శబ్దం జీవితానికి ప్రతీక. చలనానికి సాక్ష్యం. పసిపాప ఏడుపు అయినా, పక్షుల రావాలైనా, దూసుకొచ్చే తుపానులైనా… మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ శబ్దాలతోనే తమ ఉనికిని స్పష్టం చేస్తాయి. మనుషుల మధ్య బంధాలకీ అదే ఆలంబన. ఓదార్పునిచ్చే మాట అయినా, కసి తీర్చే కోపం అయినా… భాషతోనే తెలుస్తుంది. అవే వినిపించకపోతే! చుట్టూ ఉన్న సందడి అంతా ఒక్కసారిగా ఆగిపోతే… కష్టమే!! సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారే కానీ… కళ్లు మూసుకుని ఓ పది నిమిషాలు ఉండగలమేమో! అదే ఏ శబ్దమూ లేకపోతే కంగారుపడిపోతాం! వినికిడి కోసం తపించిపోతాం!! కానీ ఇప్పుడు అదే ‘నిశ్శబ్ద ఉపద్రవం’ ముంచుకొస్తున్నది. నానాటికీ వినికిడి సమస్యలు పెరిగిపోతున్నాయని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. ఈ విపత్తుకు జన్యువులు, ఇన్ఫెక్షన్లు ముఖ్య కారణం కాదు! శబ్ద కాలుష్యం, వీడియో గేమ్స్, ఇయర్ ఫోన్స్! అందుకే 2050 నాటికి 250 కోట్ల మంది వినికిడి సమస్యలతో బాధపడవచ్చని అంచనా. వారిలో ఏకంగా 70 కోట్ల మందికి సర్జరీ లేదా వినికిడి పరికరాలు అవసరం అవుతాయి. ఈ సంఖ్య భయపెట్టేందుకు కాదు… ఇక నుంచైనా జాగ్రత్తపడమని హెచ్చరించేందుకు!
పైకి కనిపించే చెవి చాలా సాధారణంగా కనిపిస్తుంది. కానీ, దానిలోపల ఓ సంక్లిష్ట ప్రపంచమే ఉంటుంది. శబ్దాన్ని తరంగాల రూపంలో గ్రహించే బయటి చెవి, ఆ తరంగాలను చేరవేసే ఇయర్ కెనాల్, వాటికి కంపించే కర్ణభేరి. ఆ కంపనాలను మరింత సూక్ష్మంగా మార్చే ఓ మూడు చిన్న ఎముకలు, ఆ కంపనాలను విద్యుత్ సంకేతాలుగా మార్చే కాక్లియా, ఆ సంకేతాలను మెదడుకు చేరవేసే ప్రత్యేక నాడి, వాటిని విశ్లేషించి తిరిగి శబ్దాలుగా మార్చే మెదడు… మనకు వినిపించే చిన్నపాటి గుండుసూది శబ్దానికి కూడా ఇంత కథ ఉంటుంది. మరి ఇంత సంక్లిష్టమైన వినికిడిని చులకనగా తీసుకుంటే. ఆ వ్యవస్థ మీద ఒత్తిడి పెరుగుతుంది. అదే జరుగుతున్నది! మన చిన్న చిన్న అలవాట్లే ఉపద్రవంగా మారుతున్నాయి.
వినికిడి మందగిస్తే అసౌకర్యం ఎలాగూ ఉంటుంది. కానీ ఆర్థికంగా, సామాజికంగా సవాలక్ష సమస్యలు కూడా తోడవుతాయని గ్రహించం.
డిమెన్షియా: ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. చెవి శబ్దాలు గ్రహించకపోవడం వల్ల మెదడు మీద అధిక భారం పడుతుందట. ఏకంగా దాని నిర్మాణమే మారిపోతుంది. టెంపోరల్ లోబ్ లాంటి వ్యవస్థలలో మార్పు ఉంటుంది. ఫలితంగా ఇది మతిమరపులాంటి సమస్యలకు దారితీస్తుంది.
ఒంటరితనం: వినికిడి సమస్యతో బాధపడేవారు.. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారనో, అవతలివారు చెప్పేది సరిగా వినపడటం లేదనో, తనలో లోపం ఉందనే న్యూనతతోనో… నలుగురితో కలవడం మానేస్తారు. ఇది ఒంటరితనానికి, కుంగుబాటుకు దారితీస్తుంది. ఒకోసారి ఆత్మహత్య చేసుకోవాలనే తీవ్రమైన వైరాగ్యానికి కూడా కారణం అవుతుంది.
నిస్సత్తువ: వినికిడి కాస్త తగ్గినప్పుడు… తెలియకుండానే ఇంకా జాగ్రత్తగా శబ్దాలను వినాలనే ప్రయత్నం జరుగుతుంది. ఫలితంగా త్వరగా అలిసిపోతారు. బంధాల మీద ఒత్తిడి: వినికిడి తగ్గడం వల్ల వచ్చే ఒత్తిడి, చిరాకులు మన ప్రవర్తనని ప్రభావితం చేస్తాయి. వాటితో పాటుగా ఎవరు ఏమంటున్నారో సరిగా గ్రహించలేకపోవడం, తగినట్టు జవాబులు ఇవ్వలేకపోవడం కలతలకు, కలహాలకు దారితీస్తుంది.
ప్రమాదాలు: వినికిడి తగ్గడం వల్ల ఎటువైపు నుంచి ఏం వస్తున్నాయో తెలియక జరిగే ప్రమాదాల సమస్య ఎలాగూ ఉంటుంది. శరీర సమతుల్యతను గమనించుకునే సున్నితభాగాలు కూడా చెవిలోనే ఉంటాయి. వాటి పనితీరు తగ్గడం వల్ల తరచూ పడిపోయే సమస్యా మొదలవుతుంది.
ఆర్థికంగా దివాళా: చెవికి సంబంధించిన చికిత్సలు, శస్త్రచికిత్సలు, పరికరాల్లో ఎంత మార్పు వచ్చిందో… వాటి ధరల్లోనూ అంతే పెరుగుదల ఉంది. అది ఒకరకంగా జేబుకు చిల్లే! అంతేకాదు… వినికిడి సమస్య వల్ల ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటాయి. ఇది దాదాపు లక్ష కోట్ల డాలర్ల నష్టానికి దారితీయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.
వినికిడి కొంచెమో పూర్తిగానో లోపించడానికి ఇప్పటివరకూ ఉన్న కారణాలు మనకు తెలిసినవే! జన్యుపరంగా వస్తున్న సమస్యలో, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు సోకే రుబెల్లా లాంటి ఇన్ఫెక్షన్లో, పుట్టినప్పుడు ఆక్సిజన్ అందకపోవడమో, జాండిస్ లాంటివి దాడి చేయడమో… వినికిడిని దెబ్బతీస్తాయి. ఇక వయసు పెరిగే కొద్దీ పోషకాహార లోపం, ఏదన్నా దెబ్బ తగలడమో, వృద్ధాప్యంతో వచ్చే వినికిడి రుగ్మతల కారణంగానో శ్రవణం దెబ్బతినవచ్చు. నిజానికి ఈ సమస్యలకు ఇప్పుడు సరికొత్త చికిత్సలు వచ్చాయి. కాక్లియర్ ఇంప్లాంట్ లాంటి సంక్లిష్టమైన ప్రక్రియలతో బధిరత్వాన్ని ఎదుర్కొంటున్నారు. మరి ఈ సమస్య తగ్గాలి కదా! కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2050 నాటికి ప్రతి పదిమందిలో ఒక్కరు తీవ్రమైన వినికిడి సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందట. ఇందుకు స్పష్టమైన కారణాలు ఉన్నాయి…
చెవిలో జోరీగ: ఇప్పుడు ప్రతి చెవిలోనూ ఓ ఇయర్ ఫోన్ కనిపిస్తున్నది. ప్రయాణం చేసేటప్పుడు పాటలు వినేందుకో, కాల్స్ అటెండ్ అయ్యేందుకో, మిత్రులతో ఎక్కువ సేపు మాట్లాడేందుకో… కారణాలు ఎన్నయినా పరికరం అదే. చెవిలోపల సున్నితమైన వెంట్రుకలు ఉంటాయి. శబ్దాన్ని చేరవేయడంలో వాటిది కీలకపాత్ర. అవి దెబ్బతింటే మళ్లీ పెరగవు. కానీ ఇయర్ ఫోన్స్ నేరుగా వాటి దగ్గరికే చొప్పించడం వల్ల, అవి పాడవుతాయి. ఇప్పటి కుర్రకారులో కనిపిస్తున్న వినికిడి సమస్యలకి ఈ ఇయర్ ఫోన్లే ప్రధాన కారణం అని చెబుతున్నారు. కానీ దీన్ని తప్పించుకునే మార్గం కూడా ఉంది.
మన దగ్గర చెవులు దద్దరిల్లిపోయే మ్యూజిక్ కాన్సర్టుల సంప్రదాయం తక్కువే. కానీ అందుకు ఏమాత్రం తగ్గని డీజేల సంఖ్య పెరుగుతున్నది. పెళ్లయినా, పండుగైనా, పార్టీ అయినా… చివరికి నలుగురు కలుసుకున్నా డీజే మోత మోగిపోతున్నది. డీజేతో రక్తపోటు, గుండెవేగం అమాంతం పెరిగిపోతాయని… అక్కడికక్కడే కుప్పకూలే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటిది ఇక చెవి గురించి చెప్పేదేముంది! చెవి పక్కనే వినిపించే డీజేల శబ్దం వంద డెసిబుల్స్ వరకూ ఉండవచ్చు. అది అప్పటికప్పుడు వినికిడి సమస్యకు దారి తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక చిన్న పిల్లల్లో అయితే ఇది మరింత ప్రభావం చూపిస్తుంది.
పిల్లలకి ఆటలైతే లేవు కానీ… వీడియో గేమ్స్ అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. అదో ప్రపంచం. వ్యసనమని తెలిసినా, అందరూ చూసీ చూడకుండా ఒప్పుకొంటున్న అలవాటు. హెడ్ ఫోన్లతో గేమ్స్ ఆడటం చాలామందికి అలవాటు. ఆట ఆడే ఉద్వేగంలో గంటల తరబడి ఆ శబ్దాలను వింటూ ఉంటారు. అందులో వినిపించేవి కూడా తుపాకులు, బాంబుల మోతలే. మరి వినికిడి దెబ్బ తింటుంది కదా! సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థే ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుని చాలా నిబంధనలు సూచించింది అంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సిగిరెట్ పొగలో ఉండే కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని ఆక్సిజన్ నిల్వలను తగ్గిస్తుంది. ఇది కాక్లియా మీద ప్రభావం చూపిస్తుంది. పొగాకులో ఉండే నికొటిన్ లాంటి రసాయనాలు కూడా అంతర్ చెవిలో సున్నితమైన భాగాలను దెబ్బతీస్తాయి. శ్రవణ నాడిని కూడా బలహీనపరుస్తాయి. శరీర సమతుల్యాన్ని గమనించే యూస్టేషియన్ ట్యూబ్ కూడా వాచిపోతుంది. ఇక మద్యం వల్ల కూడా వినికిడి దెబ్బతింటుంది. అందులోని రసాయనాలతో పాటుగా… మద్యపానం వల్ల కలిగే బి12 వంటి పోషకాల లోపం కూడా ఇందుకు కారణమే. దీంతో కాక్టైల్ డెఫ్నెస్ లాంటి తాత్కాలిక సమస్యలతో పాటు బధిరత్వం కూడా రావచ్చు.
సమస్య ఏమిటంటే కొన్ని చర్యలు తీసుకోవడానికి మొహమాటపడతాం. ఎక్కువ శబ్దాన్ని అసౌకర్యంగా భావిస్తాం కానీ, అది శాశ్వతమైన నష్టానికి దారితీస్తుందని గ్రహించం. అందుకే నామోషీని పక్కన పెట్టి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
ఏడాదికోసారి పళ్లు చూపించుకుంటాం, ఏమాత్రం అనుమానం వచ్చినా కళ్లు చూపించుకుంటాం… ఇక రక్తపోటు మధుమేహాల్లాంటి సమస్యలు ఉంటే.. అదుపులోనే ఉన్నాయా అని గమనించుకుంటాం. కానీ చెవుల సంగతి ఏంటి?
చెవుల్లో తడి చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
వాక్స్ పూడుకుపోతే వైద్యుడి సాయంతో తీయించుకోవాలే కానీ సొంత ప్రయోగాలు చేయకూడదు.
ఎక్కువ ధ్వని ఉన్న ప్రదేశాలలో ఉండాల్సి వస్తే కనీసం పది నిమిషాలకు ఓ బ్రేక్ తీసుకుని దూరం జరగాలి.
బీ12, జింక్ లాంటి పోషకాలు చెవి ఆరోగ్యానికి మంచివి… వాటి లోపం లేకుండా చూసుకోవాలి.
తగినంత వ్యాయామంతో రక్తప్రసరణ మెరుగుపడి చెవులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
మధుమేహం లాంటి ఆరోగ్య సమస్యలను అదుపులో ఉంచుకోవాలి.
ప్రతి శబ్దాన్నీ డెసిబుల్స్లో కొలుస్తారని తెలిసిందే! ఆకులు కదిలే శబ్దం మొదలుకొని.. తుపాకి చప్పుడు వరకూ ప్రతిదానికీ ఓ డెసిబుల్ ఉంటుంది. మనం ఊపిరి పీల్చుకునే సద్దు పది డెసిబుల్స్ ఉంటుంది. మాట 60 డెసిబుల్స్ వరకు ఉంటాయి. 70 డెసిబుల్స్ దాటిన దగ్గర నుంచీ సమస్య మొదలే. ఉదాహరణకు 85 డెసిబుల్స్ మించి చప్పుడుని 8 గంటల పాటు వింటే అంతర్ చెవి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అదే వంద డెసిబుల్స్ మించిన శబ్దాలు పావుగంట పాటు విన్నా… నష్టం ఖాయం. చెవిలో అరవడం, సైరెన్ మోతలు, ప్లేన్ టేకాఫ్, పటాసులు, డీజేలు… అన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇక ఈ స్థాయి మరీ శ్రుతి మించితే అప్పటికప్పుడు వినికిడి లోపం ఏర్పడే ప్రమాదమూ ఉంది.
మొత్తంగా ఇంపైన శబ్దాలను వినాల్సిన చెవిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే… ఆరోగ్యానికి అంత మంచిది! మంచి విన్నప్పుడే కదా.. మేలు జరుగుతుంది. చెడు చెవికెక్కితేనే కదా.. మంచేంటో తెలిసేది!!వినికిడి లోపం తలెత్తకుండా.. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది!
– కె.సహస్ర