ప్లాస్టిక్ ఇవ్వండి.. పట్టెడన్నం తినండి!
ఛత్తీస్‌గఢ్‌లోని ‘గార్బేజ్ కేఫ్' ప్లాస్టిక్‌తో పది మందికీ పట్టెడన్నం పెడుతున్నది. పర్యావరణానికి మేలు చేయడంతోపాటు ఆకలితో ఉన్న పేదలకు ఆసరాగా నిలుస్తున్నది. అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నది.
ప్లాస్టిక్ భూతం.. భూమాతను కమ్మేస్తున్నది. సౌకర్యం కోసం మనిషి సృష్టించిన ఈ అధునాతన పదార్థం.. సమస్త ప్రాణికోటికీ పెనుశాపంగా మారింది. మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ ముప్పుల్లో ముందువరసలో నిలిచింది. అయితే, ఛత్తీస్‌గఢ్‌లోని ‘గార్బేజ్ కేఫ్’ మాత్రం.. అదే ప్లాస్టిక్‌తో పది మందికీ పట్టెడన్నం పెడుతున్నది. పర్యావరణానికి మేలు చేయడంతోపాటు ఆకలితో ఉన్న పేదలకు ఆసరాగా నిలుస్తున్నది. అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నది.
2019లో అంబికాపూర్ బస్‌స్టాండ్ సమీపంలో.. భారతదేశంలోనే మొట్టమొదటి ‘గార్బేజ్ కేఫ్’ ప్రారంభమైంది. నగరంలో అప్పటికే ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ప్రధానంగా ఉండేది. అభాగ్యులు, నిరాశ్రయుల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. దాంతో, ప్లాస్టిక్ నివారణతోపాటు ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా భోజనం అందించాలని అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓ గొప్ప ఆలోచన చేసింది. ఏఎంసీ పారిశుధ్య బడ్జెట్ నిధులతో ‘గార్బేజ్ కేఫ్’ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టింది. వాడిపారేసిన ప్లాస్టిక్‌ను కేవలం చెత్తగానే చూడకుండా.. దానికి ఒక ఆర్థిక , సామాజిక విలువను కల్పించింది.

Ambikapur Muncipal Corporat
ఇలా పనిచేస్తుంది..
గార్బేజ్ కేఫ్‌లో లావాదేవీలన్నీ ప్లాస్టిక్ వ్యర్థాల రూపంలోనే నిర్వహిస్తారు. ప్లాస్టిక్ సీసాలు, కవర్లు, ప్యాకెట్లు లాంటి వివిధ రకాల వ్యర్థాలనే ఇక్కడ డబ్బుగా స్వీకరిస్తారు. ఎవరైనా సరే, ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి తెస్తే.. వారికి రుచికరమైన భోజనం వడ్డిస్తారు. అన్నం, రోటీ, పప్పు, వెజ్ కర్రీ, సలాడ్, పచ్చడితో కడుపు నింపుతారు. అదే, అరకిలో ప్లాస్టిక్ తీసుకొస్తే.. సమోసా, వడాపావ్ వంటి అల్పాహారం అందిస్తారు. ఈ విధానం ద్వారా పేదలు, దినసరి కూలీలు, నిరాశ్రయులు.. ఎంతోమంది ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే కడుపు నిండా భోజనం చేస్తున్నారు.

Garbage Cafe 1
సామాజిక-పర్యావరణ స్పృహ..
చెత్త ఏరుకునేవారే కాదు.. సాధారణ పౌరులు కూడా గార్బేజ్ కేఫ్‌కు వస్తున్నారు. పిల్లలు, యువకులు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకొచ్చి, పర్యావరణం పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో డంప్ యార్డుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం భారీగా తగ్గింది. 2019కి ముందు అంబికాపూర్ నగర వ్యాప్తంగా ఏడాదికి ఐదు టన్నులకు పైగా ప్లాస్టిక్ పోగయ్యేది. కేఫ్ ప్రారంభించిన తర్వాత క్రమంగా తగ్గుతూ.. 2024 వచ్చేసరికి రెండు టన్నులకే పరిమితమైనట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి.
జాతీయ స్థాయి గుర్తింపు..
అంబికాపూర్ గార్బేజ్ కేఫ్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది. స్వచ్ఛతను, సామాజిక సేవను అద్భుతంగా అనుసంధానించిన ఈ విధానాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రశంసించారు.

Garbage Cafe 2
మొత్తానికి, అంబికాపూర్ గార్బేజ్ కేఫ్ అంటే.. ఒక భోజన శాల మాత్రమే కాదు. పర్యావరణ పరిరక్షణను, సామాజిక సంక్షేమాన్ని ఎలా అనుసంధానించవచ్చో చూపించే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇలాంటి వినూత్న ఆలోచనలు దేశంలోని ఇతర నగరాలకూ ఆదర్శంగా నిలుస్తాయి. ఫలితంగా, పరిశుభ్రమైన, ఆకలి లేని సమాజాలు నిర్మితమవుతాయి.
మహిళా శక్తి తోడుగా..
గార్బేజ్ కేఫ్ విజయం వెనుక అంబికాపూర్ మహిళల పాత్ర కూడా ఉన్నది. నగరంలో దాదాపు 480 మంది మహిళలు ‘స్వచ్ఛతా దీదీలు’గా పనిచేస్తున్నారు. వీరు ఇ-రిక్షాల్లో ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తుంటారు. ఇలా సేకరించిన ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌కు పంపి.. ప్లాస్టిక్-కాంపోజిట్ రోడ్ల నిర్మాణ సామగ్రి వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా ప్లాస్టిక్‌ను పునర్వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని భారీగా తగ్గిస్తున్నారు.

Plastic Waste
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

