పోషక విలువల పవర్ హౌస్ అత్తిపండు. ఇదేం పండు అనుకుంటున్నారా.. అదేనండి అంజీర్! డ్రై ఫ్రూట్స్ జాబితాలో ముందు వరుసలో ఉండే అంజీర్ రుచి తియ్యగా ఉంటుంది. పచ్చి అంజీర్ మేడిపండులా నిగనిగలాడుతూ కనిపిస్తుంటుంది. అందుకే దీనిని ‘ఇండియన్ ఫిగ్’ అంటారు. ఇందులోని గింజలు గసగసాలని పోలి ఉంటాయి. ఈ పండు తింటుంటే.. అందులోని గింజలు కరకరలాడుతూ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది.
అంజీర్ చెట్టు వైవిధ్యంగా ఉంటుంది. పెద్ద పెద్ద ఆకులతో ఎదుగుతుంది. పెరట్లో పెంచుకోవడానికి అనుకూలమైన చెట్టు. విత్తనాలను నాటి కానీ, అంటుకట్టిన మొక్కని నాటి కానీ పెంచుకోవచ్చు. ఈ మొక్క దాదాపు పది మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రతి ఆకు కింద కాండానికి కాయలు కాస్తాయి. పండిన తర్వాత కోసి ఎండబెడతారు. కత్తిరింపు చేస్తుంటే పండ్లు చేతికి సులభంగా అందుతాయి. ఎండినవే కాకుండా పండినవి కూడా తొక్కతో సహా తినొచ్చు. ఎండిన పండ్లను నలగ్గొట్టి దండగా గుచ్చుతారు. మార్కెట్లో రెడ్ అంజీర్, వైట్ అంజీర్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెడ్ అజీర్ కాస్త ఎక్కువ తియ్యగా ఉంటుంది.
అంజీర్ పండ్లు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. జీవక్రియలు సాఫీగా సాగుతాయి. చర్మం, జుట్టు అందంగా ఉంటాయి. ఇందులో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలం. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. అంజీర్లో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. ఈ పండు నానబెట్టిన నీళ్లు క్రమం తప్పకుండా తాగితే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యంపై స్పృహ పెరిగిన ఈ రోజుల్లో అంజీర్ సాగు లాభసాటి వ్యవహారమే అని చెప్పవచ్చు! మేడిపండు, అత్తిపండు చూడటానికి ఒకేలా ఉన్నా… చెట్లు, కాయలు కాసే విధానం వేరు. ఈ రెండు పండ్లను వలుచుకొని పురుగులున్నాయో, లేవో చూసుకున్నాకే తినాలి. ఇక పీవీ ఔషధ వనంలో దాదాపు ఇరవై అంజీర చెట్లు ఒక మేడి చెట్టు ఉన్నాయి.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు