Fake Call | ట్రూకాలర్ లాంటి యాప్స్‌తో అలెర్ట్‌గా ఉన్నా.. అన్నోన్ నంబర్లు ఎత్తొద్దని వ్రతం పూనినా.. తెలియని ఫోన్ నంబర్లను బ్లాక్ చేస్తున్నా.. ‘కాల్’నాగులకు కళ్లెం పడటం లేదు. ఎంత అవాయిడ్ చేసినా కొత్త నంబర్ల నుంచి కాల్స్ పరంపర కొనసాగుతూనే ఉంటున్నది. పొరపాటున ఎత్తామా.. పోలీసులమనీ, బ్యాంకు అధికారులమనీ నమ్మబలికి కాటు వేస్తున్నారు. టెలికామ్ సంస్థ ప్రతినిధులమని చెప్పి సిమ్‌కార్డు రద్దు చేస్తున్నామనీ మోసానికి తెగబడుతున్నారు. చాలావరకు ఇలాంటి కాల్స్ ఎక్కువగా విదేశాల నుంచే వస్తుంటాయి. వారి మాటలను నమ్మిన వాళ్లను నట్టేట ముంచడమే ఫేక్కాలర్స్ లక్ష్యం. వినియోగదారులను ఒత్తిడిలోకి నెట్టి.. వ్యక్తిగత వివరాలను సేకరించి, ఆర్థిక మోసాలకు పాల్పడటం వారికి వైకుంఠపాళి ఆడినంత ఈజీ! ఈ ఉచ్చులో పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..
స్మార్ట్‌ఫోన్
మెయింటేన్ చేస్తే చాలదు.. స్మార్ట్‌గా ఆలోచించాలి కూడా! మనం తెలియని వ్యక్తికి ఫోన్ చేసి ఎప్పుడైనా మీ ఖాతా వివరాలు చెప్పమని అడుగుతామా! అడగం కదా!! కానీ, మనకు ఎవరైనా ఫోన్ చేసి అవే వివరాలు అడిగితే సందేహించకపోతే తప్పు మీదే అవుతుంది కదా!! అంతెందుకు ఏదైనా నేరం జరిగితే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాకే యాక్షన్‌లోకి దిగుతారు. అంతేకానీ, ఫోన్ చేసి ‘మీ పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామనీ, క్రైమ్ చేశారనీ’ చెప్పరు. అలా ఎవరైనా బెదిరిస్తే.. అది ముమ్మాటికీ ఫేక్ కాల్ అని నిర్ధారణకు రావాలి. వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేయాలి. అక్కడితో ఆగిపోకుండా.. పోలీసులకు సమాచారం అందించాలి.
ఎలా జాగ్రత్తపడాలి?
గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది అనుకుందాం! ఆ ఫోన్ చేసింది ఫేక్రాయుడు అయితే.. ఆ వ్యక్తి మాటల్లో అర్జెంట్.. క్రిటికల్… అనే పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసి.. మీరు వాళ్ల ట్రాప్‌లో పడ్డారని అనిపించగానే డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెడతారు. మీరు మళ్లీ ఆలోచనలో పడుతున్నారన్న అనుమానం రాగానే హద్దు మీరి మాట్లాడుతుంటారు. బెదిరింపులకు పాల్పడతారు. ఇవన్నీ గమనించి వాళ్లు నకిలీ అని అంచనాకు రావొచ్చు. వీరిని జాగ్రత్తగా డీల్ చేయాలి. వ్యక్తిగత వివరాలను అడిగితే స్పందించొద్దు. ఓటీపీ అడిగితే చెప్పొద్దు. ఆధార్ వివరాలు అస్సలు ఇవ్వొద్దు. ఈ విషయాలు మీరు పాటించడం మాత్రమే కాదు.. మీ ఇంట్లో ఫోన్ వాడుతున్న పెద్దలకూ చెప్పండి. ఈ రకమైన మోసాల పట్ల అవగాహన కల్పించండి. ఈ తరహా కాల్స్ నంబర్లను ట్రాకింగ్ యాప్‌లతో బ్లాక్ చేయండి. అవసరమైతే 1930కి ఫిర్యాదు చేయండి. సైబర్ క్రైమ్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయండి.
వీటి సాయం తీసుకోండి
నకిలీ ఫోన్ కాల్స్, సందేశాలు, ఆన్లైన్ మోసాల గురించి ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకమైన వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. సైబర్ నిపుణుల సిఫారసుల ప్రకారం ఈ వేదికలు ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
నకిలీ కాల్స్ గుర్తించడం ఎలా?
-అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్