దొంగలు తెలివి మీరారు. రిస్క్ లేని జాబ్ మాత్రమే చేయడానికి ఇష్టపడుతున్నారు. ట్రెడిషనల్ యాక్టివిటీస్ వదులుకుంటున్నారు. రంపాలతో తాళాలు కోసి, సుత్తితో గడియ విరగ్గొట్టి విలువైన సమయం వృథా చేసుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు. ఈజీ మనీ కావాలనే వెంపర్లాటే కాదు, ఈజీగా పనయ్యే ప్లాన్లు అమలు చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ కొంపలు లూటీ చేస్తున్నారు. జేబు దొంగలు అంటే వాళ్లని తక్కువ చేసినట్టే. ‘సైబర్ దొంగలు’ అనాలి. వాళ్లను పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్లది గ్లోబల్ రేంజ్! ఇందు అందు అని లేకుండా సర్వ సర్వర్లలోకి చొరబడి దోచే సైబర్ చోరుల గురించి వార్తల్లో వినని రోజు లేదు. తాడిని తన్నే సైబర్ నేరగాడుంటే వాడి తల తన్నే సైబర్ పోలీస్‌ని తయారు చేస్తున్నది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ).
ఈదొంగలు ఇంటికి రారు. తలుపు తట్టరు. తాళం ముట్టరు. ఆన్లైన్లో ‘హలో’ అంటూ పలకరిస్తారు. తిరిగి హలో చెప్పగానే మొబైల్ ఫోన్లోని వ్యాలెట్‌ని ఖాళీ చేసి పోతారు. ఈ దొంగ వేలి ముద్రలు దొరకవు. రాలేదు కాబట్టి వెంట్రుక కూడా దొరకదు. కాబట్టి ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అనుకుంటూ నేరస్తులు ఘోరాలు చేస్తూనే పోతుంటారు. ఈ ఫ్రాడ్స్టర్లు మారినంత వేగంగా పోలీసు వ్యవస్థ మారలేదు. కాబట్టి సైబర్ నేరగాళ్ల ఆటలు సాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో అందమైన ప్రొఫైల్ పిక్ పెట్టుకుని, బయోలో హై ప్రొఫైల్ రాసుకుని ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టి, ఆపై స్నేహం నెరపి, చాలా దూరం నడిచిన కథలు వార్తల్లో చాలానే విన్నాం. వ్యక్తులకే కాదు వ్యవస్థలకూ ఇవే తలనొప్పులు ఫైర్ వాల్ని బ్రేక్ చేసి సర్వర్లను స్వాధీనం చేసుకుంటారు. ఆపై బేరసారాలతో కథ నడిపిస్తారు. తప్పుడు మెయిల్స్ పంపేవాళ్లతో విమానాశ్రయాలు, హోటళ్లు, స్కూళ్లకు ఎన్ని తలనొప్పులో.. ఇలాంటి వాటిని కట్టడి చేయడం సంప్రదాయ పోలీసింగ్‌తో అయ్యే పని కాదు. అందుకే ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్టు అమెరికా పోలీసులు ఒక క్రైమ్ టౌన్‌షిప్‌నే రెడీ చేసుకున్నారు.
ఉత్తుత్తి ఊరిలో సాధారణంగా పోలీస్ అధికారులకు నేర విచారణ గురించి పాఠాలు తరగతి గదిలో చెబుతారు. అలా కాకుండా శిక్షణా కాలంలోనే రియల్‌టైమ్ ఎక్స్పీరియన్స్ కల్పించేందుకు ఎఫ్‌బీఐ ఈ కెనటిక్ సైబర్ రేంజ్‌ని సిద్ధం చేసుకుంది. అమెరికాలోని అలబామాలో ఉన్న హంట్స్‌విల్లే ఎఫ్‌బీఐ ప్రాంగణం ఉంది. అందులో ఒక టౌన్‌షిప్‌ని ఇటీవలే నిర్మించారు. అది నిజమైన పట్టణం కాదు. ఉత్తుత్తి పట్టణం. అక్కడ ఇళ్లు మాత్రమే ఉంటాయి. మనుషులెవరూ నివసించరు. ‘కెనెటిక్ సైబర్ రేంజ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ టౌన్షిప్ మూడు నెలల క్రితం ప్రారంభించారు. సైబర్, ఫోరెన్సిక్ విచారణ చేపట్టే సిబ్బందికి ‘రియల్‌టైమ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్’ శిక్షణ కోసం ఉత్తుత్తి పట్టణం నిర్మించారు. అక్కడ పదకొండు రకాల నివాస సముదాయాలు ఉన్నాయి. భవనాలు, హోటళ్లు, పెట్రోల్ బంక్, హాస్పిటల్, స్కూల్, కార్యాలయాలు, డాటా సెంటర్, పోలీస్ స్టేషన్ మొదలైనవి ఉన్నాయి. వీధుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. అలాగే సిగ్నలింగ్ వ్యవస్థ కూడా పని చేస్తూ ఉంటుంది. ఇదే టౌన్షిప్లో ఎఫ్‌బీఐ సైబర్ క్రైమ్ విచారణ గురించి శిక్షణ ఇచ్చేందుకు 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకమైన భవనం ఉంది. ఇక్కడికి ఎంపిక చేసిన పోలీసులు, సైనికాధికారులు, ఇతర దర్యాప్తు సంస్థల ఉద్యోగులు శిక్షణ కోసం వస్తారు.
ఫేక్ క్రైమ్.. రియల్ టైమ్ ఎంక్వైరీ
సైబర్ క్రైమ్ ఎంక్వైరీ ప్రాక్టికల్ శిక్షణ అంటే.. మొదట ఉత్తుత్తి ఊళ్లో సైబర్ దొంగలుపడతారట. ఇక వాళ్ల పని పట్టేందుకు శిక్షణ కోసం వచ్చిన వాళ్లని నేరం ఎక్కడ జరిగిందో అక్కడికి తీసుకెళ్తారు. సైబర్ క్రైమ్ ఎలా జరిగింది? దేని ద్వారా జరిగింది? తెలుసుకుంటారు. ఒక్క సైబర్ క్రైమే కాదు ఇతర నేరాల్లో కూడా ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఆధారంగా నేరస్తులను పట్టుకోవచ్చు. ఆ సాంకేతిక నైపుణ్యం ఇవ్వడమే ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉద్దేశం. సెల్ఫోన్లో ఫొటోలు, వీడియోలు మిస్సయితే వాటిని తిరిగి రాబట్టడం నుంచి సెల్‌ఫోన్ సాయంతో సాగించిన ఇతర కార్యకలాపాల వివరాలన్నీ రాబట్టేందుకు శిక్షణ ఇస్తున్నారు. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల నుంచి తొలగించిన డేటాను తిరిగి తెచ్చుకోవడం నేర విచారణలో పోలీసులకు చాలా అవసరం. అన్ని సందర్భాల్లో నేరం వ్యక్తిగత డివైజ్‌ల నుంచి జరగదు. హోటళ్లు, కార్యాలయాలు, ఇతర చోట్ల కూడా నేరాలు జరుగుతాయి. ఆ సందర్భంలో పోలీసులు సీసీ టీవీ పుటేజ్‌ని సేకరించాల్సి వస్తుంది. దానిని సేకరించడంతోపాటు డిలీట్ చేసిన పుటేజీని తిరిగి తెచ్చుకోవాల్సి రావొచ్చు. కార్యాలయాలు, హోటళ్లలో కంప్యూటర్ల నుంచి ట్రాన్స్ఫర్ అయిన డేటా, వైఫైతో అనుసంధానమైన కంప్యూటర్ల వివరాలు సేకరించడం ఉత్త పాఠాలు చెప్పినట్టుగా కాకుండా అనుభవపూర్వకంగా ఇక్కడున్న భవనాల్లో దర్యాప్తు చేస్తూ నేర్చుకుంటున్నారు. సేకరించిన డేటాను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఎలా విశ్లేషించాలో కూడా ఇక్కడే నేర్పిస్తారు. అన్ని రకాల సైబర్ నేరస్తులను పట్టుకునే నైపుణ్యం పోలీసులకు తక్షణ అవసరం. కాబట్టి ఎఫ్‌బీఐ మారుతున్న నేర ప్రపంచానికి తగ్గట్టుగానే సిబ్బందిని సిద్ధం చేసేందుకు ఈ ఉత్తుత్తి పట్టణాన్ని నిర్మించింది. అక్కడ ఉత్తుత్తి నేరాల విచారణ జరిగినా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వల్ల రేపటి నిజమైన నేర విచారణను సులభం చేసే మంచి ఉపాయం ఇది.