కొత్త వాహనం చక్రాలను మొదటగా నిమ్మకాయలపై నడిపిస్తారు. వాహనానికి పూజ చేసిన తర్వాత దిష్టి తగలకూడదని నిమ్మకాయలు వేలాడదీస్తారు. నిమ్మకాయల దండలతో దేవతాలంకరణ చేయడం చూస్తూనే ఉన్నాం. పూర్తిగా పండిన నిమ్మపండు బీరపువ్వు (పసుపు)రంగులో ఉంటుంది. ఎర్రగా, తెల్లగా, గులాబీ రంగులో పండే నిమ్మపళ్లు కూడా ఉన్నాయి. పసుపు పచ్చగా ఉండే నిమ్మపండు రంగుని ‘లెమన్ ఎల్లో కలర్’ అంటారు. ఈ రంగు ఎంతోమంది చిత్రకారులకు స్ఫూర్తి.
ఇంప్రెషనిస్ట్ అయిన ప్రఖ్యాత కళాకారుడు మానెట్ చిత్రించిన ‘స్టిల్ లైఫ్’ సిరీస్‌లో 1880లో చిత్రించిన లెమన్ మాస్టర్ పీస్‌గా చెప్పుకొంటారు. రుచికి పుల్లగా ఉండటంతో నిమ్మపండుని చాలా వంటల్లో ఉపయోగిస్తున్నారు. పులిహోర, నిమ్మరసం చక్కెర కలిపి చేసే షర్బత్, నిలువ పచ్చళ్లు మన ఇళ్లలో ఎక్కువగా చేస్తున్నారు. అందుకే నిమ్మకాయ లేని వంటిల్లు ఉండదంటారు. నిమ్మరసం, షర్బత్ తాగడం వల్ల ఎండకాలం వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. నిరాహార దీక్షలు, ఉపవాసాలు విరమించేందుకు నిమ్మరసం తాగిస్తారు. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
చుండ్రు, మొటిమలు, చర్మ వ్యాధులకు నిమ్మరసం దివ్యౌషధం. మలబద్ధకం, అజీర్ణం, జీర్ణ వ్యాధులు ఉన్నవాళ్లు నిత్యం నిమ్మ రసం తాగితే ఆ సమస్యలు తొలగిపోతాయి. చర్మ సౌందర్య సాధనకు నిమ్మకు సాటి లేదు. ముఖం మీద మృత కణాలను, జిడ్డుని తొలగించి మృదువుగా చేస్తుంది. అందుకే నిమ్మరసాన్ని సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. నిమ్మసాగులో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. ఫింగర్, స్వీట్ లెమన్, మస్క్వైల్డ్, గజనిమ్మ మొదలుగునవి మనదేశంలో పండుతున్నాయి. మా తోటలో దాదాపు 55 నిమ్మ చెట్లు ఉన్నాయి. బోదె చేసి, కలుపు తీసి, నీళ్లు పోస్తున్నాం. అందువల్ల ఏడాది పొడుగునా నిమ్మకాయలు కాస్తున్నాయి.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు