తిప్ప తీగ ఔషధ మొక్క. దీనిని సంస్కృతంలో అమృతవల్లి అంటారు. పంట పొలాల్లో, చేను కంచెలపైన అతి సులువుగా పాకి కనిపిస్తుంది. దీని ఆకులు మనీప్లాంట్, రావి చెట్టు ఆకులను పోలి ఉంటాయి. ఈ తీగ అన్ని కాలల్లోనూ పచ్చగా ఉంటుంది. ఈ తీగను గుర్తించడం చాలా సులువు. అసలైన తిప్ప తీగను తుంచితే
పాలు కారవు. పంటచేల చీడ పీడల నివారణ కోసం రైతులు ఉపయోగించే ‘దశ పర్ణి’ ద్రావణం తయారీలో తిప్పతీగను ఉపయోగిస్తారు. చీడ సోకిన పంటలపై దశపర్ణి ద్రావణాన్ని పిచికారి చేస్తుంటారు. తిప్ప తీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఈ ఆకులు రసం, పొడితో క్యాప్సూల్స్ తయారుచేస్తారు. తిప్ప తీగ ఆకులను కషాయంలా చేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. తిప్ప ఆకుల్లో యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడగలవు. యూరిక్ ఆసిడ్ని తగ్గిస్తాయి. ఎండిన తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకొని తింటే అజీర్తి పోతుంది. దగ్గు, జలుబు, టాన్సిల్స్‌ని నివారిస్తుంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (లక్నో) పరిశోధన ప్రకారం తిప్ప తీగలో 35 రకాల జీవ రసాయనాలు ఉన్నాయి.
ఇందులో పదిహేను రకాల అల్కలాయిడ్స్, ఆరు రకాల ైగ్లెకోసైడ్స్, అయిదు రకాల ఆలిఫాటిక్ కాంపౌండ్స్, అయిదు రకాల డైటర్పనాయిడ్స్ ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. ఇవి మన శరీరంలో రక్షక దళాల్లాంటి తెల్ల రక్త కణాలని యాక్టివేట్ చేస్తాయి. అందుకే ఒక్క తిప్ప తీగ శరీరంలో ఉన్న తిప్పలన్నీ దూరం చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. అయితే, ఇన్ని సుగుణాలున్న తిప్ప తీగ ఔషధాన్ని గర్భిణులు ఉపయోగించకూడదని ఆయుర్వేద వైద్యులు చెబుతారు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు