తెలంగాణ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను సమగ్రంగా పరిచయం చేసే విలువైన గ్రంథంగా ఈ పుస్తకం నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా 32 గిరిజన తెగలు ఉన్నప్పటికీ, ఇక్కడ తరతరాలుగా నివసిస్తున్న ప్రధాన పదిపదకొండు తెగల జీవన విధానం, వారి ఆచారాలు, విశ్వాసాలు, ముఖ్యంగా వారు నిర్వహించే జాతరల విశేషాలను రచయిత ఇందులో సమగ్రంగా వివరించారు. దశాబ్దాలుగా గిరిజన సంస్కృతిపై పరిశోధన చేస్తున్న రచయిత స్వయంగా అనేక జాతరల్లో ప్రత్యక్షంగా పాల్గొని సేకరించిన సమాచారంతో ఈ గ్రంథాన్ని రూపొందించారు. దీనివల్ల ఇది విశ్వసనీయతతో కూడిన సప్రామాణిక రచనగా నిలుస్తుంది అని చెప్పవచ్చు.
ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్కసారలమ్మ జాతర, నాగోబా, జంగుబాయి జాతర వంటి ప్రముఖ గిరిజన ఆధ్యాత్మిక కేంద్రాలను ఈ పుస్తకంలో విశదంగా పరిచయం చేశారు రచయిత డాక్టర్ ద్వావనపల్లి సత్యనారాయణ. గిరిజన సంస్కృతి పట్ల ఆసక్తి కలిగిన పాఠకులు, పరిశోధకులు, పర్యాటకులు, భక్తులకు ఈ గ్రంథం ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. తెలంగాణ గిరిజన జాతరల వైభవాన్ని సమగ్రంగా ప్రతిబింబించిన ఈ పుస్తకం ప్రజలకు అందుబాటులోకి రావడం ముదావహం.
రచయిత: డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ
ప్రచురణ సంస్థ: దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్,
పేజీలు: 176, ధర రూ.200
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్లైన్లో అందుబాటులో ఉంది.