సీ॥ అఖిల రత్నస్థగితాలంక్రియల కెల్ల
సిరియన గాంతి రంజిలగ జేయ
గాయజ సాయకాకార నేత్రాంచల
శ్రీలెంతొ చెక్కిళ్ళ చెంగలించ
చరణ కంజన్యాస సంసర్గ చే ధాత్రి
చిత్ర లాక్షారసస్థితి గ్రహించ
రాజిత తార హారచ్ఛటల్ కలితస్త
నాగ్ర సంసరణి నృత్య గతి కదల
తే.గీ.
తండ్రి యానతి లేచిచెంతల నెలంత
లెచ్చరించగ జేరంగ నేగి యతని
దండ డగ్గరి తెలి జాజిదండ గేల
నెత్తి కంధర దగిలించ నేసెనంత
శత ఘంటావధాన మరింగంటి సింగరాచార్యులు రచించిన నిరోష్ఠ్య రామాయణం అని పిలిచే ‘దశరథరాజనందన చరిత్ర’ అని పేరు గల కావ్యం లోనిది ఈ పద్యం. ప వర్గంలోని ‘పఫబభమ’ అనే హల్లులు ఓష్ఠ్యములు. ఈ అక్షరాలు లేకుండా రాసిన కావ్యం దశరథరాజనందన చరిత్ర. ఇది తెలుగులో మొదటి నిరోష్ఠ్య గ్రంథంగా వినుతికెక్కింది. రాముడు జనక రాజాస్థానంలో శివుడి విల్లువిరిచిన సందర్భంలో రాముడి గళసీమలో సీతమ్మ పూలమాలను అలంకరించిన సన్నివేశంలో వచ్చిన పద్యమిది. సకల విధాలైన రత్నాలు పొదిగిన అలంకారం కంటే అధికంగా ఆమె శరీరకాంతి రంజిల్లుతుందట.
మన్మథుని వింటిని బోలిన నేత్రాంచల కాంతితో ఆమె చెక్కిళ్ళు అతిశయిస్తున్నాయి. పాదాలనే పద్మముల పై పూసిన లాక్షారస స్పర్శచే ధాత్రి చిత్ర వర్ణ పూరితమైంది. ప్రకాశిస్తున్న తారలలాగా తళుకులీను హారాలు ఆమె స్థనాగ్రంపై నృృత్య రీతిలో కదులుతున్నాయి (ఆమె నడక అలా ఉందని శ్లేష). అదే సమయంలో తండ్రి ఆజ్ఞతో లేచి నిలబడింది. చెంతనే ఉన్న చెలికత్తెలు జాగ్రత్తలు చెబుతున్నారు. ఆ అతిశయించిన అందాలతో మెల్లగా నడుస్తూ వెళ్లి రాముని కంఠసీమను తెలి జాజిదండతో అలంకరించింది. మనోహరమైన సీత మనోభావాలకు అనుగుణంగా సిగ్గుతో కంపిస్తున్న పులకిత గాత్ర సోయగాలను రమణీయంగా వర్ణించిన ఒక దృశ్యమాన సందర్భం ఈ పద్యం.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ