కవ్వించే మాటలు.. మత్తెక్కించే చూపులు.. ‘సింగిల్‌గా ఉన్నారా? అయితే, మింగిల్ అయిపోండి!’ అంటూ ప్రకటనలు. ఆన్లైన్లో వర్చువల్‌గా విహరించే వారికే ‘డేటింగ్’ పేరుతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పోయేదేముందిలే.. అని డేటింగ్ యాప్‌లను ఇన్స్టాల్ చేసేస్తున్నారు కొందరు. మాట కలుపుతున్నారు. కానీ, ఆ మాటలు, మెసేజ్‌ల వెనకున్న మాయాజాలాన్ని ఊహించడం లేదు. అదంతా ప్రేమే!? అనుకునే లోపే ఉచ్చు బిగుసుకుంటుంది. నేటి డిజిటల్ ప్రపంచంలో ఇప్పుడీ డేటింగ్ యాప్‌లు యువతతోపాటు నడివయసున్న వారికీ పెద్ద సమస్యగా మారిపోయాయి.
Online Dating | డేటింగ్ యాప్ కల్చర్ శరవేగంగా విస్తరిస్తున్నది. కొత్త వ్యక్తులను కలవడానికి, నయా సంబంధాలు నెలకొల్పడానికి అవకాశంగా భావించిన ఈ యాప్‌లు ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఆన్లైన్లో కొన్ని డేటింగ్ యాప్స్ విశృంఖలంగా విజృంభిస్తున్నాయి. నడి వయసులో ఉన్న మహిళలు, పురుషులనే టార్గెట్ చేస్తున్నారు ఫ్రాడ్స్టర్లు. ఒంటరిగా ఉన్నవారికి తుంటరి మెసేజ్‌లు పంపి ముగ్గులో దింపుతున్నారు. కొన్ని సర్వేలు చెబుతున్న ప్రకారం విడాకులు తీసుకున్నవాళ్లలో చాలామంది ఈ డేటింగ్ యాప్‌ల పట్ల ఆకర్షితులు అవుతున్నారట. మరోవైపు స్వలింగ సంపర్కం కోరుకునే వాళ్లు ఈ మోసగాళ్లకు ఇట్టే చిక్కిపోతున్నారు.
మనసుతో ఆడుకుంటారు దేశంలో టిండర్, బంబుల్, ఓకేక్యూపిడ్ లామౌర్, టాంటన్, హ్యాపన్, వూ డేటింగ్, మీట్విల్లే లాంటి డేటింగ్ యాప్‌లు చాలా పాపులర్. వీటికుండే ప్రత్యేకతల దృష్ట్యా చాలామంది ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే, కొందరు టైమ్‌పాస్ కోసం డేటింగ్ చేస్తుంటే, ఇంకొందరు మోసాలకు పాల్పడుతున్నారు. అన్ని యాప్‌లో మాదిరిగానే సరదాగా లాగిన్ అయి చూద్దాం అనుకోవద్దు. ఎందుకంటే డేటింగ్ యాప్‌లో ఓ జిమ్మిక్కు ఉంది. అందులో మీరు చేసే చాట్ ఆధారంగా మీ వ్యక్తిత్వాన్ని, అవసరాలను అవతలివాళ్లు గుర్తిస్తారు. మీరు ఏ తరహా ప్రేమ కోరుకుంటున్నారో గ్రహిస్తారు. మీ బలహీనతలు పసిగడతారు. మొత్తం ప్రొఫైల్ స్టడీ చేసిన తర్వాత డేటింగ్ దాడి మొదలవుతుంది. ఇలా ముగ్గులో దింపేవాళ్లు అయితే డబ్బు కోసం లేదంటే లైంగిక సంబంధం కోసం మోసాలకు పాల్పడుతుంటారు.
ప్రపోజల్ నుంచి బెదిరింపు వరకు: హాయ్ అంటూ స్టార్ట్ చేస్తారు. మాట కలుపుతారు. కొన్ని రోజులకే సన్నిహితంగా మాట్లాడేలా చేస్తారు. ఈ క్రమంలోనే వీడియో కాల్స్, చాట్స్ రికార్డ్ చేస్తారు. ఆపై ఆ వీడియోలను బూచిగా చూపించి డబ్బు డిమాండ్ చేస్తారు. అందమైన అమ్మాయి.. నిజానికి ఓ మగవాడు!: డేటింగ్ యాప్‌లో ఉండే చాలా ప్రొఫైల్స్ ఫొటోలు డమ్మీవే ఉంటాయి. అందమైన అమ్మాయి ఫొటోలు చాలా వరకూ ఫేకే. విషయం తెలియక స్వైప్ చేస్తే చాలు.. తియ్యగా చాట్ చేస్తూ ముగ్గులోకి లాగుతారు. సదరు చాట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తామనీ, మీ ఫ్రెండ్స్‌ను ట్యాగ్ చేస్తామని బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు.
స్వలింగ సంపర్కులే ఎక్కువ: దేశంలో స్వలింగ సంబంధాలు పెరుగుతున్నాయి. డేటింగ్ యాప్‌లలోనూ ఈ బలహీనతను వాడుకుంటున్నారు. స్వలింగ సంబంధాలు కోరుకునే వాళ్లను టార్గెట్ చేసి దగ్గరవుతారు. ఒక్కసారి సన్నిహితంగా దగ్గరయ్యాక.. బెదిరించి డబ్బు దోచుకుంటారు. కొన్నిసార్లు హింస, అత్యాచారం లాంటి భయంకరమైన సంఘటనలు కూడా జరుగుతున్నాయి.
చాట్ బాట్లు, ఫేక్ చాట్లు: డేటింగ్ యాప్ డౌన్లోడ్ చేయగానే.. చకాచకా మెసేజ్‌లు వచ్చేస్తుంటాయి. అందులోనూ అవి అమ్మాయిల నుంచి టెక్ట్స్, వాయిస్, వీడియో మెసేజ్‌లు ఉంటే.. ఇక చెప్పేదేముంటుంది. ఫుల్ చిల్ అవ్వొచ్చని ఎంతదూరమైనా వెళ్తారు. వాటికి రిైప్లె చేయాలంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ కొనాలి. ఒకసారి డబ్బు కట్టినా.. మళ్లీ ప్రీమియం పేరుతో డబ్బులు అడుగుతూనే ఉంటారు. ఇంతకీ విషయం ఏంటంటే.. అటువైపు నుంచి మాట్లాడేది అమ్మాయిలు కాదు… చాట్ బాట్లు. లేదంటే ట్రైన్డ్ పీపుల్. వాళ్లు మీతో ఎక్కువ సమయం మాట్లాడి ఎక్కువ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తారు.
అన్లైన్ డేటింగ్ మోసానికి గురైతే, వెంటనే రిపోర్ట్ చేయడం ముఖ్యం. https://cybercrime.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లి ఫోన్ నంబర్ OTP ద్వారా రిజిస్టర్ చేయాలి. తర్వాత కేటగిరీ ఎంచుకోవాలి. ‘మహిళలు లేదా పిల్లలకు సంబంధించిన క్రైమ్ రిపోర్ట్’ అనే కేటగిరీ ఎంచుకోవాలి. సాక్ష్యాలు అప్లోడ్ చేయాలి. చాట్ స్క్రీన్షాట్లు, సోషల్ మీడియా చానల్స్ URLలు కాపీ చేయాలి. డబ్బు లావాదేవీల స్క్రీన్షాట్లు లేదా స్టేట్మెంట్స్ కూడా జత చేయాలి. అన్ని వివరాలు సరిగ్గా ఇచ్చి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఆన్లైన్ డేటింగ్ చేయాలనుకుంటే.. ముందు అవతలి వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే డేటింగ్ వైపు అడుగులు వేయాలి.
-అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్