Dasarathi |అది 1944వ సంవత్సరం. ఓరుగల్లు కోటలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. సాహిత్య గిరిశిఖరం సురవరం ప్రతాపరెడ్డి గారు అధ్యక్షుడు. చక్కని పందిళ్లు వేశారు, ఎందరెందరో సాహితీవేత్తలు తరలివచ్చారు.ఆ సభలపై నిజాం సర్కారు కన్నెర్ర చేసింది. కత్తులూ కటార్లు కాదు, కలాలను ధరించిన కవులను చూసి గడగడ వణికిపోయింది. ఉక్రోషంతో చెలరేగిన రజాకార్లు పందిళ్లను తగులబెట్టారు. కవి సమ్మేళనం ప్రారంభిద్దామనే సరికి అగ్నిజ్వాలలు, భస్మరాశులు. ఏమైనా సరే కవి సమ్మేళనం జరిపి తీరవలసిందే అని నిశ్చయించుకున్నారు సురవరం ప్రతాపరెడ్డి. పొట్టివాడైనా గట్టివాడిగా కనిపిస్తున్న ఒక యువకవి ‘లడేంగే ఔర్ మరేంగే’ అని ముందుకు ఉరికాడు. జ్వాలల్లో ఆహుతి అయిపోతాం గాని, కవి సమ్మేళనం జరిపితీరుతాం. ఇక శాంతించేది లేదు అన్నాడు.
ఓ పరాధీన మానవా! ఓపరాని
దాస్యము, విదల్చలేని శాంతము మాని
తలుపులను ముష్టిబంధానకలచివైచి
చొచ్చుకొని పొమ్ము స్వాతంత్య్ర సురపురమ్ము
కాలిపోయిన పందిళ్ల బూడిద వేడిగా అరికాళ్లకు తగులుతూ ఉండగా నిర్భయంగా, విప్లవ శంఖారావంలా పద్యాలు చదువుడు ప్రారంభించిండు. స్వాతంత్య్ర సురపురానికి బాటలు తీస్తున్న ఆ యువకవిని అమాంతం కౌగిలించుకున్నారు సురవరం. మెడలో పుష్పహారం వేశారు. ఆనందబాష్పాలు కదులుతుండగా ఆ యువకవి భుజాలపై చేతులు వేసి నొక్కుతూ ‘సింహగర్జన చేశావు నాయనా’ అన్నారు.
అగ్నిధార అయి వర్షించిన ఆ యువ కవి కంఠీరవం పేరు దాశరథి.
***
తెలంగాణ విప్లవ శరధిలో ఎగిసిపడిన కవిత్వ తరంగం దాశరథి. సంక్షోభ సందర్భాన్ని ధిక్కరించిన కల్లోల కాల గీతికలతో, దేశీ కవితకు ఉర్దూ, పారశీకపు మనోహర భావనలు అద్దిన రసవద్వీచికలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన భావుకుడు, పండితుడు, విప్లవకారుడు, అనువాదకుడు, ఆకాశవాణి ప్రయోక్త, విఖ్యాత సినీ గీత రచయిత దాశరథి.

తెలంగాణను ఆత్మలో ప్రతిష్ఠించుకున్న అరుదైన కవి. ఆయన కవిత్వంలో తెలంగాణ అస్తిత్వం పురివిప్పి నర్తించింది. నిజాం పరిపాలనలో కళపెళ ఉడికిన కాలానికి అక్షరానువాదమై నిలిచింది ఆయన కవిత్వం. జైలు గోడల మీద బొగ్గుముక్కతో ఆయన రాసిన ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అజరామరమై నేటికీ స్ఫూర్తినందిస్తున్నది. తెలంగాణ ప్రజల తలపుల్లో జ్వలిస్తూనే ఉన్నది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి సైతం మకుటాయమానంగా నిలిచి ప్రేరణనిచ్చింది. దాశరథి శత జయంతి ఉత్సవాలను ప్రారంభించుకుంటున్న వేళలో.. ఆయన సమున్నత సాహిత్య జీవన ప్రస్థానాన్ని సముజ్వలంగా స్మరించుకోవాలి. ఆయన చూపిన దారిలో అన్నార్తులు అనాథలుండని నవయుగాన్ని నిర్మించుకోవాలి..
దాశరథి పూర్తిపేరు దాశరథి కృష్ణమాచార్య. అయితే, దాశరథి అనే ఇంటిపేరుతోనే ఆయన ప్రసిద్ధుడు. 1925 జూలై 22న, ఆనాటి వరంగల్ జిల్లా… ఇప్పటి మహబూబాబాద్ జిల్లాలోని చినగూడూరు గ్రామంలో జన్మించారు. ‘నా బాల్యం నుంచే ఇంటా బయటా మా మాతృభాష మీద దండయాత్రలు జరిగాయి’ అని ఆయన చెప్పుకొన్నారు. నాటి నిజాం ప్రభుత్వం ఉర్దూను బోధన భాషగా నిర్ణయించింది.. ఇక ఇంట్లో దాశరథి వాళ్ల నాన్నగారు సంస్కృత భాషాధిక్యాన్ని గురించి చెబుతుండేవారు. స్నానం చేసి మడి కట్టుకుంటే సంస్కృతంలోనే మాట్లాడేవారు. తెలుగులో మాట్లాడితే మైలపడిపోతానేమో అని భయపడే ఛాందసుడాయన. అయితే, దాశరథికి సంస్కృతం మీద గౌరవమే కాని, తండ్రి ఛాందసం నచ్చేది కాదు. అలా దాశరథిలో బాల్యం నుంచే ధిక్కారం మొగ్గ తొడిగింది.

తెలుగును నేర్చుకోవటం ఆయన చేసిన తొలి ధిక్కారం. తల్లి వేంకటమ్మ దగ్గర తెలుగు కావ్యాలతో పాటూ హృదయ సౌకుమార్యాన్ని, తండ్రి నుంచి పాండితీ లక్షణాన్నీ పుణికిపుచ్చుకున్నారు. చినగూడూరు ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి పూర్తిచేశారు. ఆ తరువాత చదువు నిమిత్తం ఖమ్మం వెళ్లాల్సి వచ్చింది. మాధ్యమికోన్నత విద్యాభ్యాసం అక్కడి ఉస్మానియా హైస్కూల్లో జరిగింది. ఆ పాఠశాలలోనే డి.రామలింగం, ఎం.ఎల్.నరసింహారావు, హీరాలాల్ మోరియా మొదలైనవారు దాశరథికి మిత్రులయ్యారు. స్వాభిమాన సంపన్నుడైన దాశరథి దారిద్య్ర బాధలకు ఖిన్నుడైపోలేదు. ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచీ తోటి విద్యార్థులకు ఆంగ్ల వ్యాకరణం, ఉర్దూ ట్యూషన్ చెప్పి ఆ డబ్బులతో అవసరాలు గడుపుకొనేవారు.
తా అబద్బాలిఖే ఆలంయే రియాసత్ రఖ్ఖేతుజ్ కో ఉస్మాన్ బసాద్ ఇజ్లాల్సలామత్ రఖ్ఖే ప్రపంచ సృష్టికర్త ప్రళయం వరకూ ఈ రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచనీ/ ఓ ఉస్మాన్! నిన్ను నిండుదర్పంతో క్షేమంగా ఉంచనీ… అనే పల్లవితో సాగే ప్రార్థనా గీతం దాశరథికి నచ్చలేదు. అది ఆలపించలేక ప్రధానోపాద్యాయుడి చేత దెబ్బలు తిన్నడు. అయితే అతని ధిక్కారం రాజు మీదనే … ఉర్దూ భాష మీద ఆయనకు ద్వేషం లేదు. పైగా ఉర్దూ మనోహరత్వం మీద అనంతమైన వ్యామోహం. ఆర్య సామాజికుడైన కేశవార్య శాస్త్రి ఉపనిషత్ సూక్తులూ, బడిలో జక్కీసాబ్ చెప్పిన ఇక్బాల్ కవితలతో బాల దాశరథిలో విప్లవాగ్ని జ్వాల రగిలింది. ఏ నేలలో ఉదయించిన కవి ఆ నేల స్వభావాన్ని ప్రతిఫలించటం సహజమే కదా!
***
బ్రాహ్మణేతరుడైన కేశవయ్య వేదాధ్యయనం చేసి కేశవార్య శాస్త్రిగా మారేలా చేసింది ఆర్యసమాజం. ఐతరేయోపనిషత్తులోని ‘అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్’ అనే సూక్తికి ఆయన చెప్పిన అర్థం బాల దాశరథిని ప్రభావితం చేసింది. ‘భగవంతుని నోటిలోనికి అగ్ని ఎట్ల ప్రవేశించింది’? కాలదా?’ దాశరథి అమాయక ప్రశ్న. ‘శబ్దం రూపంలో ప్రవేశిస్తుంది కనుక కాలదు, పైగా ఇతరుల గుండెల్లోని అజ్ఞానాన్ని కాలుస్తుందని కేశవార్య శాస్త్రి చెప్పిన సమాధానం, దాశరథిలో ఆనాడే అగ్నిబీజాన్ని నాటింది, ఆ బీజమే భవిష్యత్తులో ‘అగ్నిధార’గా మారింది.

ఇక మదర్సాకు పోతే జనాబ్ జక్కీ సాహెబ్ చెప్పిన అల్లామా ఇక్బాల్ కవితలు దాశరథిలోని అగ్నిని విప్లవాగ్నిగా మార్చివేశాయి. జిస్ఖేత్సే దహ్ఖాకుమయస్సర్నహీరోజీ/ ఉస్ ఖేత్ కె హర్ఖూషయెగందుంకుజలాదో… ఏ పొలమున నిరుపేదకు తిండి దొరకదో/ ఆ పొలమునగల పంటను కాల్చేయండి.. అనే పంక్తులలోని భావం దాశరథి హృదయం మీద ప్రగాఢ ప్రభావం చూపింది. అది ఆజీవ పర్యంతం వెన్నాడింది. బహుశా బాల్యంలోని ఆ ప్రేరణలోంచే అగ్నిధారలోని ఈ చారిత్రక పద్యం ఉద్భవించిందేమో!?
ప్రాణములొడ్డి, ఘోర గహనాటవులన్
బడగొట్టి, మంచి మా
గాణములన్ సృజించి, ఎముకల్ నుసిచేసి,
పొలాలదున్ని, భో
షాణములన్ నవాబునకు స్వర్ణము
నింపిన రైతుదే; తెలం
గాణము రైతుదే; ముసలినక్కకు
రాచరికంబు దక్కునే
దేశం అంటే మనుషులని గురజాడ అంటే, రైతుల నెత్తురు చెమటలతోనే రాచరిక వైభోగాలనీ, కనుక దేశం రైతుదేననీ దాశరథి ప్రకటించారు.
1930-40 దశకాలలో తెలంగాణ భూస్వామ్య సమాజంలో ఒక కొత్త వెల్లువ పెల్లుబుకింది. ఒక నూతన పరివర్తన రూపుదిద్దుకున్నది. గ్రంథాలయోద్యమం, ఆర్యసమాజ స్థాపన, ఆంధ్ర మహాసభ ఆవిర్భావం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు, కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం… ఇలా తెలంగాణలో అనేక దారులు విచ్చుకున్నాయి. భిన్న భావాలు ఘర్షించుకున్నాయి. స్వాతంత్య్రోద్యమం, సంఘ సంస్కరణోద్యమం, సాహిత్యోద్యమం కలిసి ప్రవహించాయి. ప్రముఖ విశ్లేషకులు పి.వేణుగోపాలస్వామి చెప్పినట్టు తెలంగాణలో ఉద్యమానికీ, సాహితీ వ్యాసంగానికీ తేడా ఉండదు. చరిత్ర రచయితలపై ఉద్యమ బాధ్యతను కూడా పెట్టింది. వారిని నిజమైన కవులుగా నిలబెట్టింది. కాళోజీ, దాశరథి, వట్టికోట లాంటివారంతా సాహితీవేత్తలు మాత్రమే కాదు. ఉద్యమకారులుగా పోరాడారు. అంతే తప్ప ఉద్యమం బయట ఉండి ఊగిపోలేదని అంటారు. అలా ఒక సంక్షోభ కాలంలో, ఒక నూతన యుగారంభంలో చిచ్చర పిడుగై తలెత్తినాడు దాశరథి.

1942లో కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన సెల్ సమావేశాలకు దాశరథి హాజరయ్యారు. గార్ల, గొల్లగూడెం, కారుముంతల జాగీర్దారీ వ్యతిరేక రైతాంగ పోరాటాలలో ప్రముఖ పాత్ర పోషించారు. 1946లో కమ్యూనిస్టు పార్టీ ఆరంభించిన సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. దాశరథిలోని నిప్పు దావానలమై తిరుగుబాటు లేపుతుందని భయపడిన అధికారులు ఆయనపై అమానుష హత్యా ప్రయత్నాలకు తెగబడ్డారు.
గూడూరులో తాతగారి ఇంట భోజనం చేస్తుండగా పోలీసులు గిరఫ్తార్ అన్నారు. నెల్లికుదురు తీసుకుపోయారు. అయితే, దాశరథి జైలులో బావర్చీని మచ్చిక చేసుకొని తప్పించుకున్నారు. నిజాం సైనికులు తరుముతుండగా పొలాలలో, అరణ్యాలలో, నదులలో పడి పరుగెత్తారు.
ఆ విప్లవ ఝంఝామారుతంలో ఇక్బాల్ కవిత ఆయనకు వజ్రాయుధంలా తోడ్పడింది.
కారాగారంలో కవిత్వం
ఇది నిదాఘము; ఇందు సహింపరాని
వేడి ఏడ్పించుచున్నది; పాడుపడిన
గోడలందున జైలులో పాడినాడ
వాడిపోనున్న పూమొగ్గపై పాట
తెలుగుదేశంలో ఆనాటికి ఏ కవీ ఎదుర్కోని, ఎదుర్కొనడానికి ఇష్టపడని, సాహసించని చాలా దుర్భరమైన ప్రభుత్వ నిర్బంధాన్ని దాశరథి ఎదుర్కొన్నాడు. ఆ నిర్బంధం చాలు అతని కీర్తిని మొత్తం వెలిగించడానికని అంటారు ప్రసిద్ధ సాహిత్య విమర్శకులు కె.శ్రీనివాస్. ప్రజల తిరుగుబాటుపై దాశరథి ప్రభావాన్ని గమనించిన ప్రభుత్వం వరుసగా జైళ్లను మార్చింది. మొదట వరంగల్ సెంట్రల్ జైలు, నిజామాబాద్ జైలు, తర్వాత హైదరాబాద్ చంచల్ గూడా జైలుకు మార్చారు. పోలీసు చర్య తర్వాతే దాశరథి మొదలైన ఖైదీలకు విముక్తి లభించింది. వరంగల్ జైలులో జొన్నరొట్టెలలో సిమెంటు కలిపి ఇచ్చేవారు. అవి తిని ఎందరో అజీర్ణంతో మరణించారు. దాశరథి జీర్ణకోశం చెడిపోయింది, ఆ బాధ ఆయన్ను జీవితకాలం వేధించింది. జాతి క్షేమం కోసం జీవితం బలిచేసిన కవి ఆ జాతి తలపుల్లో సదా స్మరణీయుడు. కఠిన కారాగారంలో, చిత్రహింసల కొలిమిలో కడతేరుతూ, కవోష్ణ రుధిరధార లాంటి కవిత్వం సృష్టించారు దాశరథి. ఆ కవితా కరవాల ధారనే ఆయన తొలి కావ్యం ‘అగ్నిధార’…

ఆయాసపడు జైలులో యెన్ని ప్రజల రా
జ్యములున్నవో ! యని అరసినాను
నిరుపేదవాని నెత్తురు చుక్కలో నెన్ని
విప్లవాలో! యని వెదకినాను..
జైలులో ప్రజారాజ్యం కోసం అన్వేషించటం, నిరుపేద నెత్తురు చుక్కల్లో విప్లవాలను దర్శించటం విరుద్ధ శక్తుల ఘర్షణలో జనించే చలనాన్ని, జ్వలనాన్ని, పురోగమనాన్ని అద్భుతంగా వ్యక్తీకరించారు దాశరథి. కాలమనే దైవజ్ఞుడు, జగత్తు అనే కన్య అరచేతి రేఖలు చూసి చూసి, ‘ప్రజలను హింసించే వాళ్లు బాగుపడు మాట వట్టిదని నశించి తీరతారని జోస్యం చెప్పాడట….. ‘జైలులో’ అనే శీర్షికతో రాసిన ఈ పద్య కవిత ఉత్కృష్ట భావుకతతో ప్రారంభమై ముగింపులో ఉదాత్త తాత్విక స్థాయికి చేరుకుంటుంది.
‘ఏడు వందల మందికి ఒక్కటే పంపు/ ఎట్లాభరించేది ఈ పాడుకంపు…’ అంటూ ఒక గేయం పాడుతూ వట్టికోట ఆళ్వారు స్వామి జైలులోని నీళ్ల పంపు దగ్గరికి వచ్చాడు. అక్కడే అగ్నిధార, అశ్రుధార ఆలింగనం చేసుకున్నాయి.
ఆళ్వారుస్వామిది ఆజానుబాహు విగ్రహం. పచ్చని దేహచ్ఛాయ. చిన్నచెడ్డీ, చాలీచాలని గీట్ల అంగీ, నెత్తిన చిన్నటోపీ.. హత్యలు చేసి శిక్షలు పొందిన వారికిచ్చే దుస్తులు ఆయనకిచ్చారట. ఆయనకు కవులంటే ముఖ్యంగా దాశరథి అంటే ఎక్కడలేని అభిమానం.
ఒకనాడు పళ్లు తోముకోవడానికి ఇచ్చిన బొగ్గుముక్కతో జైలుగోడ మీద శక్తిమంతమైన పద్యం ఒకటి రాశారు దాశరథి. బోనులో ఉన్నా సింహం గర్జించటం మానదు కదా!
ఓ నిజాము పిశాచమా ! కానరాడు
నిన్నుబోలిన రాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటిరత్నాల వీణ
అధికారులు కన్నెర్ర చేశారు. మలిపేశారు. కానీ పద్యం గోడల మీద మళ్లామళ్లా ప్రత్యక్షం అవుతూనే ఉన్నది. ఆఖరికి ఆళ్వారుస్వామీ రాస్తున్నాడని కనిపెట్టేశారు. చిత్రహింసలకు గురి చేశారు. దాశరథిని చంచల్గూడా జైలుకు, ఆళ్వారుస్వామిని గుల్బర్గా జైలుకు మార్చేసరికి ఆ ఇద్దరి మూడునెలల జైలు సావాసం ముగిసింది.

అసలు ఆళ్వార్లు పన్నెండు మందే/పదమూడో ఆళ్వార్ మా వట్టికోట ఆళ్వారుస్వామి/అంటూ గొప్ప ఎలిజీ రాశారు దాశరథి. అకాల మృత్యువు పాలైన ఆళ్వారుస్వామికి, దాశరథి తన తొలికావ్యం అగ్నిధారను అంకితం చేశారు.
***
దాశరథి పద్యంలో ఒక అద్భుతమైన వేగం ఉంటుంది. జలపాతపు హోరుతో, జవనాశ్వపు జోరుతో భావోద్వేగ భరితమైన దాశరథి కవిత ప్రవాహధార చదివేవారిని, వినేవారిని సమ్మోహితుల్ని చేస్తుంది. సీసం, తేటగీతి, ఆటవెలది, కందం, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం… ఇలా ఛందస్సు చట్రం ఏదైనా ఆయన భావావేశాన్ని సమర్థంగా ప్రసరింపజేసే ఉష్ణ వాహకాలే అయ్యాయి తప్ప అవరోధాలు కాలేదు.
జెండా ఒక్కటె మూడు వన్నెలది
దేశం బొక్కటే భారతా ఖండాసేతుహిమాచలోర్వర
కవీత్కాండములోనన్ రవీంద్రుడొక్కడే కవీంద్రుడు
ఊర్జితజగద్యుద్ధాలలో శాంతి కోదండోద్విజయుండు
గాంధి ఒకడే ‘తల్లీ! మహా భారతీ’
అంటూ జాతీయతా భావన ముప్పిరిగొన్న ఈ పద్యం ప్రచండ వేగాన్ని, జలపాతపు హోరును తలపిస్తుంది. దాశరథి చేసే సమాస కల్పన శ్రీనాథ మహాకవిని తలపిస్తుందని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి.నారాయణ రెడ్డి ప్రశంసించారు. దాశరథిని తనకు మార్గదర్శిగా చెప్పుకొన్నారు సినారె. తన తరుణ కవితా లత పైకి ఎగబాకలేనప్పుడు మించు పందిళ్లు వైచి, కెంజాయలద్దినాడని మురిపెంగా చెప్పుకొన్నారు.
దాశరథి పద్యం ఎంత తీవ్రంగా ఉంటుందో అంత ఆర్ద్రంగానూ ఉంటుంది. తన రుద్రవీణ కావ్య ప్రయోజనాన్ని ఈ పద్యంలో కరుణరసార్ద్రంగా పలికించారు దాశరథి
చింతలతోపులో కురియు
చిన్కులకున్తడిముద్దయైన బా
లెంతయొడిన్ శయించు పసి
రెక్కల మొగ్గను వోనిబిడ్డకున్
బొంతలు లేవు కప్పుటకు
బొంది హిమంబయిపోవునేమొ వా
యింతునురుద్రవీణపయి
నించుక వెచ్చని అగ్ని గీతముల్…
అది చింతల తోపు, ఆపై వాన చినుకులు. తడిముద్ద అయిన బాలింత ఒడిలోని రెక్కల మొగ్గ వంటి పసి బిడ్డ దేహం మంచు వలె గడ్డకట్టుకుపోతుందేమో, రుద్రవీణపై ఒకింత వెచ్చని అగ్నిగీతాలను వాయిస్తానని అంటున్నారు..
భారత సైన్యం రాకతో నిజాం రాచరికం ముగిసిపోయింది. ఈ సందర్భాన్ని ప్రకృతికి అన్వయిస్తూ రాజకీయ అర్థాన్నీ ధ్వనింపజేశారు.
ఉషస్సు కిర్మీర కవాటం తోస్తూ
ఒక్కమాటు చూసిందిటు
తమస్సు పాషాణ కిరీటం తీస్తూ
ఒక్క పరుగు తీసిందటు
దాశరథి అభ్యుదయ దృక్పథంతో చేసిన రచనలలోని కవితా వాక్యాలెన్నో ప్రసిద్ధిచెందాయి. ‘నా గీతావళి ఎంత దూరము ప్రయాణంబౌనో; అందాక ఈ భూగోళమ్మున అగ్గి వెట్టెదను’- నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి, – ‘అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం, అనాథుడికీ, ఆగర్భ శ్రీనాథుడికీ మధ్య’- వంటి వాక్యాలెన్నో చిరస్థాయిగా నిలిచిపోయినాయి.
మనోహరమైన ఊహలతో, మంజులమైన శబ్దాలతో దాశరథి రాసిన లలిత గీతాలు ఎన్నో. రేడియో ముఖంగా ప్రసారమైన ఆ పాటలు ఇప్పటికీ మన తలపుల్లో నిలిచిమాధుర్యాన్ని పంచుతున్నాయి. ఘంటసాల గొంతులో జాలువారిన ‘తలనిండ పూదండ దాల్చిన రాణీ మొలక నవ్వుల తోడ మురిపించబోకే’ అనే ప్రణయగీతం మన చెవుల్లో ఇప్పటికీ మార్మోగుతూ ఉంటుంది. అదిగో నల్లని మెయిలూ, అదిగో చల్లని మెయిలూ, గగనేందిర గళమందున కలువపూల హొయలూ హొయలూ… ఈ పాట చిత్తరంజన్ మెత్తని గొంతుతో నేర్పిస్తుంటే సంగీత విద్యార్థులు పాడుతుంటే వినటం ఎంతో హాయి గొలిపేది. దాశరథి అద్భుతమైన బాలసాహిత్యాన్ని సృజించాడు. ‘తల్లీ భారతి వందనం నీ ఇల్లే మా నందనం’ అని పిల్లల కోసం రాసిన దేశభక్తి గీతం బడుల్లో ప్రార్థనా గీతంగా పాడుకున్నం.

కవిత్వ కళలో అసమానమైన ప్రతిభా సంపన్నుడైన దాశరథి నిజజీవితంలో లౌక్యం తెలియని భోళాశంకరుడు. ఆయనకు రావాల్సినంత పేరు రాలేదు. అందుకు ఆయన తెలంగాణ తనమే కారణం. ఆయన నిరాడంబరంగా నిస్వార్థంగా బతికారు. దాశరథి మరణానంతరం ఆయన కుటుంబం పరిస్థితి అంతంత మాత్రమే. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాశరథి కుమారుడు లక్ష్మణ్‌కి టీశాట్‌లో ఉద్యోగం కల్పించారు. ఉద్యోగంలో కొనసాగి వయసురీత్యా ఇటీవలే ఆయన రిటైర్ అయ్యారు. కేసీఆర్ స్వయంగా పూనుకొని ప్రభుత్వ పక్షాన లక్ష రూపాయల అవార్డును దాశరథి స్మరణలో నెలకొల్పారు. 2015 నుంచి ఏటా క్రమం తప్పకుండా ఆయన జయంతి సందర్భంలో ఈ అవార్డును అందించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని కొనసాగించాలనీ, కొనసాగిస్తుందని ఆశిద్దాం. ఈ సంవత్సరం శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతుందని కాంక్షిద్దాం.
దాశరథి రాసిన పాటల్లో ‘ఆ చల్లని సముద్రగర్భం/ దాచిన బడబానలమెంతో’ అనే పాట అత్యంత ప్రసిద్ధి చెందింది. చారిత్రిక భౌతికవాదానికి సమున్నత కవితా రూపం ఇచ్చిన శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’ కవితతో సరితూగే గీతమిది. అభ్యుదయ తాత్విక చింతనకు పతాక స్థాయిని ఇచ్చిన పాట ఇది. సముద్రంలో అలల్లాగా ఒక్కో చరణం ఎగిసిపడుతాయి. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అన్న ఆ ఒక్క వ్యక్తీకరణలో మానవ చరిత్ర పొడుగునా పేరు నోచని అజ్ఞాత త్యాగాలెన్నో కదా అని స్ఫురించి హృదయం ద్రవీభూతమై పోతుంది. ‘పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో’ అనే అద్భుతమైన కవితా వాక్యాలు ఈ గేయభావాన్ని అత్యున్నత స్థాయికి చేరుస్తాయి. సార్వజనీనం, సార్వకాలికమైన మానవ దుఃఖాన్ని అనుభూతింప చేస్తాయి. కాలగతిలో కవి వ్యక్తం చేయలేకపోయిన మానవ జీవన సంవేదన మనల్ని ఆవహిస్తుంది.
ఇలా మరెన్నో…
నా పాతమిత్రులు ఎవరో తెలుసా గాలిబూ కాళిదాసు నా కొత్తమిత్రులు నజ్రులిస్లాం, టాగోర్మంచి కవిత్వం ఏ భాషలోఉంటే అది నా భాష మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడు
అని ప్రకటించిన దాశరథి తెలంగాణ సంపద్వంత సాహిత్య సంస్కృతికి నిలువెత్తు ప్రతీక. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, ఆలోచనా లోచనాలు, తిమిరంతో సమరం తదితర కావ్యాలతో తెలుగు సాహిత్యానికి, ఉర్దూ రచనలూ, అనువాదాలతో ఉర్దూ సాహిత్య వికాసానికి దాశరథి ఎనలేని సేవ చేశారు. తెలుగులో తొలిసారిగా స్వతంత్రమైన గజళ్లను రచించి గజల్ ప్రక్రియను పండించిన ఘనత కూడా దాశరథిదే. ఆయన కలానికి పరుసవేదికి ఉన్న శక్తి ఉంది. పద్యం, గేయం, వచన కవిత, గజల్, రుబాయీ అన్ని ప్రక్రియలలోనూ ఆయన శక్తిమంతమైన కవిత్వం సృష్టించారు. దాశరథి కవిత్వ భాష వెనుక సంస్కృత పాండితీ గరిమ, పారశీక ఉర్దూ కవిత్వ ప్రభావం వలన వచ్చిన ఎనలేని భావుకత, శబ్ద సౌందర్య స్పృహ ఉన్నాయి. ఇవన్నీ అన్వయించి – ఈ నేపథ్యం నుంచి ఆయన కవిత్వాన్ని ఎలా విశ్లేషించాలో నేర్చుకోవాల్సి ఉంటుందని అన్నారు ఆచార్య రవ్వా శ్రీహరి.
భారతదేశానికి గాలిబ్ కవిత, తాజ్ మహల్ మరువలేని అందాలని అంటారు దాశరథి. జక్కీసాబ్ పాఠాల ప్రభావంతో చిన్నప్పటి నుంచే మీర్జా గాలిబ్ కవిత్వంపై దాశరథి ఇష్టం పెంచుకున్నారు. అనువదించాలని అనుకున్నారు. పెద్దయ్యాక తెలుగువారికి గాలిబ్ కవిత్వాన్ని పరిచయం చేసి ఆ కోరికను నెరవేర్చుకున్నారు. దాశరథి అనువాద పటిమను చూసి ముచ్చటపడిన దేవులపల్లి రామానుజరావు… దుర్లభుడనుకున్న గాలిబ్‌ను, దాశరథి సులభుణ్ని చేశారని చమత్కరించారు. క్లిష్టతరమైన గజల్ ప్రక్రియను అచ్చమైన తెలుగు భావనలతో, వ్యక్తీకరణలతో తొలిసారిగా అనితర సాధ్యంగా తెలుగు సాహిత్యంలో ఆవిష్కరించినదీ దాశరథియే.
మొట్టమొదటి సారిగా తెలంగాణ తల్లి భావనను తెలుగు సాహిత్యంలో కవన కమనీయంగా సాక్షాత్కరింపజేసిన కవికుమారుడు దాశరథి.
కోటి తెలుగుల బంగారు కొండ క్రింద
పరుచుకున్నట్టిసరసు లోపల వసించి
పొద్దుపొద్దున అందాల పూలు పూయు
నా తెలంగాణ తల్లి కంజాతవల్లి
ఎంత మనోహరమైన పద్యం. ఇంకా ‘నా తెలంగాణలేమ సౌందర్య సీమ, నా తెలంగాణ కోటి అందాల జాణ’ అని పరిపరి విధాల సంభోదిస్తూ, సంభావిస్తూ ఉప్పొంగిపోయారు. భౌగోళిక వైశిష్ట్యం, చారిత్రక ప్రాశస్త్యం, సాహిత్య ఔన్నత్యం, పోరాట తత్వం ఒకటేమిటి విభిన్న కోణాలలో తెలంగాణ అస్తిత్వాన్ని ఆకాశానికెత్తిన కవి, దాశరథి వలె ఇంకొకరు లేరంటే అతిశయోక్తి లేదు. విశాలాంధ్ర ఏర్పాటు కోరుకుంటూ దాశరథి ‘మహాంధ్రోదయం’ రచించారు.
అయితే, ఆ పద్యాలలోనూ తన తెలంగాణ వారసత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. విశాలాంధ్రకు సంబంధించిన ఒక ఉద్వేగం దాశరథిని ఆవరించింది. దేశ స్వాతంత్య్రం, విశాలాంధ్ర ఆవిర్భావం రెండూ గొప్ప ఆశయాలుగానే ఆయన భావించారు. ఆ ప్రతిపాదన వెనుక తెలంగాణకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనించలేని ప్రమత్తత ఒక్క దాశరథినే కాదు, ఆనాడు తెలంగాణలో అనేకమందిని ఆవరించిదన్న మాట కాదనలేం. అయితే, అస్తిత్వవాదానికి అది మాత్రమే కొలమానం కాదు. దాశరథి తెలంగాణతనాన్ని ఎట్లా ప్రకటించారు, తెలంగాణ తనాన్ని ఎట్లా వ్యక్తం చేశారన్నది ముఖ్యమని అంటారు కె.శ్రీనివాస్.
కార్మిక వర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదిగిన టి.అంజయ్య రూపాన్ని, భాషను ఒక ప్రధాన పత్రిక పనిగట్టుకొని అవహేళన చేసిన సమయంలో.. ‘అంజయ్య మాట్లాడిందే అసలయిన తెలుగ’ని దాశరథి స్పష్టం చేశారు. తెలుగు తల్లే తప్ప తెలంగాణ తల్లి ఎక్కడిదని సమైక్యవాదులు ప్రశ్నించినపుడు 1948 లోనే తెలుగు సాహిత్యంలో దాశరథి ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లిని మనం సగర్వంగా చూపించాం.
– దేశపతి శ్రీనివాస్