Dress Code at Restaurants | వారాంతంలో రెస్టారెంట్‌కు వెళ్లాలనిపిస్తుంది. ఎటూ ఆదివారమే కదా అని, క్యాజువల్స్లో ముస్తాబు అవుతాం. సకుటుంబంగా బయల్దేరతాం. అయినా ప్రవేశం లభించకపోవచ్చు. కారణం, డ్రెస్ కోడ్! చాలా హోటళ్లు అతిథులకు ఓ ప్రత్యేకమైన డ్రెస్‌కోడ్ అమలు చేస్తున్నాయి. ఎరుపు, తెలుపు, యాపిల్ మెరుపు.. ఏ రంగైనా కావచ్చు.
వీకెండ్ అనో, బయట తినాలనిపించో రెస్టారెంట్ వైపు మనసు మళ్లగానే నచ్చిన బట్టలు వేసుకుని వెళ్లిపోయేవాళ్లం ఇప్పటిదాకా. కానీ కొత్తగా వస్తున్న కొన్ని రెస్టారెంట్లు మాత్రం తప్పకుండా ఫలానా డ్రెస్ వేసుకునే రావాలని చెబుతున్నాయి. సోమవారం సూట్, మంగళవారం జీన్స్, బుధవారం ఖాదీ, గురువారం కుర్తా పైజమా.. ఇలా ఆ రోజు వాళ్లు నిర్ణయించిన డ్రెస్‌కోడ్ ప్రకారం దుస్తులు ధరించిన వారినే లోపలికి ఆహ్వానిస్తున్నాయి.
యూనిఫామ్ సర్వీసులకు డ్రెస్‌కోడ్ తప్పనిసరి. పోలీసులకు ఖాకీ డ్రెస్, డాక్టర్లకు వైట్ కోట్, లాయర్లకు బ్లాక్ కోట్, నౌకాదళానికి నేవీ బ్లూ.. ఇలా శాఖను బట్టి ఓ యూనిఫామ్ ఉండితీరుతుంది. దాదాపుగా అన్ని స్కూళ్లు, కొన్ని కాలేజీలు కూడా డ్రెస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. సినిమాలకూ, షికార్లకూ, బీచ్‌లకూ, రెస్టారెంట్లకూ.. నచ్చిన డ్రెస్ వేసుకుని వెళ్లడమే మనకు తెలుసు. ఇప్పుడు అలా కుదరదు. మనం వెళ్లే రెస్టారెంట్ ప్రమాణాలకు, డిజైన్‌కు, రంగుకు సరిపోయేలా మన లుక్ ఉండాలి. ఆ రోజు ప్రత్యేకత తెలిసేలా మనం ప్రత్యేకంగా కనిపించాలి. వీకెండ్ వెళుతున్నామా, వారం మధ్యలో వెళుతున్నామా అన్నదాన్ని బట్టి ఏ బట్టలు వేసుకోవాలో తేల్చుకోవాలి. అలా కాకపోతే మనం లోపలికి ప్రవేశించడం కష్టమే. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇప్పటిదాకా విదేశాల్లో ఉన్న ఈ తరహా డ్రెస్‌కోడ్ ఇప్పుడు ఇండియాకూ పాకింది. బెంగళూరులో ఇటీవల తెరచిన బ్రెసా రెస్టారెంట్ అబ్బాయిలు నచ్చిన చెప్పులో స్లిప్పర్లో వేసుకుని లోపలికి వెళతామంటే అస్సలు ఒప్పుకోదు. కాలినిండా షూ వేసుకుంటేనే ఆ జావ్… లేదా పో జావే! ఆలివ్ బార్ అండ్ రెస్టారెంట్లో అయితే పగటి పూట స్లిప్పర్లు, స్లీవ్‌లెస్‌లు, షార్ట్‌లు, పూల చొక్కాలూ వేసుకుని బీచ్ తరహా లుక్‌తో అక్కడికి రావచ్చు. అదే సాయంకాలాలైతే కార్పొరేట్ మీటింగులు మొదలవుతాయి. కాబట్టి ఆ సమయంలో వచ్చేవాళ్లెవరైనా సరే, పక్కా ఫార్మల్ లుక్‌లోనే ఉండాలి… అంటే చొక్కా, ప్యాంటూ, టక్కూ, బూట్లూ… అన్నమాట. అందుకు భిన్నంగా బట్టలు వేసుకున్న వారిని బయటినుంచి బయటికే పంపించేస్తున్నాయి.
ఇవేకాదు ఈ మధ్య చాలా రెస్టారెంట్లు ఫార్మల్, స్మార్ట్ ఫార్మల్, సెమీ ఫార్మల్, క్యాజువల్… ఇలా ఒక్కోరోజుకు ఓ డ్రెస్‌కోడ్ పెడుతున్నాయి. మనం రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే విందుకు ఎలాంటి లుక్‌లో రావాలో స్పష్టంగా చెబుతున్నాయి. ఇవి తెలిసీ తెలియక ఎవరన్నా గేటుదాకా వెళ్లినా విషయాన్ని సున్నితంగా చెప్పి వెనక్కి పంపిస్తున్నాయి. ఈ మధ్య ఓ రెస్టారెంట్ ఇలా ఏడెనిమిది మంది అతిథుల్ని వెనక్కి పంపిందట. ‘ఇలా చేస్తే ఫీలవుతారు కదా.. అని కొందరు అడుగుతున్నారు. కానీ మేం చెప్పే విధానం వల్ల వాళ్లు విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటున్నారు. చాలా మంది వెనక్కివెళ్లి తగిన డ్రెస్‌కోడ్‌లో తిరిగొస్తున్నారు’ అని చెబుతారు అక్కడి మేనేజర్లు. బెంగళూరు అనేముంది ఇప్పుడిప్పుడే దిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లలోని కొనిన బార్ అండ్ రెస్టారెంట్లూ ఈ తరహా ట్రెండ్‌కు ఓటేస్తున్నాయి.
రెస్టారెంట్స్‌లో డ్రెస్‌కోడ్ అనగానే..‘ఇదేదో బాగుందే మరి! ఈ సాకుతో అయినా రకరకాల డ్రెస్సులు వేసుకోవచ్చు. అచ్చంగా మనలాంటి డ్రెస్సే వేసుకున్న వారిని చూసి మురిసిపోవచ్చు’ అంటున్నారు సందర్శకులు. మొత్తానికి రెస్టారెంట్‌కు వెళ్లాలంటే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచీ ఒక లెక్క అన్నమాట!
“T Kitchen | ఈ రెస్టారెంట్ గేటు మొదలు నేల, కుర్చీలు, లైట్లు.. అన్నీ గులాబీ రంగులోనే ఉంటాయి”