తండ్రి : రామ్, నేనంటే ఎందుకు ఇష్టం నీకు.. కొడుకు : ఎందుకంటే నువ్వు నాన్నవు కదా.. ఈ మధ్య వచ్చిన ‘అనగనగా’ మూవీలో ఓ సన్నివేశం ఇది. నాన్నను ఇష్టపడటానికి, ప్రేమించడానికి కారణాలేమీ అక్కర్లేదు, జస్ట్ నాన్న అయితే చాలు. కూతురైనా, కొడుకు అయినా వారి జీవితాలపై నాన్న వేసే ముద్ర చాలా బలమైనది. బుడిబుడి అడుగుల నుంచి బాస్ అయ్యే వరకు నాన్న నడిపిస్తూనే ఉంటాడు. స్నేహంలోనూ, పనితీరులోనూ, జీవితంలోనే ప్రతి మలుపులోనూ నాన్న ప్రభావం ఉంటుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
అనగనగా ఓ రాజు.. అంటూ కథలు వినేవాళ్లం, చదివేవాళ్లం కదా. అనగనగా ఓ నాన్న కథ.. అంటూ ప్రతి ఒక్కరూ వినాల్సిన, చదవాల్సిన అవసరం ఉంది. కొందరిలో కోపం అనే ఎమోషన్ ఉండకపోవచ్చు, ఆనందం అనే ఎమోషన్ ఉండకపోవచ్చు, దుఃఖం అనే ఎమోషన్ ఉండకపోవచ్చు. నాన్న.. అనే ఎమోషన్ మాత్రం అందరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏ దశలోనైనా నాన్న అంతర్లీనంగా ఉంటూనే ఉంటాడని, చిన్నప్పుడు నాన్నతో ఉన్న అనుబంధమే ముందుకు నడిపిస్తుందని సైకాలజీ చెబుతుంది. జీవిత భాగస్వామిని ఎలా చూసుకుంటారు, బిడ్డలను ఎలా చూసుకుంటారు, బాధ్యతలను ఎలా మోస్తారు, తనను తాను ఎలా చూసుకుంటారు అనేది నాన్నతో ఉన్న అనుబంధమే నిర్ణయిస్తుంది.
నాన్నతో ఉన్న అనుబంధం ఇతరులతో బంధాలను ఎలా ఏర్పరచుకోవాలో నేర్పుతుంది. తాను పిల్లలతో ఎలా వ్యవహరిస్తాడో, అలాగే పిల్లలు తమ బంధాల్లో ఉంటారు. నాన్న అమ్మతో ఎలా ఉంటున్నాడో గమనించి తాము కూడా సన్నిహిత సంబంధాల్లో అలాగే ఉంటారు. బాల్యంలో నాన్న ప్రేమ దూరమైన వారు బంధాలను కొనసాగించడంలో ఇబ్బందిపడతారని పరిశోధనలు వెల్లడించాయి.
కొడుకుల విషయంలో నాన్న ఓ నమూనా అయితే, కూతురు విషయంలో అన్నీ నాన్నే! మగవాళ్ల పట్ల దృక్పథాన్ని తీర్చిదిద్దేది నాన్నే. తండ్రితో ఉన్న అనుబంధమే భావి జీవితంలో మగవాళ్లతో ఎలా మెలగాలో నేర్పుతుంది. ఆడపిల్లల జీవిత భాగస్వామి ఎంపికలో కూడా నాన్న ప్రభావం ఉంటుంది. ఎక్కువమంది నాన్నను పోలిన లక్షణాలు ఉన్న వారినే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు.
మగ పిల్లలకు నాన్నే ఓ నమూనా. కుటుంబంలో ఎలా ఉండాలి, బరువు బాధ్యతలను ఎలా మోయాలి, ఇంటిని ఎలా తీర్చిదిద్దాలి అనే విషయాలు నాన్నను చూసే నేర్చుకుంటారు. వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవితంలోనూ నడక, నడత నాన్న నేర్పించేదే. నాన్న ప్రేమకు దూరమైన మగ పిల్లలు తమని తాము అసమర్థులుగా అంచనా వేసుకుంటారు. జీవితంలో ఏదో కోల్పోయిన భావనతో ఉంటారు. నాన్న లేని మగ పిల్లలు చుట్టూ ఉన్నవారిలో ఎవరో ఒకరిని నమూనాగా తీసుకుంటారు, వారినే అనుసరిస్తారు.
పిల్లల జీవితంలో నాన్న ఎంత ముఖ్యమో, నాన్న జీవితంలో పిల్లలు కూడా అంతే ముఖ్యం. నాన్నగా మారిన మగవారి మెదడులోనూ, హార్మోన్స్ లోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటాయని న్యూరో సైంటిస్టులు చెబుతున్నారు. అసలు మగవారి మెదడులో కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా పేరెంటింగ్ కోసమే నిర్దేశించి ఉంటాయని సైంటిస్టులు చెప్తున్నారు.
తండ్రి కాగానే మగవారిలో కొన్ని హార్మోన్ మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా ఆక్సిటోసిన్ అనే హార్మోన్ బిడ్డకు, నాన్నకు మధ్య బలమైన బంధం ఏర్పర్చడంలో దోహదపడుతుంది. మొదటిసారి నాన్న అయిన 160 మందిపై చేసిన పరిశోధనలో బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లిలోని ఆక్సిటోసిన్ పరిమాణానికి సమానంగా తండ్రిలోనూ ఉందని గుర్తించారు.
బిడ్డల ఆలనా పాలన చూసే సమయంలో తల్లిదండ్రుల ఇద్దరి మెదడులో ఒకే ప్రాంతాలు ఉత్తేజితం కావడం గమనించారు. బిడ్డ డుస్తున్నప్పుడు మెదడులో భావోద్వేగాలను నియంత్రించే ప్రాంతమైన అమీగడల ఉత్తేజతమవుతుందని పరిశోధనలో తెలిసింది.
బిడ్డను లాలించే సమయంలో తండ్రుల మెదడులో సామాజిక ప్రవర్తన, నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళికలు రూపొందించడంపై ప్రభావం చూపే ప్రీ ఫ్రొంటల్ కార్టెక్స్లోని న్యూరాన్స్లో చిన్నచిన్న మార్పులు రావడం గమనించారు.
పిల్లలతో బాగా మమేకమైన తండ్రుల్లో పురుష హార్మోన్ అయిన టెస్టిస్టోరోన్ స్థాయి తగ్గడం గమనించారు. అందుకే పిల్లలు పుట్టిన తర్వాత మగవారు కొంత సుకుమారంగా మారతారని తెలుస్తుంది.
మమ ప్రథమ గురు; ప్రత్యక్ష విఘ్నహర్త
పితృ ప్రీతిమాపనే; సర్వ ప్రియాతి దేవతా
ఇది ఓ సంస్కృత శ్లోకం. దీని అర్ధం ఏంటో తెలుసా? తండ్రి తొలి గురువు, అతనే రక్షకుడు, తండ్రిని సంతోషపెడితే దేవతలందరు సంతోషిస్తారు అని. నాన్న అంత గొప్పోడు మరి. విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే!!
పిల్లలకు అమ్మ దగ్గర ప్రేమ దొరికితే, నాన్న దగ్గర స్వేచ్ఛ దొరుకుతుంది. అమ్మ ప్రేమ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కాళ్లకు బంధనాలు వేస్తే, ప్రపంచాన్ని చదవమని ప్రోత్సహించేది నాన్న ప్రేమ. బాల్యంలో నాన్నతో బలమైన బంధం ఉన్న వారు జీవితంలో ప్రయోగాలు చేయడంలో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, వాటిని సరైన తీరులో వ్యక్తీకరించడం నాన్న నుంచే నేర్చుకుంటారు. నలుగురితో కలివిడిగా ఉండటం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంలోనూ నాన్న ప్రభావం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.