Deepika Pilli | సోషల్ మీడియా స్టార్‌గా అభిమానులను సంపాదించుకొని నటిగా ఎదిగింది దీపికా పిల్లి. టిక్‌టాక్‌లో సరదాగా చేసిన వీడియోలతో యాంకర్‌గా అవకాశం అందుకున్న ఈ అమ్మడు తక్కువ సమయంలోనే హీరోయిన్గా వరుస చాన్స్‌లు కొట్టేస్తున్నది. డ్యాన్స్ షోలతో ఫేమస్ అయిన ఈ హైదరాబాదీ చిన్నది ప్రస్తుతం సోలో హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. తాజాగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలోనూ హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. ఈ సందర్భంగా దీపిక పంచుకున్న కబుర్లు..
కంటెంట్ క్రియేటర్‌గా, ఇన్ఫ్లుయెన్సర్గా మారాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, డ్యాన్స్ చేయడం అంటే విపరీతమైన ఆసక్తి. కాలేజ్ డేస్‌లో సరదాగా టిక్‌టాక్‌లో షార్ట్ డ్యాన్స్, డబ్స్మాష్ వీడియోలు చేసేదాన్ని. మనదేశంలో టిక్‌టాక్ బ్యాన్ అవడంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా నా వీడియోలను అభిమానులతో పంచుకున్నా. దాంతో ఫాలోవర్స్ సంఖ్య చాలా పెరిగింది. యాంకర్‌గా అవకాశాలు వచ్చాయి.
కథ ఎంచుకునేటప్పుడు చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడను. కథలో నా పాత్రకు ప్రాధాన్యం ఉందా లేదా అనే ఆలోచిస్తాను. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ అనగానే ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి ఓకే చెప్పేశా. నాతో స్టేజి పంచుకున్న తోటి యాంకర్లు సుధీర్, ప్రదీప్ లాంటి వాళ్లతో సినిమాల్లో నటించడం చాలా సంతోషంగా ఉంది.
ప్లాన్ చేయకుండా నటన నా కెరీర్‌గా మారిపోయింది. ప్రస్తుతానికి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యంగా కష్టపడుతున్నాను. తెరమీద మాడలింగ్తో మొదలైన నా కెరీర్ రియాలిటీ షోలు, సినిమాల్లో అవకాశాలతో విజయవంతంగా సాగడానికి కారణం నా అభిమానులే. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. క్లిష్టపరిస్థితుల్లోనూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆ ఉత్సాహంతోనే ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిలదొక్కుకోగలిగాను.
సోషల్ మీడియా, టీవీ, సినిమా.. ప్లాట్‌ఫామ్ ఏదైనా నేను చేసే కంటెంట్ ప్రేక్షకులను అలరించేలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నన్ను ఎమోషనల్ పాత్రల్లో చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడకపోవచ్చు. అందుకే ప్రయోగాల జోలికి వెళ్లకుండా కామెడీ ప్రధాన కథలను ఎంచుకుంటున్నాను.
ప్రస్తుతం ట్రోలింగ్ అనేది సర్వసాధారణ విషయం. సినీపరిశ్రమకు చెందినవారే ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా చాలామంది రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని పట్టించుకోకపోవడమే మంచిది. అప్పుడే చేసే పని మీద దృష్టి సారించగలుగుతాం.
ఖాళీ సమయాల్లో నా మొదటి ప్రాధాన్యం ట్రావెలింగ్‌కే! కొత్త ప్రదేశాలను చూడటం, భిన్న సంస్కృతులను తెలుసుకోవడం భలేగా ఉంటుంది. నేను వెళ్లిన ప్రాంతం ప్రత్యేకతల్ని కెమెరాల్లో బంధించి అభిమానులతో పంచుకుంటాను. స్నేహితులు, కుటుంబసభ్యులతో గడిపేందుకు ఇష్టపడతాను. సినిమాలు చూడటం, మేకప్‌తో పలు ప్రయోగాలు చేయడం నా అభిరుచులు. జంతువులను ప్రేమిస్తాను. పెట్స్‌తో ఆడుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
నాకు ఆనందాన్ని కలిగించే విషయాల్లో డ్యాన్స్ ఒకటి. ఫ్యాషన్ ఫాలో అవడం, ట్రెండ్‌కి తగ్గట్టు అప్డేట్గా ఉండేందుకు ఇష్టపడతాను. నా చుట్టూ జరిగే సంఘటనల ఆధారంగానే కంటెంట్ క్రియేట్ చేస్తాను. అప్పుడే అది ఎక్కువ మందికి కనెక్ట్ అవుతుంది. భవిష్యత్తులో హీరోయిన్గా చేస్తూనే యూట్యూబర్, ఇన్‌స్టా ఇన్ఫ్లుయెన్సర్గా కొనసాగుతాను.