‘ఏమోయ్ వెంకట్రావ్… పెట్టుకుంటే చక్కగా కనిపించడమే కాదు, చుక్కలా వెలిగిపోవాలి… అలాంటి నగ ఏదన్నా ఉంటే చూపించు…’ ఆర్డరేసినట్టు అడిగింది అనసూయ. ‘ఓ యస్… వై నాట్… అచ్చు అలాంటివే మన దగ్గర ఉన్నాయి’ ధిలాసాగా సమాధానమిచ్చాడు వెంకీ. ఆ నగల్ని చూడగానే అవాక్కవడం అనసూయ వంతైంది. కారణం, అవి నిజంగానే వెలిగిపోతున్నాయి. చీకట్లోనూ తళుకులీనుతున్నాయి. ఎందుకంటే అది ‘ఎల్ఈడీ లైట్ జువెలరీ’ మరి!

అందం, ట్రెండు మాత్రమే కాదు మనమేం పెట్టుకున్నా వెరైటీగా కనిపించాలి, అందుకోసమే పెట్టి పుట్టామా అనిపించాలి… ఇదీ నవతరం నాన్ కంప్రమైజబుల్ రూల్. అందుకోసం ఎంత వరకూ అయినా వెళతారు, ఏ ఫ్యాషన్నైనా స్వాగతిస్తారు. మనం ట్రెండు సృష్టించినా సరే, ఎదుటి వాళ్ల ట్రెండు మనం ఫాలో అయినా సరే… కానీ ఫ్యాషన్ విషయంలో మాత్రం ఫ్లో తగ్గడానికి వీల్లేదు. వీళ్ల ైస్టెల్‌ని ఎప్పటికప్పుడు చప్పున పట్టడమే డిజైనర్ల టాస్క్. లేటెస్టు అనే పదం కోసం తహతహలాడతారు అటు వాళ్లు, ఇటు వీళ్లు. అందుకే వెలిగే నగలు ఇప్పుడు హాటెస్టు మోడల్‌గా ఫ్యాషన్ స్ట్రీట్‌ను చుట్టేస్తున్నాయి. మామూలుగా చూస్తే సాధారణ ట్రెండీ జువెలరీలా కనిపించే ఇవి, చిన్న బటన్ నొక్కితే చాలు లైట్లతో వెలిగిపోతూ అందరి దృష్టినీ ఆకట్టుకుంటాయి.

ఎన్ని వెరైటీలో…
ఎల్ఈడీ లైట్ జువెలరీలో పేరుకు తగ్గట్టే చిన్న ఎల్ఈడీ బల్బులు అమర్చి ఉంటాయి. మెటల్, ప్లాస్టిక్, చెక్క తదితరాలతో వీటిని రూపొందిస్తున్నారు. ఈ నగల లోపలే చిన్న బ్యాటరీలు కూడా అమరుస్తారు. అక్కడ ఇచ్చే మీటను నొక్కగానే ఇందులో ఉండే లైట్లు వెలుగుతాయి. కొన్ని ఒకే రంగులో వెలిగితే, కొన్నింటిలో రంగులు మార్చుకునే అవకాశమూ ఉంది. అంతేకాదు, లైట్లతో డిజైన్లు ప్రతిబింబించేవీ ఇందులో తయారవుతున్నాయి.
అంటే, ఉదాహరణకు చెవి పోగులోని లైటు నొక్కగానే మెడ మీద రంగు రంగుల్లో వివిధ ఆకృతుల్లో లైటింగ్ కనిపిస్తుందన్నమాట. ఎల్ఈడీ జువెలరీలో చెవిపోగులు, నెక్లెస్‌లు, లాకెట్లు, గాజులు, హెయిర్పిన్లు… ఇలా అన్ని రకాలూ రూపొందుతున్నాయి. ముఖ్యంగా చెవి పోగులను వీటిలో ట్రెండీగా తయారు చేస్తున్నారు. షాండ్లియర్, లాంతరు, బెడ్‌లైట్… ఇలా నిజమైన లైట్లను పోలినట్టు వీటిని తయారు చేసి, అవే వెలుగుతున్నాయా అనే అనుభూతి కలిగేలా తీర్చిదిద్దుతున్నారు. ఇంకేం, ఈసారి నైట్ పార్టీలో ఈ వెలిగే నగలు పెట్టుకుని మీరూ కాంతులీనొచ్చు మరి. జిల్ జిల్ జిగేల్..!!