మద్యం, కాఫీ… ఈ రెండిటి గురించీ తరచూ ఏదో ఒక పరిశోధన ఫలితం వినిపిస్తూనే ఉంటుంది. కానీ, ‘మా అధ్యయనం మాత్రం చాలా కొత్తది’ అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. మితంగా కనుక మద్యాన్ని సేవిస్తే, గుండె సమస్యలు తక్కువగా వస్తాయని విశ్లేషిస్తున్నారు. దీనికోసం వాళ్లు అమెరికా,ఆస్ట్రేలియాలకు చెందిన 18 వేల మంది
ఆరోగ్యాన్ని పరిశీలించారు. వీరంతా కూడా 70 ఏండ్లు పైబడినవారే. దాదాపు ఐదేండ్ల పాటు వారి అలవాట్లను గమనించిన తర్వాత తేలినదేమిటంటే… అసలు మద్యం జోలికే పోనివారితో పోలిస్తే, మితంగా మందు తాగేవారిలో గుండె సంబంధమైన మరణాలు తక్కువగా కనిపించాయి. ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. సీసా ముందు కూర్చున్నప్పుడు, ‘మితం’ అనే మాట మద్యపాన ప్రియుల చెవికెక్కదు. ఆ హద్దు దాటితే, లాభాల కంటే నష్టాలే అధికం. కాబట్టి ‘స్మాల్’ పెగ్గులకు కట్టుబడినప్పుడే మద్యం జోలికి పోవాలి! లేదంటే.. గుడ్ బై!