మన ప్రాచీన జానపద కళారూపాలలో వీధి నాటకం ఒకటి. దీనిని ‘బయలు నాటకం, వీధి బాగోతం, చిందు బాగోతం’ అని కూడా పిలుస్తారు. బాగోతం (భాగవతం) అంటే లీల, మాయ, గుట్టు, బూటకం అని అర్థం. అంతరంగాల, అంతరార్థాల గుట్టు రట్టు చేసి బట్టబయలు చేయడమే బయలు నాటక లక్ష్యం. ఇక్కడ ఏ దాపరికం ఉండదు. అంతా పారదర్శకమే. ప్రజలకు అన్నీ తెలుస్తాయి. ప్రజలు అలా ఆ నాటకంతోనూ, పాత్రలతోనూ మమేకం అవుతారు.
నాటి బయలు నాటకం అవశేషాలు నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగడం గమనార్హం. సినిమా కంటే ముందు పుట్టి, పురాణ పాత్రలను బొమ్మకట్టి చూపుతూ చతుర్విధ నటనా లక్షణాలతో (ఆంగిక, వాచికం, ఆహార్యం, సాత్వికం) ప్రాణం పెట్టి నటించడం వారికే చెల్లు. ‘ద్రౌపదీ వస్ర్తాపహరణం’ నాటకాన్ని ఎక్కువగా బయలు నాటకంగా ప్రదర్శిస్తారు. నాటకం ఆద్యంతమూ పద్యాలు, వచనాలు, దరువులు, రగడలతో ఉర్రూతలూగిస్తూ ఉంటుంది.

శకుని సృష్టించిన మాయాపాచికల జూదంలో పాండవులు సర్వస్వాన్ని కోల్పోతారు. కడకు ధర్మారాజు నలుగురు తమ్ములను, భార్య ద్రౌపదిని కూడా పోగొట్టుకుంటాడు. ‘ధర్మరాజు తానోడిన పిదప పందెంలో తన్ను ఒడ్డెనా? లేక తన్ను ఒడ్డి తాను ఓడెనా?’ అని ద్రౌపది ప్రశ్నిస్తుంది. కౌరవ సభ ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వదు. ‘ధర్మరాజు తాను ఓడిన తర్వాత తనను పందెంలో పణంగా పెట్టడానికి అతగాడికి ఏం హక్కు ఉన్నది? లేక తననే ముందుగా పణం పెట్టడానికి తాను ధర్మరాజుకే కాక పంచ పాండవులందరికీ సహ ధర్మచారిణిని కదా?’ అని ప్రశ్నిస్తుంది పాంచాలి. దానికి ‘సోదరులు సహా సర్వస్వం కోల్పోయిన ధర్మరాజు ఇప్పుడు బానిస. ఆ బానిస భార్య బానిస కాక మరేమిటి?’ అని కౌరవులు హేళన చేస్తూ నవ్వుతారు.

ఈ నాటకంలో పాత్రల ప్రవేశమే విచిత్రం. వేషధారులు ఎడ్ల బండ్లపై ఊరేగుతూ కాగడా వెలుగుల్లో తప్పెట్ల హోరుతో వచ్చి ఒక్క ఉదుటన రంగస్థలంపై దుముకుతారు. ప్రేక్షకుల ఈలలు, చప్పట్లు, పూలవర్షం సరే సరి! ధర్మరాజు, భీముడు, అర్జునుడు, ద్రౌపది, కృష్ణుడు, కర్ణుడు, శకుని ప్రధాన పాత్రలు కాగా, పాత్రగామి, సూత్రధారి ఉపపాత్రలు. హార్మోనియం, తబలా, సన్నాయి, తాళాలు వగైరా వాద్యాలు ఉపయోగిస్తారు. ద్రౌపది పాత్ర పురుషుడే ధరించాడు. పాత్రలతో సమానంగా కోరస్ బృందం రంగస్థలంపై సాధారణ దుస్తులతో నిలబడే ఉంటుంది.
‘ఓరోరి దుశ్శాసనా, రవంత బుద్ధిలేని చవటా, మాటిమాటికి నా మీసము చూసి బిత్తరపోయి పరుగు లంఘించు పిరికిపందవు. నీ దొంగ చూపుమాని నా మాటలు శ్రద్ధగా వినుము. యుద్ధ క్షేత్రమున సురవైరులు చూచుచుండగా నీ డెందము చీల్చి నీ నెత్తురు బిర బిర త్రాగెదా!’ ఇలా సాగే వచనంలో అశువు కూడా అలవోకగా వస్తుంది. వీర, రౌద్ర రసాలే ఇందులో ప్రధానం. ఒక విధమైన ఉద్రేకం, పూనకం గల సున్నితమైన భీముడి పాత్రలో నటుడు జీవిస్తుంటాడు. ఒక్కసారి అదుపు తప్పి ఘర్షణకు తలబడే స్థితి ఉంటుంది(ట). అందుకే ఆయా పాత్రలను తాళ్లతో బంధించి పట్టుకుని ఉంటారు.

పతాక సన్నివేశంలో ద్రౌపదిని వివస్త్రగా పాండవులు చూడలేరనేది ప్రేక్షకుల భావన. ప్రేక్షకులే వచ్చి పాండవుల చుట్టూ చీరలు, చద్దర్లు కడతారు. ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతున్నది. శ్రీకృష్ణ సందేశంతో కౌరవాగ్రజులను ప్రేక్షకులు తరమడంతో ఈ నాటకం పరిసమాప్తమవుతుంది.
నాటకం పేరు: ద్రౌపది వస్ర్తాపరహరణం
రూపకం: బయలు నాటకం
నిర్వహణ: టింబక్టు, సి.కె.పల్లి (రాయలసీమ)
పాత్రధారులు: రామన్న, రవి, శ్రీనివాసులు,
నరసింహులు, ధనుంజయ మొదలైనవారు.