అందమైన యువకుడు, అంతే అందమైన మనసు. పెద్ద ఐటీ కంపెనీ. బోలెడు సంపద. అన్ని సుఖాలూ వదులుకొని ఆ యువకుడు గ్రామానికి వచ్చి సైకిల్ మీద తిరుగుతూ అక్కడి యువతను మంచి మార్గంలో నడిపిస్తాడు. ఊరిని దత్తత తీసుకొని బాగు చేస్తాడు. తెలుసు… ఇది మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా కథ కదా… అనుకుంటున్నారేమో! అది నిజమే, కానీ రీల్ కథను మించిన ఈ రియల్ శ్రీమంతుడి కథ ఇంత కన్నా ఆసక్తిగా ఉంటుంది. ఇక్కడ హీరో శ్రీధర్ వెంబు. ప్రపంచాన్ని శాసించే మైక్రోసాఫ్ట్, వాట్సప్ లాంటి సంస్థలను సైతం వణికించేలా ఈయన స్థాపించిన జోహో విజయం సాధించింది. ఇతని ప్రయాణం చూసిన ఎవరైనా ఇదెలా సాధ్యమో… అని ఆశ్చర్యపోవాల్సిందే.
ఐఐటీలో సీటు సాధించాలి, ఎంఎస్ కోసం అమెరికాలో వాలిపోవాలి. అక్కడే డాలర్లలో సంపాదించాలి. రెండు తెలుగు రాష్ర్టాల్లోనే కాదు సగటు భారతీయ యువకుడి కలలు ఇవే. దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఇలాంటి ఆశలతో, కలలతో అమెరికా వెళ్లిపోయిన పిల్లలు, వారి కోసం బిక్కు బిక్కుమంటూ ఎదురు చూసే తల్లితండ్రులు కనిపిస్తారు. ఇలాంటి ఇంటింటి కథలను మలుపు తిప్పి… సిలికాన్ వ్యాలీలోనో, బెంగళూరు, హైదరాబాద్‌లాంటి నగరాల్లోనో మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాల్లో సైతం బ్రహ్మాండమైన ఐటీ పంట పండించవచ్చు అని నిరూపించిన విజేత శ్రీధర్ వెంబు.
పల్లెటూరే అడ్డా
శ్రీధర్ వెంబూను ఏ కాస్త ఎరిగిన వాళ్లకైనా పొలాల వెంట సాగే ఆయన సైకిల్ ప్రయాణం తెలిసే ఉంటుంది. ఊళ్లో ఆయన అలాగే తిరుగుతుంటారు. వేల కోట్ల టర్నోవర్ సాధించిన జోహో విజయం గురించి వివరించేప్పుడూ అంతే! తన వాకిట ముగ్గులు తీర్చి ఉండే పెద్ద అరుగు మీదే కూర్చుని మాట్లాడుతుంటారు. లుంగీ-చొక్కా, గడ్డంతో కనిపించే ఆయన్ను చూస్తే ఎవరూ ఓ పెద్ద కార్పొరేట్ సంస్థకు అధినేత అనుకోరు. శ్రీధర్ గత కొన్నేండ్లుగా తమిళనాడులోని టెంకాసి జిల్లాలోని స్వగ్రామం మఠలంపరైలో నివసిస్తున్నారు. అక్కడి నుంచే జోహో కంపెనీని నిర్వహిస్తున్నారు.
ఐఐటీ మద్రాస్ నుంచి 1989లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చేసిన శ్రీధర్ వెంబు 1968లో తమిళనాడులోని తంజావూరు జిల్లాలో మారుమూల గ్రామంలో జన్మించారు. తండ్రి హై కోర్ట్‌లో స్టెనోగ్రాఫర్, తల్లి గృహిణి. సాధారణ బ్రాహ్మణ కుటుంబం. ఎనిమిది మంది సోదరుల్లో శ్రీధర్ ఒకరు. అమెరికాలో ఎంఎస్, పీహెచ్‌డి చేసి అక్కడే వైర్లెస్ ఇంజనీర్‌గా పని చేశారు. తన సోదరులతో కలిసి 1996లో అడ్వెంట్ నెట్ పేరుతో ఓ కంపెనీ స్థాపించారు. 2009లో అడ్వెంట్ నెట్‌ను జోహో కార్పొరేషన్‌గా మార్చారు. 2024 నాటి ఫోర్బ్ లెక్కల ప్రకారం శ్రీధర్ ఆస్తి 5.85 బిలియన్ డాలర్లు. అంటే మన రూపాయల్లో సుమారు 50 వేల కోట్లకు పైమాటే. భారత్‌లోని సంపన్నుల్లో ఈయనది 39వ స్థానం.
సొంతంగా…
ఒక్క రూపాయి కూడా వెంచర్ క్యాపిటలిస్ట్‌ల దగ్గర తీసుకోకుండా సొంతంగా స్థాపించుకున్న కంపెనీ జోహో. 16వేల మంది సిబ్బందితో… అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు తన సేవలు అందిస్తున్నది. సంస్థకు 10 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. సేవల విషయంలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు గట్టి పోటీ ఇస్తున్నది. ప్రస్తుతం 55 క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్‌కు సంబంధించి సేవలు అందిస్తున్నది. ఇటీవల వాట్సప్‌కు పోటీగా వచ్చిన ఆరైట్టె ఆప్ ఈ సంస్థదే. జోహో హెడ్ క్వార్టర్లు చెన్నై, టెక్సాస్‌లలో ఉన్నాయి. తమిళనాడు, కేరళల్లోని పల్లెటూళ్లలో గ్రామీణ ఆఫీస్‌లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక కార్యాలయం ఉంది. సంస్థ ద్వారా గ్రామీణ యువతకు చదువు చెప్పించి శిక్షణ కాలంలో గౌరవ భృతి కూడా చెల్లిస్తారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారికి కంపెనీలో ఉద్యోగాలు ఇస్తారు. ఆయన సేవలకు గాను 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
అమెరికాలాంటి కలల ప్రపంచం నుంచి తమిళనాడులోని గ్రామానికి తరలి వెళదాం అన్నప్పుడు తన కుటుంబ సభ్యులు అండగా నిలిచారని, వారి వల్లనే జోహో విజయం సాధ్యమైందని చెబుతుంటారు వెంబు. బిలియనీర్ తరహాలో కంటే, పల్లెమనిషిగా జీవించడాన్ని ఇష్టపడే ఈయన గ్రామీణులకు ఐటీని చేరువ చేశారు. ఏ ఎంబీఏ కోర్స్లోనూ చెప్పని ఈ వాస్తవిక విజయ గాథ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నదని
ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు కదూ!
-బుద్దా మురళి, 98499 98087