ఈ రోజుల్లో ఏ నెటిజన్కైనా జీ మెయిల్ అకౌంట్ లేదంటే షాక్ అవుతాం. అంతలా మెయిల్ కమ్యూనికేషన్‌కి జీ మెయిల్‌ని ప్రైమ్ సోర్స్‌గా వాడుతున్నాం. ఎంతసేపూ మెయిల్స్ పంపడం.. వచ్చినవి చూసుకోవడం.. ఇన్‌బాక్స్ ఫుల్ అయితే డిలీట్ చేయడం.. ఇవి తప్ప ఎంతమందికి జీ మెయిల్లోని సెక్యూరిటీ ఫీచర్స్ తెలుసు? నిజానికి ఇంటర్నెట్ భద్రత విషయానికి వస్తే, చాలామందికి అందుబాటులో జీ మెయిల్ ఫీచర్స్ గురించి తెలియదు. అత్యంత బలమైన రక్షణ వ్యవస్థగా సెట్ చేసిన ఈ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి ప్రతీ యూజర్ తెలుసుకోవాల్సిందే. నిత్యం ఆయా ఫీచర్స్‌ని వాడితే మీరు సేఫ్! డేటా బ్రీచ్‌లకు భయపడక్కర్లేదు!!
గూగుల్ మెయిల్ సర్వీస్ కేవలం ఉచిత ఇ-మెయిల్ అందివ్వడమే కాదు.. వ్యక్తిగత సైబర్ సెక్యూరిటీ సూట్నూ అందిస్తుంది. ఇది అనేక రక్షణ వ్యవస్థలు, గోప్యతల వలయాల్ని కలిగి ఉంటుంది. వీటిల్లో ప్రధానమైంది.. విధిగా సెట్ చేసుకోవాల్సింది టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA). ఇది మీ అకౌంట్‌కు రెండో తాళం. దీన్ని ఎనేబుల్ చేసేందుకు Google Account- Security-2-Step Verificationలోకి వెళ్లండి. దీన్ని ఎందుకు ఎనేబుల్ చేయాలంటే.. మీ పాస్వర్డ్ దొంగలించినా, అదనపు సెక్యూరిటీని పెట్టుకోవచ్చు. దీంతో ఎవరైనా మీ లాగిన్ వివరాలతో వేరే ఫోన్, సిస్టమ్స్‌లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే మీకు ఇట్టే తెలిసిపోతుంది. మీరు మీ ఫోన్‌కు వచ్చే కోడ్ యాక్సెప్ట్ చేసినప్పుడు, ‘Yes’ నొక్కినప్పుడు మాత్రమే లాగిన్ అవ్వగలరు. అంతేకాదు, ఫిషింగ్ బెడద లేకుండా ఉండేందుకు Passkeysను వాడొచ్చు. వేలిముద్ర, ఫేస్ అన్‌లాక్ ద్వారా పాస్వర్డ్ లేకుండానే లాగిన్ అయ్యే కొత్త విధానం కూడా ఉంది.
డివైజెస్‌ను ట్రాక్ చేయండి
మీ ఖాతాలో ఎవరైనా థర్డ్ పర్సన్ లాగిన్ అయ్యారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. Google Account లోని ‘Your Devices’ విభాగంలోకి వెళ్లి, మీ ఖాతాలో లాగిన్ అయిన ప్రతి ఫోన్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీని చూడొచ్చు. గుర్తు తెలియని డివైజ్ కనిపిస్తే, వెంటనే అందులోంచి ‘Sign out’ అయిపోవచ్చు. కొత్త డివైజ్ లాగిన్ కాగానే Google మీకు వెంటనే సమాచారం ఇచ్చేలా ‘Send Security Alerts’ ఆన్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసుకునేందుకు Google Account-Security-Your Devices-Manage all devices’ ఆప్షన్ ఎంచుకోవాలి. దీనికి తోడు, పాస్వర్డ్ మరిచిపోయినా, అకౌంట్ లాక్ అయినా, ‘Recovery phone’, ‘Recovery email’ సెట్ చేసుకుని మీ అకౌంట్‌ను సురక్షితంగా తిరిగి పొందవచ్చు. పాత ఫోన్ నెంబర్లు ఉండటం వల్ల చాలామంది అకౌంట్ యాక్సెస్ కోల్పోతారు. అందుకే రికవరీ సమాచారాన్ని ఏడాదికి ఒకసారైనా అప్డేట్ చేయడం తెలివైన పని. ఈ సదుపాయాన్ని రివ్యూ చేసుకునేందుకు Google Account-Security-Ways we can verify it’s you’ లోకి వెళ్లాలి.
డబ్బు, యాప్‌లపై నిఘా
బ్యాంకింగ్ అకౌంట్, మెయిల్ అకౌంట్ రెండిటినీ కాపాడుకోవడానికి ‘Payments & Subscriptions’ విభాగాన్ని తనిఖీ చేయండి. Google Pay, YouTube, Play Store ద్వారా మీరు చేసిన అన్ని యాక్టివ్ సబ్స్క్రిప్షన్ల జాబితా ఇక్కడ కనిపిస్తుంది. మీకు అవసరం లేని ఆటో-రెన్యూవల్స్‌ను కూడా ఆపొచ్చు. ఇది అకౌంట్ నుంచి జరిగే పేమెంట్స్‌ను నియంత్రించడానికి సాయం చేస్తుంది. ఆప్షన్స్ నావిగేషన్ కోసం.. Google Account-Payments & Subscriptions-Subscriptionsలోకి వెళ్లి సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. Purchase History వాడి, మీరు ఇటీవల చేసిన కొనుగోళ్లు, డొనేషన్స్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే, ‘Third-party apps with account access’ విభాగానికి వెళ్లి, మీరు ఏయే యాప్‌లకు మీ డేటా యాక్సెస్ ఇచ్చారో చూసుకోవచ్చు. 90 రోజులకు పైగా వాడని యాప్ ఏదైనా ఉంటే.. దానిని తొలగించడం ద్వారా మీ గోప్యతను కాపాడుకోవచ్చు. Google Account Security- Third-party apps with account accessలోకి వెళ్లి యాప్స్ వివరాలు చెక్ చేసుకోవచ్చు.
గోప్యత మీ చేతుల్లో
పాస్‌వర్డ్‌ల భద్రత కోసం Google Password Manager ఉంది. ఇది బలహీనంగా ఉన్న, మళ్లీ మళ్లీ వాడుతున్న, లీక్ అయిన పాస్‌వర్డ్‌లను గుర్తిస్తుంది. ‘Password Check-Up’ ఆన్ చేస్తే, మీ పాస్‌వర్డ్‌ల భద్రతను ఎప్పుడూ చెక్ చేస్తుంది. నావిగేషన్ కోసం Google Account-Security-Password Managerలోకి వెళ్లండి. గోప్యత విషయానికి వస్తే, ‘Data & Privacy’ సెట్టింగ్‌లోకి వెళ్లి, మీ లొకేషన్, వెబ్ యాక్టివిటీ, YouTube హిస్టరీ లాంటి డేటాను Google ఎంతవరకు సేవ్ చేయాలో మీరే నిర్ణయించవచ్చు. ట్రాకింగ్‌ను ఆపేందుకు, ప్రతి 3, 18, 36 నెలలకు ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేలా సెట్ చేయవచ్చు. అలాగే, అత్యవసర సమయాల్లో లాగిన్ అవ్వడానికి 10 బ్యాకప్ కోడ్లు కూడా Google ఇస్తుంది. వీటిని ఆఫ్‌లైన్‌లో, సురక్షితంగా దాచుకోండి. నావిగేషన్ కోసం Google Account- Data & Privacy-History Settings చూడండి.
మొత్తం ఉచితంగానే..
ఈ మొత్తం ఫీచర్స్‌ని గూగుల్ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నది. ఎలాంటి ప్రీమియం సెక్యూరిటీ టూల్స్ కొనక్కర్లేదు. AI ఆధారిత ఫిషింగ్, మాల్వేర్ స్కానింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ అలెర్ట్‌లు కూడా ఇందులో ఉన్నాయి. సో.. Gmail ఖాతా కేవలం ఇన్‌బాక్స్ మాత్రమే కాదు.. మీ డిజిటల్ గుర్తింపు కోట. అందుకే అకౌంట్ సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో రాజీపడొద్దు. రోజులో కొన్ని నిమిషాలు కేటాయించి ఈ సెట్టింగ్‌లను చెక్ చేస్తూ ఉండండి. ఉత్తమ సైబర్ సెక్యూరిటీకి డబ్బు అవసరం లేదు.. అవగాహన ఉంటే చాలు!!
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్