జాయ సేనాపతి
జరిగిన కథ : పినచోడుని మరణవార్తతో.. హుటాహుటిన దనదప్రోలుకు ప్రయాణమయ్యాడు జాయపుడు. తండ్రి శ్రాద్ధకర్మలన్నీ జరిపించాడు. అనుమకొండ వెళ్లాక నీలాంబ నివాసానికి వెళ్లాడు. సగం శరీరం కాలి.. జీవచ్ఛవంలా తల్పానికే పరిమితమైన నీలాంబను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
జరిగిన కథ : పినచోడుని మరణవార్తతో.. హుటాహుటిన దనదప్రోలుకు ప్రయాణమయ్యాడు జాయపుడు. తండ్రి శ్రాద్ధకర్మలన్నీ జరిపించాడు. అనుమకొండ వెళ్లాక నీలాంబ నివాసానికి వెళ్లాడు. సగం శరీరం కాలి.. జీవచ్ఛవంలా తల్పానికే పరిమితమైన నీలాంబను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. జాయపుణ్ని చూసి ఆమెకూడా మౌనంగా రోదించింది. నీలాంబ కాలిన కట్టెలా మంచాన మిగిలితే.. లలిత నిలువనీడ కోల్పోయిన మొక్కలా మిగిలింది.
మత్తి భానుమూర్తి
99893 71284
నీ లాంబ వేశ్యావాటిక పూర్వ వైభవానికి గణపతిదేవుడు, జాయపుడు పూర్తి సహాయసహకారాలు అందించారు. కానీ, నీలాంబ – లలితాంబలలో పూర్వపు ఉత్సాహసరదాలు తేలేకపోయారు. ఇప్పుడు జాయపుణ్ని చూసినప్పుడు అతను కూడా.. అచ్చం లలితాంబలాగే ఏదో కోల్పోయినట్లు.. ఎవరో అతని శక్తియుక్తులను బలవంతంగా లాక్కున్నట్లు తోచింది నీలాంబకు. ఆశ్చర్యంతో జాయపుని బుగ్గలు నిమురుతూ అడిగింది. “జాయా.. తమ్ముడా! ఏమైంది!? ఏదో కోల్పోయినట్లు.. కళావిహీనమై దీనంగా.. ఏమైంది నాయనా?”.. కరుణతో, ప్రేమతో ఆమె అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియలేదు అతనికి. అప్పుడే లలితాంబ లోపలికి వచ్చింది. అక్కా తమ్ముళ్లను చూసుకుంటూ.. జాయపుణ్ని పలకరించకుండానే, వడివడిగా మెట్లెక్కి పైకి వెళ్లిపోయింది.“నా శరీరం మంటల్లో కాలిపోయింది. కానీ, లలిత జీవితం.. మనసు మరింతగా కాలిపోయాయి జాయా!”. ఆమె కన్నీరు కళ్ల పక్కగా ప్రవహిస్తూ దిండులో ఇంకిపోతున్నాయి. “కాస్త దానిని ఓదార్చు జాయా.. నువ్వంటే దానికి ఎంత.. ఎంతో..” మాట పూర్తిచేయలేక పోయింది నీలాంబ. అర్థం చేసుకున్నట్లు తల పంకించాడు జాయపుడు. ‘లలితను నేను ఒదారుస్తాను. మరి నన్ను ఓదార్చే వారెవ్వరూ!?’ అనుకున్నాడు. అనలేదు. మెట్లెక్కి పైకి వెళ్లాడు. వసారా అంచున నిలబడి దూరంగా చూస్తున్నది. ఆమె ముఖంలో దారుణ అనుభవాల ప్రతిధ్వనులు జాయపునికి తెలుస్తున్నాయి. ‘నాముఖం కూడా అలాగే ఉన్నదేమో..’ అనుకున్నాడు. “అక్క చాలా దిగులు పెట్టుకున్నట్లుంది లలితా..” అన్నాడు జనాంతికంగా. “అవునా!??.. అవును మరి. మమ్మల్ని ప్రేమించే వాళ్లెవ్వరు జాయ మామా!? కనీసం కామించే వాళ్లు కూడా లేకుంటే..” ఆమె కంఠం వణికింది.
లలిత మాటల్లో తనను కూడా పట్టి ప్రశ్నిస్తున్నది. తనకు లలితపై యవ్వనోల్బణ శృంగార మేఘాలు కమ్ముకున్నాయి నిజమే. కానీ, అవెందుకో ప్రకీర్ణమై వర్షించలేదు. కారణం.. కాకతి కావచ్చు. లలితాంబ తన చుట్టూ ఓ అనురాగ మందిరాన్ని నిర్మించుకున్నదేమో.. అందుకే తనను చూసినప్పుడు ఆమెలో అంత నిర్వేదం. తను కాకతితో అనుమకొండలో తిరుగాడటం ఆమె స్వయంగా చూశానని చెప్పింది. ఆమె దగ్గరగా వెళ్లాడు. తనలో సంఘర్షిస్తున్న భావనలు లలితతోనైనా సమీక్షించుకోవాలని అనిపించింది. “నా యవ్వనారంభంలో ముగ్గురు అమ్మాయిలు నాకు దగ్గరగా వచ్చారు. ఓ పల్లె యువతి కాకతి.. ఓ రాజకుమారి ఇంద్రాణి.. ఓ మహిళా సంరక్షణ యోధురాలు లలితాంబ. వీళ్లు ముగ్గురూ నాకు దగ్గరగా.. చాలా దగ్గరగా వచ్చారు. ఎవ్వరిని జీవితభాగస్వామిగా నిర్ణయించుకోవాలో తేల్చుకోలేకపోయాను. ఎందుకు? నాలో ప్రేమ రాహిత్యముందా.. నేను ఎవరినీ మనసుకు తీసుకోలేకపోతున్నానా!? అని సతమతమైపోతున్న సమయంలో కాకతి మరింత దగ్గరై.. శారీరకంగా..” పూర్తిచేయలేక పోయాడు.
కొన్నిలిప్తల కాలం నిశ్శబ్దం. ఆమెకు అర్థం కావాలని.. ఆమెకు చెప్పుకోవాలని జాయపుని ఆర్తి.. అర్థం చేసుకున్న లలిత అసహనంగా కదిలి దీర్ఘంగా నిట్టూర్పు వదిలింది. “కానీ అప్పుడే జరగరానిది జరిగింది..” అంటూ భైరవ ఆత్మాహుతి అంశం చెప్పాడు.
“అప్పట్నుంచి కాకతి అదృశ్యమైంది. నేనేమిటి.. నా బతుకు ఏమిటి.. ఏం చెయ్యాలి ఇప్పుడు.. బతుకంతా??”.. పూర్తి చేయలేకపోయాడు. కొన్ని లిప్తలకాలం నిశ్శబ్దం. దిగ్భ్రమతో కదిలింది లలిత. దగ్గరగా వచ్చి అతని కళ్లలో కళ్లుపెట్టి చూసింది చకితంగా. అతనిపై పేరుకున్న కోపం, అసహ్యం.. కరిగి పూర్తిగా ప్రక్షాళనమైనట్లు అనునయంగా దగ్గరగా వచ్చింది. అతని భుజాలను పట్టుకుంది. మరింత దగ్గరగా వెళ్లి చేతులు వెనక్కిదించి.. లాక్కున్నట్లు గాఢంగా హత్తుకుంది. గాఢ పరిష్వంగం! మరి కాసేపటికి దూరం జరిగింది.
“నీ ప్రశ్నకు జవాబు నా దగ్గర లేదు మామా..” ఆమె గొంతు గాద్గదికమైంది. మెట్లవైపు కదిలాడు. ఎవరికో ఒకరికి చెప్పేసుకున్నాడు. మొదటిసారి.. ఏమో చివరిసారి కావచ్చు కూడా. వెనుదిరిగాడు. “నీ కోసం.. నీకు సాంత్వన కలిగించడానికి నేనెప్పుడూ ఎదురు చూస్తుంటాను మామా!”.. లలిత నుంచి మరోమాట ఆశించాడు. ‘మరి నేను కూడా కాకతి కోసం ఎదురుచూస్తూ ఉండాల్సిందే కదా లలితా!’. అనాలని అనుకున్నాడు. అనలేదు. మెట్లు దిగిపోయాడు.
* * *
ఒకరోజు నారాంబను అడిగాడు జాయపుడు.“అక్కా.. పట్టమహిషి సోమలదేవి అక్కగారు ఏమిటి.. నేను పలకరించినా తల తిప్పుకొని వెళ్లిపోతున్నారు. ఏమిటి కారణం? ఎప్పుడూ ‘అక్కా!’ అనే పిలుస్తాను. మాట్లాడుతుంది అభిమానంగా. అలాంటిది ఇవ్వాళ ఏమైనట్టు?”. ఉక్కిరి బిక్కిరయ్యింది నారాంబ. తలవాల్చి మౌనంగా ఉంది. ఆశ్చర్యపోవడం ఈసారి జాయపుని వంతయ్యింది.
“ఏమిటక్కా.. నా ప్రశ్నకు మౌనం ఏమిటి.. నేను అడుగుతుంటే జవాబు చెప్పవేం!?”. ఆమె కళ్ల నుంచి నీళ్లు జలజలా రాలాయి. కానీ మళ్లీ మౌనమే. ఎప్పుడూ ప్రశంసల వర్షం కురిపించే సోమలదేవి.. అక్కల పెళ్లిళ్ల తరువాత తనను పలకరించేతీరు మారిపోయినట్లు ఇప్పుడు.. పదేళ్ల తర్వాత గుర్తించాడు. ఈ సంఘటన అంతఃపుర ప్రవేశం వద్ద జరిగింది. ఆరోజు రాజనగరులో నీలాంబిక ఆధ్వర్యంలో జరిగిన తోలుబొమ్మలాట కార్యక్రమానికి ఇరువురు భార్యలతో విచ్చేశాడు చక్రవర్తి. కొలని యుద్ధం జరుగుతున్న వేళ కూడా గణపతిదేవుడు కళాప్రాంగణానికి రావడం మానలేదు. అక్కడ సోమలదేవిని రాచమర్యాదల ప్రకారం తలవాల్చి ఆప్యాయంగా పలకరించాడు జాయపుడు. ఆమె తిరస్కారంగా ఎవరో బానిసను చూసినట్లు చూసి తలతిప్పుకొని వెళ్లిపోయింది. ‘సవతికి తమ్ముణ్ని అని కాబోలు!’ అనుకున్నాడు. ఆమె ప్రవర్తన అలా మనసులో ఉండిపోయింది. ఇప్పుడు నారాంబ కూడా దుఃఖభాజనురాలు కావడం జాయపుణ్ని మరింత ఆలోచనలో పడేసింది.
సవతులు కావడాన ఇద్దరిమధ్యా తేడాలు సహజం. అవి మరీ పెద్దవి అవుతున్నాయా!? బావగారి దృష్టికి వెళ్తున్నాయా!? అప్పుడు గుర్తొచ్చింది. అంతఃపురాన్నే రెండుగా పునర్నిర్మించాడు చక్రవర్తి. మధ్యగా గోడ నిర్మించి భార్యలిద్దరూ రోజూ ఎదురుపడకుండా, దినమూ కలుసుకోకుండా అంతఃపురాలను వేరువేరుగా దుర్భేద్యం చేశారు. తను దీనిపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. తప్పకుండా దూరాలు ఉన్నాయీ.. దురంతాలూ జరుగుతున్నాయి. అక్క కన్నీరు పెట్టుకోవడం జాయపుణ్ని హతాశుణ్ని చేసింది. తనది భగ్నమైన బతుకుగా తోస్తున్నది. మనసైన స్త్రీ ఉందో లేదో తెలియని ఎండమావి జీవితం కావచ్చు. కానీ, అక్కల కోసమే ఎన్నో చేశాడు.. ఇక ముందూ చేస్తాడు. “చిన్నవాడివి. మగవాడివి. నీతో ఏం చెప్పను?! ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియని బతుకు నాది. పుట్టినప్పటి నుంచి తోడున్న అక్క నన్నొదిలేసి, దాని కొడుకు బాధ్యతకూడా నాపై పెట్టి వెళ్లిపోయింది. కొంగు కింద దాచుకున్న అమ్మ ఆ దిగులుతోనే దూరమయ్యింది. బావగారు మంచివారే కానీ, పగబట్టిన పట్టమహిషిని ఏం చెయ్యగలరు!?”. ఆమె మాటలకు జాయపుని శరీరం జలదరించింది. ఆ మాటల్లో ఓ స్త్రీ చెప్పరాని ఆర్తి.. అంతఃపుర భవనాలలో జరుగుతున్న అంతర్గత అణచివేతల ఆర్తారావం వినిపించింది. “ఎందుకు పగబట్టింది?”. నారాంబ పరిచారికల ద్వారా సోమలదేవి గురించి విన్నవి వివరించింది.
“సోమలదేవి వికృత మనస్విని. అందరితో సమన్వయంతో జీవించే మహిళ కాదు. ‘నామాటే నెగ్గాలి.. అదే జరగాలి’ అని భావించే రాచరికవ్యవస్థకు పూసిన పుష్పం. గణపతిదేవుని వివాహమాడటంలో భార్యాలిద్దరివీ రెండు వింతమార్గాలు. తండ్రి బంధించిన కారాగారవాసిని వివాహమాడి.. కాకతీయ రాజ్యానికి పట్టపురాణి అయ్యింది సోమలదేవి. ‘ఎంతైనా ఈ భర్త మా కారాగారంలో బందీగా ఉన్నవాడేగా!?’.. ‘ఆ మహాఇల్లాలు ఇక్కడ ఆరేళ్లు బందీగా పడిఉండి.. నా ఖర్మకొద్దీ భార్య అయ్యింది!’. ‘ఓ బందీ నాకు సవతా!? నాతోటి మహారాణా!? హవ్వ.. నా పరిచారికగా కూడా పనికిరాదు. ఎంత అవమానం తెచ్చిపెట్టాడీ మొగుడు?’.. మహామండలీశ్వరుడైన భర్త గురించి అంత చులకనగా మాట్లాడటం నాకే ఆశ్చర్యంగా ఉంది. బావగారు ఆమె ప్రసక్తి ఎప్పుడూ తేరు. అడిగినా.. ‘మనిద్దరి సంగతి మాట్లాడు!’ అంటారు. దేవగిరిలో బందీగా ఉన్న ఈయనను విడిపించడానికి జరిగిన ఘర్షణలు.. ఒప్పందాల్లో భాగంగా ఈమె బావగారికి భార్య అయ్యింది. అసలు అక్కడే ఈయన మరోకామెతో సన్నిహితంగా ఉన్నారని.. ఆమె చనిపోయిందని.. ఆమెకు ఓ చెల్లెలు ఉన్నదని.. ఆమె బతికే ఉన్నదని.. బావగారు ఆమెను అప్పుడప్పుడూ కలుస్తుంటారని ఈవిడకు అనుమానం. అందుకే బావగారిని శయనమందిరంలో రకరకాల మాటలతో హింసిస్తుంది కాబోలు. పాపం అన్నీ భరిస్తాడీ దేవుడు!”.. నారాంబ చెప్పినవి విన్న జాయపుడు చాలా ఆశ్చర్యపోయాడు. అక్క చాలా సుఖ పడుతున్నదని, బావగారు బాగా చూసుకుంటున్నాడని ఇంతకాలం భావించాడు. దైవస్వరూపుడు ఆయన. కానీ అక్క పరిస్థితి చూస్తే ఆమె సుఖపడుతున్నదా.. సందేహమే!! గణపతిదేవునికి ఆమెపై ఉన్నది అవ్యాజానురాగం. రాత్రివేళ ఆయన ఎక్కువగా నారాంబ మందిరానికే పరిమితమవుతాడు. గణపతిదేవునికి కాకతీయ సామ్రాజ్యమే లోకం. ఆంధ్రరాజ్య స్థాపనే లక్ష్యం. ఎలాంటి ఆంతరంగిక విషయాలు ఆయన ముఖంలో ప్రతిఫలించవు. ఆయనకు ఇంతవరకూ ఆంతరంగికులు లేరు. మనసులో మాట చెప్పుకొనే ఆత్మీయులు అంటే.. ఒక్క భార్య నారాంబ. ఒక్క బంధువు జాయపుడు!! ఇటీవల ఆయన ఇద్దరి భార్యలమధ్య సయోధ్య కుదిర్చాలని మళ్లీ అంతఃపురాన్ని ఒక్కటి చేశాడు. దాంతో కష్టాలు మొదలయ్యాయి నారాంబకు. అంతఃపుర రాజకీయాల ఆటుపోట్లు తెలుస్తున్నాయి అక్కా తమ్ముళ్లకు.
* * *
ఎన్ని ప్రయత్నాలు చేసినా కాకతి ఆచూకీ తెలియడం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఓ నిట్టూర్పు.. జనం మధ్య ఉన్నప్పుడు ముఖానికి నవ్వు తగిలించుకున్నా లోలోన ఓ దుఃఖం.. గుక్కలు పట్టి ఏడుస్తున్నట్లు.. అది మొత్తంగా ఓ విషాద అనాహత ధ్వనిలా.. నృత్తంలో.. గానంలో.. వాద్యంలో.. ఒంటరితనంలో.. పఠనంలో.. సంబురాలలో.. సంతోషాలలో.. నవ్వుల్లో.. దైనందినం అంతటా.. బతుకు అంతటా.. అందుకేనా తన యుద్ధంలో ఓ విశృంఖల ప్రచండతీవ్రత.. తన నాట్యంలో అబ్బురపరచే ఓ విన్యాసవిన్నాణం!! బయట అసాధారణ యుద్ధయోధుడు, అద్భుత నాట్యకారుడు.. లోపల మరొకడు. ఎవడు? ఎవడు తను?? పురనివాసం మొదటి అంతర్వు వసారాలో నిలబడి వీధులను పరికిస్తున్నాడు జాయపుడు. చీకటి చిక్కబడలేదు కానీ.. వర్షం. చిన్నగా కురుస్తున్నది. ముసురుపట్టింది మూన్నాళ్లుగా. చీకటి, వర్షం కలగలిసిన వింత సవ్వడి ఏదో వినిపిస్తున్నది. కాగడాల వెలుగులో వర్షపుధార మెరుస్తూ కురుస్తున్నది. ఆ సన్నని వెలుగులో వీధి చివరి నుంచి అశ్వంపై ఓ మహిళ. దూరానికి కూడా ఆమె ఆహార్యం, ఆభరణాల మెరుపు మహిళ కులీనతను పట్టిస్తున్నది. తలపై శాలువాలాంటిది కప్పుకొని ఉంది. వచ్చివచ్చి ఆశ్చర్యకరంగా అక్కడే జాయపుని నివాసం దగ్గరగా నెమ్మదించి.. అటూ ఇటూ పరకాయించి చూసి నిర్ధారించుకుని గుర్రం దిగింది. తలపై ఉన్న ముసుగు తొలగించి.. తలపైకెత్తి జాయపుణ్ని చూసింది. జాయపుని ఒళ్లు జలదరించింది. ఆమెను గుర్తించాడు.
(సశేషం)
నారాంబ చెప్పినవి విన్న జాయపుడు చాలా ఆశ్చర్యపోయాడు. అక్క చాలా సుఖ పడుతున్నదని, బావగారు బాగా చూసుకుంటున్నాడని ఇంతకాలం భావించాడు. దైవస్వరూపుడు ఆయన. కానీ, అక్క పరిస్థితి చూస్తే.. ఆమె సుఖపడుతున్నదా!? సందేహమే!! గణపతిదేవునికి ఆమెపై ఉన్నది అవ్యాజానురాగం.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

