సాంకేతిక రంగంలో భవిష్యత్ మొత్తం ‘మెటావర్స్’దేనని చెబుతున్నది ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’. అందుకే.. వీఆర్, ఏఆర్ హెడ్సెట్ల తయారీపై ఎక్కువగా దృష్టి పెడుతున్నది. తాజాగా.. తన వర్చువల్ వరల్డ్ ‘మెటావర్స్’ కోసం ప్రీమియం వీఆర్ హెడ్‌సెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అద్భుతమైన ఫీచర్లతో.. ‘మెటా క్వెస్ట్ ప్రో’ పేరుతో తయారైన ఈ హెడ్‌సెట్‌ను ఇటీవలే మార్కెట్లో విడుదల చేసింది. హైరైజ్ సెన్సర్లు, మిక్స్డ్ రియాలిటీ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ ప్రీమియం హెడ్సెట్ వస్తున్నది. వర్చువల్ రియాలిటీలోనూ మనుషులు మరింత సహజంగా కనిపించేలా.. ఇందులో ప్లస్ఐ ట్రాకింగ్, నేచురల్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ను పొందుపరిచింది మెటా. ఈ వీఆర్ హెడ్సెట్ ద్వారా మెటావర్స్‌లో మీటింగ్స్, గేమ్స్, ఈవెంట్స్ లాంటివి నిర్వహించవచ్చు. వర్చువల్ రియాలిటీ వీడియోలను వీక్షించవచ్చు. 3డీ సినిమాలతోపాటు హైరిజల్యూషన్ వీడియో గేమ్స్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ఆర్2+ చిప్సెట్, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీలాంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కళ్ల ముందే సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించనున్న ఈ ‘మెటా క్వెస్ట్ ప్రో’ ధర.. రూ. 31,800. meta.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
కార్ డ్యాష్ కెమెరా.. ఇప్పుడు వాహనాల యాక్ససరీస్‌లో కీలకంగా మారింది. రోడ్ ట్రిప్పులకు వెళ్లిన సమయంలో ప్రతి క్షణాన్నీ ఇది వీడియో తీస్తుంది. ఆ ప్రయాణపు మధురానుభూతులను ఎప్పటికీ నిలిపి ఉంచుతుంది. రోడ్డు ప్రమాద సమయాల్లో ఈ వీడియోలను సాక్ష్యాలుగా చూపిస్తుంది. ఈ అవసరాలను గుర్తించిన ‘నెక్ట్స్ బేస్’ సంస్థ.. ‘622 జీడబ్ల్యూ’ పేరుతో కారు డ్యాష్ కెమెరాలను తయారుచేసింది. ఇందులోని 8 మెగా పిక్సెల్ కెమెరా.. 4కే రిజల్యూషన్‌తో వీడియోలను చిత్రిస్తుంది. ‘ఇంటెలిజెంట్ పార్కింగ్ మోడ్’.. మీరు కారులో లేనప్పుడు మీ కారుకు సెక్యూరిటీ గార్డుగానూ పనిచేస్తుంది. ‘622 జీడబ్ల్యూ’లోని మరో అద్భుతమైన సాంకేతికత ‘క్రాష్ డిటెక్షన్’. వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే గుర్తిస్తుంది. అప్పటికప్పుడే ఎమర్జెన్సీ సేవలకు లోకేషన్‌తో కూడిన సమాచారం అందిస్తుంది. ఇన్‌బిల్ట్ ‘అలెక్సా’తో వస్తున్న ఈ డ్యాష్ కెమెరా ఖరీదు.. రూ. 25,400. nextbase.com ద్వారా ఆర్డర్ ఇవ్వవచ్చు.
రాత్రి పడుకునే ముందు సంగీతం వినడం చాలామందికి అలవాటు. వినసొంపైన పాటలు వింటూ.. నిద్రలోకి జారిపోవడం మంచి అనుభూతి కూడా! ఆ అలవాటు ఉన్నవారికి మంచి ఆప్షన్.. ‘ప్యూర్’ సంస్థ తయారుచేసిన ‘మూమెంట్’! పడక మంచం పక్కన చక్కగా ఒదిగిపోయే ఈ ఆల్-ఇన్-వన్ పరికరం.. బ్లూటూత్ 5.3 ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. మనసుకు నచ్చిన పాటలను వినిపిస్తుంది. ఎఫ్ఎం రేడియోగా మారి.. శ్రావ్యమైన సంగీతాన్ని అందిస్తుంది. గడియారంగా.. అలారం క్లాక్గానూ పనిచేస్తుంది. వెలుతురును అడ్జస్ట్ చేసుకునే బెడ్‌ల్యాంప్‌గా రూపుదాలుస్తుంది. రెండు వినూత్న రంగుల్లో లభ్యమవుతున్న ‘ప్యూర్ మూమెంట్’ వెల.. రూ. 10,700. pure-audio.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఆధునిక సాంకేతికత పుణ్యమాని.. ఫొటోగ్రఫీ కొత్తపుంతలు తొక్కుతున్నది. మనిషి కన్ను కూడా పట్టుకోలేని క్షణాలను.. కెమెరా పట్టేసుకుంటున్నది. అందులోనూ, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ‘ప్రీరిలీజ్ క్యాప్చర్ టెక్నాలజీ’.. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీని మరో మెట్టు ఎక్కిస్తున్నది. సుప్రసిద్ధ కెమెరా తయారీ సంస్థ నికాన్.. ఈ టెక్నాలజీని ఉపయోగించి ‘జెడ్6-III’ కెమెరాను తయారుచేసింది. ఈ ‘ప్రీ రిలీజ్ క్యాప్చర్’ సాంకేతికత.. 120 ఎఫ్‌పీఎస్‌లో, కెమెరా షట్టర్ రిలీజ్‌కు ముందటి క్షణాలను కూడా ఫొటోలు తీస్తుంది. ఈ ఫుల్‌ఫ్రేమ్ మిర్రర్‌లెస్ కెమెరాలో అత్యాధునిక 24.5 మెగా పిక్సెల్ సీమాస్ సెన్సర్‌ను ఏర్పాటుచేశారు. ఎక్స్పీడ్ 7 ఇమేజ్ ప్రాసెసర్ ద్వారా అద్భుతమైన చిత్రాలను పొందొచ్చు. 6కే రిజల్యూషన్‌లో వీడియోలూ తీసుకోవచ్చు. 493 పాయింట్ ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ సిస్టమ్, పిక్సెల్ షిఫ్ట్ టెక్నాలజీ, 170 డిగ్రీల వేరీ యాంగిల్ ఎల్సీడీ స్క్రీన్ లాంటి అనేక ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. మరెన్నో అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ కెమెరా ధర రూ. 2,48,000. nikon.co.inతోపాటు అన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.