ఒకప్పుడు ఎవరినైనా.. ‘మీ ఫేవరేట్ హీరో లేదా హీరోయిన్ ఎవరు?’ అని అడిగేవాళ్లం. మరి, ఇప్పుడు? ‘మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు? ఇన్ఫ్లూయెన్సర్ పేరేంటి? డిజిటల్ క్రియేటర్ ఎవరు?’.. ఇలా అడుగుతున్నారు. ఎందుకంటే.. డిజిటల్ వరల్డ్‌కి నేటి తరం అంతలా కనెక్ట్ అయిపోయింది. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న కంటెంట్ ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తున్నది. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. వైరాలిటీ కోసం తెగ వెంపర్లాడుతున్నారు. ఈ క్రమంలో ‘కాన్ఫ్లిక్ట్-డ్రివెన్ వైరాలిటీ’పై నెట్టింట్లో పెద్ద డిబేట్ నడుస్తున్నది! గొడవల ద్వారా వచ్చే పాపులారిటీ అన్నమాట!!నే
టి డిజిటల్ ప్రపంచంలో ప్రస్తుతం ఓ వింతైన పరిస్థితి కనిపిస్తున్నది. ఓ యూట్యూబ్ చానెల్‌కు వ్యూస్ లక్షల్లో వస్తున్నాయి. కానీ, అదే సమయంలో సబ్‌స్ర్కైబర్లు వేలల్లో తగ్గిపోతున్నారు. అనేకమంది ప్రముఖ యూట్యూబర్ల విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతున్నది. దాదాపు మిలియన్ల కొద్దీ సబ్‌స్ర్కైబర్లు కాల్ ఆఫ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సాధారణంగా వ్యూస్ పెరిగితే సబ్‌స్ర్కైబర్లు పెరగాలి, కానీ ఓ పాపులర్ యూట్యూబర్ విషయంలో సీన్ రివర్స్ అయింది. ఇది కేవలం ఆ వ్యక్తికి సంబంధించిన విషయం కాదు… మన డిజిటల్ సంస్కృతిలో వస్తున్న ఒక ప్రమాదకరమైన మార్పునకు నిదర్శనం. అదే.. ‘కాన్ఫ్లిక్ట్-డ్రివెన్ వైరాలిటీ’. అసలు ఈ వ్యూస్ మాయాజాలం ఏంటి? నమ్మకానికి, వైరాలిటీకి ఉన్న తేడా ఏంటో చూద్దాం.
లాయల్టీ వర్సెస్ వైరాలిటీ
ఒకప్పుడు ఎవరైనా డిజిటల్ క్రియేటర్‌ను మనం ఫాలో అయ్యామంటే.. అది వారి వ్యక్తిత్వం, విలువలు లేదా వారు చెప్పే కథల మీద ఉన్న గౌరవం మీద ఆధారపడి ఉండేది. దీన్నే ‘లాయల్టీ-డ్రివెన్ ఎంగేజ్మెంట్’ అంటారు. ఇక్కడ సబ్‌స్ర్కైబర్ అంటే కేవలం నంబర్ కాదు, అదొక ‘నమ్మకం’. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. కోపం, అసహ్యం, అవమానం లేదా షాక్.. ఈ ఎమోషన్స్ ద్వారా క్రియేట్ చేసే కంటెంట్ చాలావేగంగా వైరల్ అవుతున్నది. ఇదే ‘కాన్ఫ్లిక్ట్-డ్రివెన్ వైరాలిటీ’! అంటే జనం మిమ్మల్ని ఇష్టపడి చూడటం లేదు.. మీరు చేసిన ఒక పని, అన్న మాట మీద కోపంతో చూస్తున్నారన్నమాట! ఇక్కడ వ్యూస్ వస్తాయి కానీ, గౌరవం రాదు!
కాసుల వేట
ప్రస్తుతం కొందరు క్రియేటర్లు ఇతరుల వ్యక్తిగత సమస్యలు, విషాదాలు లేదా అవమానాల చుట్టూ కంటెంట్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇతరుల బాధను ఎంటర్టైన్మెంట్గా మార్చడం అనేది ఒక డిజిటల్ దోపిడీ. నిజం కంటే వివాదానికి, గౌరవం కంటే అవమానానికి ఎక్కువ రేటు పలుకుతున్న ఈ వ్యవస్థలో.. విలువలు కలిగిన ఐడియాల కంటే విషపూరితమైన విమర్శలే వేగంగా ట్రెండ్ అవుతున్నాయి. దీనివల్ల సమాజానికి, ముఖ్యంగా విద్యార్థులకు చాలా ముప్పు ఉంది. ‘సహాయం చేస్తున్నాం’ అనే ముసుగులో తోటి విద్యార్థులను డిజిటల్ మీడియాలో అవమానించడం, బుల్లీయింగ్ చేయడం వంటివి పెరిగిపోతున్నాయి.
వ్యూస్ అంటే ‘వ్యాపారం’!
కోపంగా ఉన్న ఓ లక్ష మంది వ్యూవర్స్ కంటే.. నమ్మకమైన పదివేల మంది సబ్‌స్ర్కైబర్లు మిన్న. వ్యూస్ అనేవి లావాదేవీ లాంటివి. కానీ సబ్‌స్ర్కైబర్లు ఓ రిలేషన్ షిప్. నమ్మకమైన సబ్‌స్ర్కైబర్లు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు, మీతోనే ఉంటారు. అయితే, వివాదాల ద్వారా వచ్చే వ్యూస్ నీటి బుడగ లాంటివి. ఆ వివాదం సద్దుమణిగితే ఆ వ్యూస్ మాయమైపోతాయి, అప్పటికే మీ క్రెడిబిలిటీ (విశ్వసనీయత) గంగపాలు అవుతుంది. అందుకే ఈ డిజిటల్ కంటెంట్ వరల్డ్‌లో కొన్ని ముఖ్యమైన విషయాల్ని పక్కా ఫాలో అవ్వాలి. మనం ఎవరిని ఫాలో అవుతున్నాం? ఎవరికి వ్యూస్ ఇస్తున్నాం? అనేది కచ్చితంగా ఆలోచించుకోవాలి. ‘ఎవరు నన్ను రెచ్చగొడుతున్నారు?’ అనే కంటెంట్ కంటే ‘ఎవరిని నేను నమ్మగలను?’ అనే కంటెంట్ కు మనం ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే మన డిజిటల్ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.
ప్రేమతోనా.. కోపంతోనా..
హిందూ ధర్మంపై లేదా సంస్కృతిపై చేసిన కొన్ని అసంకల్పిత వ్యాఖ్యల వల్ల ఇటీవల ‘నా అన్వేషణ’ చానెల్ చుట్టూ వివాదం ముదిరింది. ఈ క్రమంలో సదరు చానెల్‌ను తిట్టడానికైనా సరే జనం వీడియోలు చూస్తున్నారు. ఫలితంగా వ్యూస్ పెరుగుతున్నాయి. కానీ, ఏండ్లుగా అతణ్ని ఫాలో అవుతున్న వాళ్లు మాత్రం సబ్‌స్ర్కైబ్ బటన్ తీసేస్తున్నారు. ఇప్పుడు అతని వీడియోలు చూస్తున్న వారిలో ఎక్కువ మంది.. కేవలం ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారు లేదా విమర్శించే వారు మాత్రమే. మరోవైపు యూట్యూబ్ అల్గారిథమ్‌కు అది ‘ప్రేమ’తో చూస్తున్నారా లేక ‘కోపం’తో చూస్తున్నారా అనేది తెలియదు. దానికి కావల్సింది క్లిక్స్, వాచ్ టైమ్ మాత్రమే. అందుకే వివాదాస్పద కంటెంట్‌ను అది మరింత ప్రమోట్ చేస్తుంది.
-అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్