సృజన్, చైతన్యను వాళ్ల పేరెంట్సే చంపారని తెలుసుకొన్న ఇన్స్పెక్టర్ రుద్ర.. ఎవరు ఎవర్ని చంపారో తెలుసుకోవడానికి వారిని ఇంటరాగేట్ చేయాలనుకొన్నాడు. అయితే, స్టేషన్‌కు వస్తున్న క్రమంలో పెట్రోల్ బంకు దగ్గర జరిగిన బ్లాస్టింగ్‌లో బాధితుల ఇద్దరి పేరెంట్స్ చనిపోయారు. దీంతో ఆ హత్య కేసు ముందుకు కదల్లేదు. ఈ క్రమంలో బ్లాస్టింగ్ వెనుక ఏదైనా కుట్ర ఉందా? అన్న కోణంలో దర్యాప్తు జరపాలని హెడ్‌కానిస్టేబుల్ రామస్వామిని పురమాయించాడు రుద్ర.
‘మిస్టర్ రుద్ర.. నేను చూసిన అత్యంత రేరెస్ట్ కేసు ఇది. ఈ ప్రేమికులను చంపిన ఆ హంతకులకు తప్పకుండా శిక్ష పడుతుంది’ అంటూ డాక్టర్ కండ్లు తుడుచుకొంటూ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రుద్రకు. వెంటనే హాస్పిటల్‌కు వస్తున్నట్టు డాక్టర్‌కు సమాచారమిచ్చిన రుద్ర.. గంటన్నరలో అక్కడికి చేరుకొన్నాడు. ‘వెల్కమ్ రుద్ర.. ఏంటీ మరో కొత్త కేసుతో వచ్చారా?’ అన్న డాక్టర్ ప్రభాకర్ మాటలకు ‘ఉన్న కేసులోనే కొత్త ట్విస్టు కనిపించింది డాక్టర్’ అంటూ వెంటనే బదులిచ్చాడు రుద్ర. ‘ఏంటా ట్విస్ట్?’ అంటూ అప్పుడే ఎండనపడొచ్చిన రుద్రకు కూల్‌డ్రింక్ ఆఫర్ చేస్తూ ఆసక్తిగా అడిగాడు డాక్టర్. ‘అది మీరే చెప్పాలి’ అంటూ రుద్ర నర్మగర్భంగా నవ్వాడు.
అర్థం కానట్టు చూస్తున్న ప్రభాకర్‌తో.. ‘డాక్టర్.. సూటిగా మ్యాటర్‌లోకి వస్తున్నా.. కేసు వివరాలు పూర్తిగా తెలిసిన నేనే.. చనిపోయిన సృజన్, చైతన్య ఇద్దరూ లవర్స్ అని చివర్లో తీర్మానానికి వచ్చా. అయితే, పోస్ట్‌మార్టం చేసిన వెంటనే నాతో మాట్లాడుతూ.. వాళ్లు లవర్స్ అంటూ మీరు చెప్పారు. ఎలా?’ అంటూ రుద్ర అడిగిన ప్రశ్నకు డాక్టర్ ముఖం వాడిపోయింది. టేబుల్ మీద ఉన్న గ్లాసులోని కూల్‌డ్రింక్ తాగిన డాక్టర్.. ‘మిస్టర్ రుద్ర.. సాధారణంగా మా దగ్గరకు వచ్చే ఇలాంటి కేసులు ప్రేమ వ్యవహారానికి సంబంధించినవే ఉంటాయి. నేనూ అలాగే గెస్ చేశా’ అంటున్న డాక్టర్‌ను అనుమానంగా చూసిన రుద్ర.. సృజన్, చైతన్య పేరెంట్స్ ఇండ్లలో తనకు దొరికిన కొన్ని ప్రిస్క్రిప్షన్లను డాక్టర్ ముందుంచాడు. నాడీకణాలను ఉత్తేజితం చేసి, మైండ్‌ను స్థిమితంగా ఉంచని ఇంజెక్షన్‌కు సంబంధించిన ప్రిస్క్రిప్షన్లు అవి. వాటిపై డాక్టర్ సంతకం కూడా ఉంది.
దాన్ని చూసిన డాక్టర్.. ‘మిస్టర్ రుద్ర. ఇక దాచుకోవడానికి ఏమీలేదు. మొత్తం చెప్తాను’ అంటూ ఇలా ప్రారంభించాడు. ‘నా కొడుకు అశ్విన్. డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఇదే క్రమంలో చైతన్యను కూడా గాఢంగా ప్రేమించాడు. అయితే, ఆ చైతన్య మాత్రం సృజన్‌ను ఇష్టపడింది. ఇది తట్టుకోలేని అశ్విన్.. ఆ విషయాన్ని సృజన్, చైతన్య ఇండ్లల్లో చెప్పేశాడు. క్యాస్ట్ మూలంగా ఆ ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయని తెలిసే వాడు అలా చేశాడు. దాన్ని నేను వ్యతిరేకించాను. దీంతో ఓసారి నాపై హత్యాయత్నానికి కూడా ప్రయత్నించాడు. ఇక, అది పక్కనపెడితే.. సృజన్, చైతన్య పేరెంట్స్ ఇద్దరికీ నేను ఫ్యామిలీ డాక్టర్ని. సృజన్, చైతన్య ప్రేమ వ్యవహారాన్ని వాళ్లవాళ్ల పేరెంట్స్ నాకు చెప్పారు. మారిన కాలంతోపాటు మనమూ మారాలని నేను ఎంతో చెప్పిచూశా. అయితే, వాళ్లు మారలేదు. పిల్లలను చంపడానికి ఏదైనా డ్రగ్ ఇవ్వాలని అడిగారు. నేను కుదరదన్నా. అయితే, నా సంతకం ఫోర్జరీ చేసిన అశ్విన్.. వాళ్లకు ఆ డ్రగ్‌ను నాలుగైదు ప్రిస్క్రిప్షన్స్‌లో ఇచ్చాడు. తనకు దక్కని చైతన్య.. తన ప్రేమకు అడ్డుపడ్డ సృజన్ చావాలని నిర్ణయించుకొనే ఇలా చేశాడు. క్యాస్ట్ ఫీలింగ్‌తో పేరెంట్సే వాళ్లను చంపేశారు. ఇదీ జరిగింది. అందుకే.. ఈ ప్రేమికులను చంపిన ఆ హంతకులకు తప్పకుండా శిక్ష పడుతుందన్నా’ అని కండ్లు తుడుచుకొన్నాడు ప్రభాకర్. అప్పుడే అక్కడికి వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి.. ‘పెట్రోల్‌బంకులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగింద’ని చెప్తూ ఉండగా.. బయటి నుంచి వేగంగా వచ్చిన ఓ బుల్లెట్ సరిగ్గా డాక్టర్ గుండెల్లోకి చొచ్చుకుపోవడంతో ప్రభాకర్ అక్కడికక్కడే మరణించాడు.
జరిగిన హఠాత్పరిణామానికి రుద్ర, రామస్వామి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాల్చిందెవరంటూ బుల్లెట్ వచ్చిన ఎదురు బిల్డింగ్ టెర్రస్మీదకి పరిగెత్తారు. అయితే, అక్కడ ఎవ్వరూ లేరు. నేలపై పడ్డ తుపాకీ ఎర్రగా పొగలు కక్కుతున్నది. తుపాకీలోని ఎజెక్టార్ రాడ్, మజిల్, ట్రిగ్గర్ ఇలా అన్నీ చాలా వేడిగా ఉన్నాయి. పక్కనే ఓ కాకి గాయంతో గిలగిలాకొట్టుకొంటున్నది. అక్కడేం జరుగుతుందో ఎవరికీ అర్థంకాలేదు. ఫోరెన్సిక్ టీమ్ వచ్చింది. ఆ తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్టే డాక్టర్ గుండెల్లోకి చొచ్చుకుపోయినట్టు నిర్ధారించారు. మరిన్ని పరీక్షలు చేయాలని తుపాకీని ల్యాబ్‌కు తీసుకెళ్లారు. మరోవైపు.. బిల్డింగ్ చుట్టుపక్కలా సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తే.. ఘటన జరిగిన తర్వాత ఎవ్వరూ టెర్రస్ మీద నుంచి బయటికి పరిగెత్తినట్టు కూడా లేదు. దీంతో అసలు ఏం జరుగుతుందో రుద్రకు అర్థంకాలేదు. ఇదివరకే డాక్టర్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ అశ్వినే మళ్లీ ఈ పని చేశాడా? ఇలాంటి ఆలోచనలతో రుద్ర మెదడు వేడెక్కిపోయింది.
రెండు గంటలు గడిచాయి. తన క్యాబిన్లో కూర్చున్న రుద్ర చేతికి రామస్వామి ఓ ఫైల్ ఇచ్చాడు. ‘సార్.. డాక్టర్ చనిపోగానే మీరు నన్ను అతని ఇంటికి ఇన్వెస్టిగేషన్ కోసమని వెళ్లమన్నారుగా. అక్కడ నాకు చాలా విషయాలు తెలిశాయి. ఈ డాక్టర్ ప్రభాకర్ మనకు చాలావరకూ అబద్ధాలే చెప్పాడు సార్. డాక్టర్ వాళ్ల అబ్బాయి అశ్విన్ ఎప్పుడో సూసైడ్ చేసుకొన్నాడు. చైతన్య తన ప్రేమను కాదనడంతో పాపం ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే, కొడుకు చనిపోయిన ఆ విషయాన్ని లోకం ముందు దాచిపెట్టిన డాక్టర్.. తన కొడుకు మరణానికి కారణమైన సృజన్, చైతన్యపై పగ తీర్చుకోవాలనుకొన్నాడు. వాళ్ల పేరెంట్స్‌తోనే వాళ్లను చంపించాడు. నేరం తన మీదకు రాకుండా ఉండాలనే.. కొడుకు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి అశ్వినే ఇవన్నీ చేశాడని మనల్ని నమ్మించాడు’ అంటూ కొన్ని ఆధారాలు చూపించాడు రామస్వామి. ‘బాబాయ్.. కేసు సగం సాల్వ్ చేశావ్. ఇంతలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. తుపాకీ మీద ఎవరో థర్మైట్ రసాయనాన్ని పూశారని, ట్రిగ్గర్‌కు సన్నని అల్యూమినియం తీగ చుట్టారని ఆ ఫోన్ సారాంశం. అలాగే, ఘటన జరగడానికి గంట ముందు ఆ బిల్డింగ్‌లోకి ఒక్క డాక్టర్ ప్రభాకర్ తప్ప మరెవ్వరూ వెళ్లలేదని సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలిసినట్టు కూడా ఫోరెన్సిక్ ప్రతినిధి తెలిపారు. దీంతో అసలు హంతకుడు డాక్టర్ ప్రభాకరేనని నిర్ధారించాడు రుద్ర. అంతేకాదు.. తాను హంతకుడిని కాదని నిరూపించుకొనే క్రమంలో జరిగిన చిన్న మిస్టేక్‌తో డాక్టర్ ప్రాణాలు విడిచినట్టు కూడా రామస్వామికి రుద్ర క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలేం జరిగిందో మీరు చెప్పగలరా?
సమాధానం:
నిజానికి డాక్టర్‌ను ఎవరూ షూట్ చేయలేదు. ఆ సెటప్ అంతా డాక్టరే ఫిక్స్ చేసుకొన్నాడు. ఎప్పుడైతే, రుద్ర తన దగ్గరికి వస్తున్నట్టు చెప్పాడో.. కేసు తనమీదకు రాకుండా ఉండేందుకు, తన కొడుకు అశ్వినే ఇదంతా చేస్తున్నట్టు నమ్మించడానికి ఆ డాక్టర్ గంట ముందే ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎండ తగలగానే భగభగమనేలా వేడెక్కే థర్మైట్ రసాయనాన్ని రివాల్వర్‌కి పూసి, ట్రిగ్గర్‌కు సన్నని అల్యూమినియం తీగను చుట్టి తన చేతికి తూటా తగిలేలా రివాల్వర్‌ను తన క్యాబిన్ కిటికీకి ఎదురుగా ఉన్న బిల్డింగ్ టెర్రస్ మీద సెటప్ చేశాడు డాక్టర్. సరిగ్గా రుద్ర వచ్చేసరికి అది వేడెక్కి.. అల్యూమినియం తీగ కరిగే సమయానికి అక్కడికి వచ్చిన ఓ కాకి రివాల్వర్‌పై వాలింది. దీంతో డైరెక్షన్ మారి ఆ బుల్లెట్ డాక్టర్ గుండెలోపలికి చొచ్చుకుపోయింది. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లోనూ ఇదే విషయం తేలింది. కాగా కేసును సగంవరకూ సాల్వ్ చేసిన రామస్వామిని రుద్ర ఎంతగానో మెచ్చుకొన్నాడు….?
-రాజశేఖర్ కడవేర్గు