డిసెంబర్లోనే విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ‘పుష్ప- ది రూల్’, ‘చావా’ సినిమాలు కూడా ఈ నెలలోనే విడుదలై సంచలనం సృష్టించడం సంతోషంగా ఉంది.