Social Media | వాక్ స్వాతంత్య్రం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అలాగని నోరు జారతామంటే హక్కు కల్పించిన రాజ్యాంగమే చుక్కలు చూపిస్తుంది. పకడ్బందీ చట్టాలున్నా… వాక్ స్వేచ్ఛ సామాజిక మాధ్యమాల్లో ఎందరి స్వేచ్ఛనో హరిస్తున్నది. అయితే, పరువుకు భంగం కలిగించే వాచాలురపై కొరడా ఝళిపించే అవకాశాన్ని కూడా రాజ్యాంగం ఇచ్చిందని బాధితులు తెలుసుకోవాలి. అదే సమయంలో ఎవరు అడుగుతారని అతిగా స్పందించే సామాజిక మాధ్యమవేత్తల ఫ్రీడమ్ ఢమాలవ్వడం ఖాయమంటున్నాయి చట్టాలు!
‘నరం లేని నాలుక ఎన్ని మాటలైనా అంటుంది’ అన్నది పాత మాట. ఆవేశంలో నాలుగు మాటలన్నా అవి గాల్లో కలిసిపోతాయి. కానీ, సామాజిక మాధ్యమాల్లో అనాలోచితంగా చేసే పోస్టు నిమిషాల వ్యవధిలోనే వేలమందికి చేరిపోతుంది. ఈ గొలుసుకట్టుకు అడ్డుకట్ట వేయడం అనుకున్నంత తేలికేం కాదు! సోషల్ మీడియాలో పోస్టు చేసే ఒక మంచిమాట రెండు లైక్‌లు సంపాదించే లోపు.. ఒక్క చెత్త పోస్టు వేలల్లో షేర్లు సాధిస్తుంది. ఈ విపరీత ధోరణి కొందరికి పైశాచిక ఆనందాన్నిస్తే.. బాధితులను మాత్రం రోజులు, నెలల తరబడి కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. వ్యక్తిగత కక్ష, ఎదుటివారి ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో చేసే పోస్టులను ఉపేక్షించడం తగదు. బాధితులు స్పందించడం ఆలస్యమయ్యే కొద్దీ సమస్య తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ‘వాళ్ల పాపాన వాళ్లే పోతారు’ అనే మెతక వైఖరి అవలంబిస్తే… ఈ రోజు మీకు జరిగింది, రేపు మరొకరికి జరగొచ్చు. అందుకే సోషల్ మీడియా కీచకులకు కీలెరిగిన వాత పెట్టాలి. చట్టం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరిధి దాటి ప్రవర్తించే నెటిజన్లపై కఠిన చర్యలకు సిద్ధమవ్వాలి.
బస్సులో ఎవరైనా గొడవకు దిగితే.. అవతలి వ్యక్తి ఒడ్డూపొడుగూ చూశాక గానీ ఎదురు తిరిగే సాహసం చేయం. కానీ, సామాజిక మాధ్యమాల్లో మాత్రం చాలామందికి మనల్ని ఎవరు అడుగు తారనే ధీమా! అందుకే బుర్రకు పట్టిన బూజునంతా పోస్టు చేస్తుంటారు. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చౌకబారు పాండిత్యం ప్రదర్శిస్తుంటారు. కొందరైతే ఎదుటివారిని కించపరుస్తూ సంచలనం సృష్టించాలని సదా సోంచాయిస్తుంటారు.
కొందరు ఉద్యోగులు ఫ్రస్ట్రేషన్లో యాజమాన్యంపై, ఉన్నతాధికారులపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర పదజాలంలో పోస్టులు పెడుతుంటారు. అసభ్య పదజాలం, అభ్యంతరకర సందేశాలు పంపి కంపెనీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తారు.
కొందరు మాజీ ప్రేమికులు తమ కక్షనంతా తీర్చుకో వడానికి సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంటున్నారు. గతంలో దిగిన ఫొటోలు, ఫోన్ సంభాషణలు కూడా పబ్లిక్ చేసి అభాగ్యుల జీవితాలను రోడ్డుకీడుస్తున్నారు. సన్నిహితంగా ఉన్న వీడియోలను పోర్న్ వెబ్సైట్లలో అప్లోడ్ చేసి పైశాచిక ఆనందం పొందే దుర్మార్గులూ ఉన్నారు.
వైరి పక్షాలపై బురద చల్లడానికి రాజకీయ పార్టీలు ఇప్పుడు సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా ఎంచుకుంటున్నాయి. ఆధారాలు, నిజానిజాలతో పనిలేకుండా తీవ్ర ఆరోపణలు చేసి ప్రజలపైకి వదులుతున్నాయి.
మతపరమైన సున్నితమైన అంశాలపై, ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు, కామెంట్లు చేసేవారు వాడకొకరు తయారవుతున్నారు. రిపోర్ట్ చేయండిలా..
ఫేస్బుక్లో ఎవరైనా మీ పరువుకు భంగం వాటిల్లేలా పోస్టులు పెట్టినా, మీ అకౌంట్‌ను హ్యాక్ చేసి దాని ద్వారా ఏదైనా సమస్యలు సృష్టించినా.. https://www.facebook.com/help/contact/430253071144967 లింక్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు.
ఇన్స్టాగ్రామ్: https://help.instagram.com/ contact/653100351788502
ఎక్స్ (ట్విటర్): https://help.twitter.com/en/forms/safety-and-sensitive-content
లింక్డిన్: https://www.linkedin.com/help/ linkedin/ask/rhsc
స్నాప్‌చాట్: https://help.snapchat.com/ hc/en-us/articles/7012399221652-How-to-Report-Abuse-on-Snapchat
తక్షణం స్పందించండి..
మీ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ఎవరైనా పోస్టులు పెడితే వెంటనే పైన పేర్కొన్న లింక్‌ల ద్వారా రిపోర్ట్ చేయండి. ఆ తర్వాత సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. https://www.cybercrime.gov.in/ వెబ్సైట్ ద్వారా కంప్లయింట్ చేయొచ్చు. దీంతోపాటు దేశ సమైక్యతకు భంగం కలిగించేలా, మత ఘర్షణలను ప్రోత్సహించేలా ఏవైనా కామెంట్లు, పోస్టులు కనిపిస్తే… కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ) https://www.cert-in.org.in/PDF/Report_Contribute.pdf లింక్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. మనకెందుకు అని ఊరుకుంటే… సమస్య మీ దాకా వచ్చినప్పుడు స్పందించే వ్యక్తులు కరువవుతారు.
ఆర్టికల్ 19 (1)(ఏ) ప్రకారం రాజ్యాంగం వాక్ స్వాతంత్య్ర హక్కు కల్పించింది. అయితే, ఆ మాటలు ఎవరైనా వ్యక్తి స్వేచ్ఛకు, పరువుకు భంగం కలిగించేలా ఉంటే.. ఐపీసీ సెక్షన్ 66ఏ ప్రకారం పరువు నష్టం దావా వేయొచ్చు. ఐపీసీ 499 సెక్షన్ ప్రకారం వాక్ స్వాతంత్య్రం పేరుతో.. ఎవరైనా వ్యక్తికి, అతని ప్రతిష్ఠకు హాని కలిగించేలా మాట్లాడినా, సంకేతాలు చూపించినా/ పంపినా, ప్రచురించినా బాధితులు పరువు నష్టం దాఖలు చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 ప్రకారం సామాజిక మాధ్యమాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వ్యక్తి ప్రతిష్ఠను ఇబ్బందిపాలు చేస్తే ఐపీసీ సెక్షన్ 66సీ ప్రకారం ఐడెంటిటీ థ్రెట్, ఐపీసీ 66డీ ప్రకారం చీటింగ్ పర్సనేషన్ ద్వారా చర్యలు తీసుకోవచ్చు.