‘నన్ను దోచుకుందువటే’ అంటూ టాలీవుడ్లో అడుగుపెట్టి తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకున్న కన్నడ చిన్నది నభా నటేశ్. అందం, అభినయంతో వరుస ఆఫర్లు అందుకుని ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. కెరీర్ ఊపందుకునే సమయంలో ప్రమాదానికి గురై రెండేండ్లు సినిమాలకు దూరమైన ఈ భామ తాజాగా ‘డార్లింగ్’ అంటూ ప్రేక్షకులను పలకరించింది. స్ల్పిట్ పర్సనాలిటీ పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకుంటున్న నభా పంచుకున్న ముచ్చట్లు..
తెరపై కనిపించినట్లు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండనేమో కానీ, సంతోషంగా మాత్రం ఉంటాను. ఏదైనా ఓ కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందుకే షూటింగ్ టైమ్‌లో అన్ని క్రాఫ్ట్స్‌పైనా దృష్టి పెడతాను. తెలుగులో నేను నటించిన అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. నా కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’.
వరుస అవకాశాలతో బిజీ అవుతున్న టైమ్‌లో యాక్సిడెంట్ అయ్యింది. మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్స్ వల్ల కాంప్లికేటెడ్ సర్జరీలు జరిగాయి. ఆ టైమ్‌లో చాలా ఒత్తిడికి గురయ్యా. కోలుకోగానే మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నా.
కామెడీ సినిమాలంటే ఇష్టం. ఓ ప్రేక్షకురాలిగా నేను ఎలాంటి సినిమాలను ఎంజాయ్ చేస్తానో అలాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు వినోదం పంచాలనుకుంటా. సీరియస్ లుక్ కంటే కామెడీ లుక్‌లో
కనిపించడమే నాకిష్టం.
నేను థియేటర్ నుంచి సినిమాల్లోకి వచ్చాను. ఎప్పుడూ కొత్తతరహా పాత్రలను ఎంచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తాను. ‘డార్లింగ్’లో స్లిట్ పర్సనాలిటీ పాత్ర అనగానే నాకు తెలియకుండానే నాలో అనేక ఆలోచనలు మొదలయ్యాయి. అవే నన్ను ఆ పాత్రలో లీనమయ్యేలా చేశాయి. ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ మరిన్ని చేయాలని ఉంది.
ఓ ప్రమాదం కారణంగా భుజానికి గాయమైంది. దాంతో విరామం తీసుకోక తప్పలేదు. దాదాపు రెండేండ్లు సినిమాలకు దూరమయ్యాను. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ నటించాలనుకున్నా. తెరపై ప్రేక్షకులకు కనువిందు చేయడానికి మాత్రమే కాదు, నన్ను నేను చూసుకోవడానికి కూడా ఈ రెండేండ్లు చాలా ఎదురుచూశాను. ‘డార్లింగ్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.
కథల ఎంపికలో ఎప్పుడూ నా పాత్ర ప్రాధాన్యంతోపాటు ఇతర పాత్రలను కూడా పరిశీలిస్తాను. స్క్రీన్ మీద ఎలా కనిపించాలనేది కథపై ఆధారపడి ఉంటుంది. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ సీన్స్‌లో నటించాల్సి ఉంటుంది. అలాగని పరిధులు దాటకుండా చూసుకోవాలి. నేను కనిపించే ప్రతీ పాత్ర నా అభిమానులను మెప్పించేదై ఉండాలని కోరుకుంటాను.
నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభూ’లో ఓ పాత్ర పోషిస్తున్నా. మరికొన్ని కథలు డిస్కషన్స్‌లో ఉన్నాయి. గ్యాప్ తర్వాత కూడా ప్రేక్షకులు నన్ను ఆదరించడం చాలా ఆనందంగా ఉంది. కష్టకాలంలో నాకు తోడుగా నిలిచిన నా కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.