ప్రపంచీకరణ యుగంలో సంపన్న దేశాల రహస్యం ‘ఆంత్రప్రెన్యూర్‌షిప్’. తెలివితేటలే పెట్టుబడిగా, వ్యూహాలే ముడి సరుకుగా కొత్త ఆలోచనలకు ఆవిష్కరణలు చేస్తున్న కాలంలో యుద్ధానికి మించిన సాహసం చేయాలి. ఆ తెగువలేక కంఫర్ట్ జోన్లో ఉద్యోగాలు చేసే యువకులెందరో! బతికితే ఆంత్రప్రెన్యూర్గానే బతకాలని కలగన్న యువకుడిని కాలం ఉద్యోగిగా మార్చింది. కానీ, అతని కలను మార్చలేకపోయింది. ఆ కల ఎన్ని మలుపులు తిరిగి నిజమయ్యిందో? ఎన్ని ఇన్స్టిట్యూషన్లకు నాంది పలికిందో? ఎన్ని అవార్డులు సాధించిందో? ఎన్ని సర్టిఫికేట్లు అందుకుందో? తెలుసుకోవాలంటే అమెరికాలో విడుదలైన UNCHARTEDలోని ఏడుగురు స్ఫూర్తిమంతమైన భారత ఆంత్రప్రెన్యూర్ల కథల్లో ఒకటైన డాక్టర్ నరేంద్ర రామ్ నంబుల లైఫ్ (స్పాన్) స్టోరీ చదవాలి.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (హైదరాబాద్)లో ఎంబీఏ చదివే అరవై మంది విద్యార్థుల్లో ముగ్గురికి తప్ప మిగతా వాళ్లందరికీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఆఫర్లు వచ్చాయి. ఉద్యోగం రాని ముగ్గురిలో నేనొకడిని. అప్పటికి ఉద్యోగం చేయాలనే కోరికే లేదు. కాబట్టి కష్టపడి చదవాలనే పట్టుదలా లేదు. పెద్దయ్యాక ఉద్యోగం చేయాలన్న ఆలోచన లేకుండా పెరిగాను. దానికి కారణం మా నాన్న డాక్టర్ ఎన్.పి.రామ్. ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్. తను ఏది కొనాలన్నా ఎంతో ఆలోచించేవారు.
ఏ వస్తువు కొనమన్నా ఇది కొనాలా? వద్దా?, దానివల్ల ఉపయోగం ఏంటి? అనుకునేవారు. నేను ఉద్యోగం చేస్తే నా లైఫ్ కూడా ఇలాగే ఉంటుందనుకున్నాను. కాబట్టి సొంతంగా వ్యాపారం చేయాలన్న ఆలోచన నాతోపాటే పెరిగింది. నాన్నకు క్రీడా పాఠశాలల సంచాలకుడిగా ప్రమోషన్ వచ్చింది. హైదరాబాద్‌కు బదిలీ అయింది. ఇద్దరు డ్రైవర్లు, రెండు కార్లు, గవర్నమెంట్ బంగళా, వాచ్మెన్, వంట మనిషి.. లైఫ్ రాయల్‌గా ఉండేది. ఇదంతా చూసిన ఫ్రెండ్స్ ‘నీకేంట్రా!.. నువ్వు జాబ్ చేయకపోయినా నడుస్తుంది. మీ నాన్న బాగా సంపాదించే ఉంటాడులే’ అనేవాళ్లు. నేనూ అలాగే అనుకున్నాను.
నాన్న రిటైర్ అయ్యారు. నా ఎంబీఏ పూర్తయి ఆరు నెలలైంది. ఉద్యోగం లేదు. నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని ‘ఎంత వరకు చదివించాలో అంత వరకు చదివించాను. మంచి కాలేజీలో ఎంబీఏలో చేర్పించాను. ఇక నేనేమీ చేయలేను. నీ జీవితం నీవే నిలబెట్టుకో’ అని నాన్న అన్నారు. అప్పుడు రియలైజ్ అయ్యాను. అప్పటిదాకా మా నాన్న ఎంతో సంపాదించాడని భావించాను. తన దగ్గర ఏం లేవన్నాడేంటని ఆశ్చర్యపోయాను. ఆంత్రప్రెన్యూర్ కాలేక ఉద్యోగంలో సరిపెట్టుకోవడానికి సిద్ధపడ్డాను. ఉద్యోగాల వేటలో పడ్డాను. హుసిస్ కన్సల్టెన్సీ కంపెనీలో ట్రైనీగా చేరాను. అక్కడో ఆరు నెలలు పని చేసిన తర్వాత పయనీర్ ఆన్లైన్లో చేరాను. ఏడాదిన్నరకు హెచ్.ఆర్. మేనేజర్ అయ్యాను. పయనీర్ గ్రూప్‌కి ఎనిమిది కంపెనీలున్నాయి. వాటన్నిటికీ ఒకటే హెచ్.ఆర్. ఉండేది. మూడేళ్లకు పయనీర్ గ్రూప్ హెచ్ఆర్ హెడ్‌గా ప్రమోట్ అయ్యాను. అయిదేళ్లలో వచ్చిన డబ్బులు దాచుకుని, కొంత లోన్ తీసుకొని ఒక ప్లాట్ తీసుకున్నాను. ఎంత ఉద్యోగం చేసినా వ్యాపారిగా ఎదగాలన్న నా ఆశయం మాత్రం ఎప్పుడూ కొడిగట్టలేదు.
ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కంపెనీ ఐసాస్ని అమ్మాలని దాని ప్రమోటర్స్ చూస్తున్నారు. అయిదుగురు స్నేహితులం కలిసి ఆ కంపెనీని టేకోవర్ చేద్దామనుకున్నాం. తలా పదిహేను లక్షల పెట్టుబడి జమ చేయాలి. నా దగ్గర డబ్బు లేదు. నాకు లోన్ ఇచ్చిన బ్యాంక్ ఆఫీసర్ అదే ప్లాట్ మీద టాప్ అప్ లోన్ ఇస్తానన్నాడు. అలా అప్పు చేసి బిజినెస్‌లో అడుగుపెట్టాను. అప్పటికే హుసిస్ కన్సల్టెన్సీ ఎండీ జీఆర్ రెడ్డి, పయనీర్ ఆన్లైన్ ఎండీ శ్రీధర్ రెడ్డి దగ్గర మేనేజ్మెంట్ పాఠాలెన్నో నేర్చుకున్నాను. వాళ్ల స్ఫూర్తితో నేనూ ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ఆ అవకాశం తొందరగానే వచ్చింది. మేము కొన్న ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కంపెనీలో నేను హెచ్.ఆర్. బాధ్యతలు, మరొకరు మార్కెటింగ్ ఇలా.. తలా ఒక పని పంచుకున్నాం.
కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ల భాగస్వామ్యంతో పలు ప్రోగ్రామ్‌లు నిర్వహించాం. కేంద్ర ప్రభుత్వం పేదవాళ్లకు కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ప్రోగ్రాములు నేర్పేది. ఆ కోర్సులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్లం. ‘ఎడ్యూ మై సొల్యూషన్స్’ అనే ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రారంభించాం. దేశంలోని 12 యూనివర్సిటీలతో కలిసి కంప్యూటర్ కోర్సులు నిర్వహించాం. యూనివర్సిటీలు ఆఫర్ చేసే కంప్యూటర్ కోర్సులు చదివే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవాళ్లం. పలు ఐటీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఈ కోర్సులు నిర్వహించాం. కొన్నాళ్లకే సొంతంగా ‘195 ఓవర్సీస్ ఎడ్యుకేషన్’ అనే స్టూడెంట్ కన్సల్టెన్సీని ప్రారంభించాను. దేశంలో 12 బ్రాంచ్‌లు నడిపాను.
వ్యాపారంలో కూడా రాజకీయాలు ఉంటాయి. ఆంత్రప్రెన్యూర్‌గా అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న రోజుల్లో హెర్బల్ ప్రొడక్షన్లో అడుగుపెట్టాలనుకున్నాను. ఢిల్లీలో ఉన్న హెర్బల్ ప్రొడక్ట్స్ (న్యూట్రాసూటికల్స్) కంపెనీలో పెట్టుబడులు పెట్టాను. ఆ సమయంలో ఢిల్లీలో ఉండే రాజకీయ వాతావరణం నన్ను ప్రభావితం చేసింది. ఢిల్లీ కేంద్రంగా ‘పవర్ పాలిటిక్స్’ పేరుతో మీడియా కంపెనీని ప్రారంభించాను. ‘పవర్ పాలిటిక్స్’ అనే ఇంగ్లిష్ మ్యాగజైన్ ప్రచురించేవాళ్లం. అప్పటికి నా వయసు 31 సంవత్సరాలు. అనుభవం అంతగా లేదు. అక్కడ వ్యాపారాల్లో ఉండే రాజకీయాలకు తట్టుకోలేక.. తొందర్లోనే హెర్బల్ కంపెనీ నుంచి బయటపడ్డాను.
హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీ నుంచి బయటికి రావడం వల్ల నా చిన్న నాటి కోరిక తీరలేదనే వెలితి ఉంది. ప్రొటీన్, మల్టీ విటమిన్ ఉత్పత్తులు తయారు చేయాలని చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని. నేను పొద్దుటూరులో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చదివే రోజుల్లో అన్ని ఆటల్లో ముందుండేవాడిని. అండర్-13, అండర్-14 క్రికెట్లో కడప జిల్లా జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాను. రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్నాను. జిల్లా స్థాయిలో జరిగిన 100 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో గెలిచాను. బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ ఇలా చాలా ఆటలు ఆడేవాడిని. రాత్రి పూట కూడా ఇంట్లోనే క్రికెట్ ఆడేవాడిని. నేను రంజీ ఆడాలన్నది నాన్న కోరిక. గొప్ప క్రీడాకారుడిని అవ్వాలని ఆయనకు లేకున్నా, అందులో ఆడితే రైల్వే, బ్యాంకుల్లో క్రీడాకారుల కోటాలో ఉద్యోగం వస్తుందని ఆయన ఆశపడేవారు.
అందుకు తగ్గట్టే క్రికెట్ జట్టుకి పేరుగాంచిన సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో బీకామ్‌లో చేరాను. స్పోర్ట్స్ కోటాలో ఎంబీఏలో సీటు వచ్చింది. నేను బలంగా ఉండాలని నాన్న ప్రొటీన్ పౌడర్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు తెచ్చేవాడు. కింద పడకుండా తినాలని, వేస్ట్ చేయొద్దని జాగ్రత్తలు చెప్పేవాడు. ఎందుకని అడిగితే… అది విదేశాల నుంచి తెప్పించానని, మన దేశంలో దొరకదని చెప్పేవాడు. మన దేశంలో ఇవి ఎందుకు తయారు కావో అర్థం కాలేదు. పెద్దయ్యాక ఇవి తయారు చేయాలని నేను అనుకునేవాడిని. ఈ రంగంలో అవకాశం ఉందని అడుగుపెట్టాను. కానీ, పాలిటిక్స్ నన్ను బయటికి నెట్టాయి. పోగొట్టుకున్న చోటే వెదకాలన్నట్టు.. ఇదే రంగంలో మళ్లీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను.
అమెరికా, జపాన్, కెనడా, యూకే, ప్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో న్యూట్రాసూటికల్స్ గురించి సాధారణ ప్రజలందరికీ తెలుసు. కానీ, ఇక్కడ ఆ అవగాహన లేదు. ప్లాంట్‌కి స్థల కేటాయింపు కోసం పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేశాను. అప్పటికి ఆ కేటగిరి లేదు. ఫుడ్, ఫార్మాసూటికల్స్ మాత్రమే ఉన్నాయి. ‘వాట్ ఈజ్ దిస్ న్యూట్రాసూటికల్స్’ అని అడిగారు. ప్రొటీన్ పౌడర్, క్యాల్షియం, మల్టీ విటమిన్ల గురించి చెబితే ‘ఓహో.. అవా’ అన్నారు. జీనోమ్ వ్యాలీ ఫేజ్ 3లో స్థలం కేటాయించారు. 2016లో ‘లైఫ్ స్పాన్’ న్యూట్రాసూటికల్స్ తయారీ కంపెనీని ప్రారంభించాను. ఈసారి నేనొక్కడిగానే దిగాను. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ప్లాంట్ నిర్మాణం మొదలుపెట్టాను. రూ.ఇరవై కోట్ల అంచనాతో అడుగుపెడితే.. అంతకు ఐదింతలు ఎక్కువ ఖర్చు అయింది.
పెట్టుబడి కోసం అప్పటిదాకా సంపాదించిన భూములు, ఆస్తులు అమ్మాను. మళ్లీ లోన్ తీసుకోవాల్సి వచ్చింది. రకరకాల ఆటంకాలు ఎదురయ్యాయి. వాటన్నిటినీ దాటుకొని రావడానికి ఆలస్యమైంది. న్యూట్రాసూటికల్స్ మార్కెట్ చేయడం మొదట్లో కష్టమైంది. ఓ దశలో మ్యానుఫాక్చరింగ్ ఎందుకు పెట్టానా అనుకున్నాను. చక్కగా బ్రాండ్స్ పెట్టుకుని అమ్ముకుంటే బాగుండేదనిపించింది. ఎన్ని కష్టాలున్నా చాలెంజ్‌గా తీసుకుని నడిపించాను. కొన్నాళ్లకు క్లిక్ అయ్యింది. అత్యున్నత ప్రమాణాలు పాటించే కంపెనీలకు దక్కే యూఎస్‌ఎఫ్‌డీ, జీఎంపీ సర్టిఫికేట్ వచ్చింది. తెలంగాణలో ఆయుర్వేద ఎన్ఏబీఎల్ సర్టిఫికేట్ పొందిన రెండో కంపెనీ మాది. 30 ఏళ్లుగా ఉన్న కంపెనీలు సాధించలేని గుర్తింపు మా సంస్థ దక్కించుకుంది.
నాలుగు పదుల వయసులోనే అంతర్జాతీయ ప్రమాణాలతో పెద్ద ఫ్యాక్టరీని పెట్టినవాళ్లు లేరు. అయిదేళ్లలో ఒక పెద్ద బ్రాండ్‌ని డెవలప్ చేశాను. ఇప్పుడు మా కంపెనీకి 500 పైగా ఫార్ములేషన్స్ లైసెన్సులు ఉన్నాయి. దుబాయ్, యూఏఈ, పోలాండ్, కెనడా, కాంబోడియా… మరెన్నో దేశాలకు న్యూట్రాసూటికల్స్, హెర్బల్ ఉత్తత్తులు ఎగుమతి చేస్తున్నా. చాలా పేరుమోసిన కంపెనీలకు న్యూట్రాసూటికల్స్ తయారు చేసి ఇస్తున్నాం. అనేక కంపెనీల కోసం పని చేస్తూ సొంత బ్రాండ్ ‘లైఫ్ స్పాన్’ పేరుతో న్యూట్రాసూటికల్స్ అమ్ముతున్నా. నా కష్టం ఫలించింది. ఎన్నో అవార్డులు దక్కాయి. లండన్ పార్లమెంట్ మా కంపెనీకి గ్లోబల్ ఇండియన్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్, మోస్ట్ ప్రామిసింగ్ కంపెనీ అవార్డులు ఇచ్చింది. ‘లైఫ్ స్పాన్’ తయారీ మొదలుపెట్టిన ఏడాదే బెస్ట్ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్‌గా అవార్డు దక్కించుకుంది. ఆంత్రప్రెన్యూర్‌గా రాణించాలన్న నా కల నెరవేరింది. సాకారమైన స్వప్నాన్ని శాశ్వతం చేయాలనే తపనతో నా ప్రయాణం కొనసాగిస్తున్నా.
నేను కంప్యూటర్స్ చదవలేదు. ఆ రంగంలో పని చేయలేదు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా కంప్యూటర్ విద్య ఎంతోమందికి నేర్పించాను. జర్నలిజం చదవలేదు. జర్నలిస్ట్‌గా పని చేయలేదు. ఓ పత్రికను విజయవంతంగా నడిపాను. ఫార్మసీ చదవలేదు. ఫార్మసీ మార్కెటింగ్ చేయలేదు… న్యూట్రాసూటికల్స్లో దిగ్గజ సంస్థలనే దాటి పోయాను. అనేక రంగాల్లోని ఎంతోమంది విజేతల్లా భారీ బడ్జెట్‌తో టాలెంటెడ్ పీపుల్ని నియమించుకుని కంపెనీ నడపలేదు. నా కంపెనీకి నేనే కూలీ. నేనే క్యాపిటల్. అమ్మానాన్నలు ఇచ్చిన ఆస్తుల్లేవు. నాకున్నది ఇద్దరు కార్పొరేట్ లీడర్ల (జి.ఆర్. రెడ్డి, శ్రీధర్ రెడ్డి) దగ్గర నేర్చుకున్న అనుభవ పాఠాలే! వాళ్లిద్దరి దగ్గర బిజినెస్ మేనేజ్మెంట్ కంటే ఎక్కువ నేర్చుకున్నా. జీరో నుంచి మొదలై హీరోగా నిలిచిన నా ప్రయాణానికి వారిచ్చిన స్ఫూర్తే నిజమైన పెట్టుబడి.
– డాక్టర్ నరేంద్ర రామ్ నంబుల, సీఎండీ లైఫ్ స్పాన్
…? నాగవర్ధన్ రాయల