ఒకప్పుడు ఇంటి గుట్టు ఈశ్వరుడికి కూడా తెలిసేది కాదు. అవతార పురుషుడైన రాముడికి కూడా రావణుడి ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవడానికి విభీషణుడి మాట సాయం అవసరమైంది. అప్పట్లో సమాచారం అంత పకడ్బందీగా ఉండేది. ఈ స్మార్ట్ యుగంలో వ్యక్తిగత సమాచారం సెకండ్ల వ్యవధిలో పరుల హస్తగతం అవుతున్నది. మన బంగారం మంచిదైతే.. అవతలి వారిని నిందించాల్సిన పనేముంది. అందుకే, స్మార్ట్‌ఫోన్ వినియోగంలో అత్యుత్సాహాన్ని వీడి, డేటా నిర్వహణపై అవగాహన పెంచుకున్నప్పుడే మీ డేటా సురక్షితంగా ఉంటుంది.
స్వీయ రక్షణ చర్యలు చేపట్టకుండా పొద్దస్తమానం ఆన్లైన్లో విహరిస్తే మన వ్యక్తిగత జీవితం అంగట్లో సరుకు కన్నా చౌకగా మారిపోతుంది. మన పేరు, ఊరు, చిరునామా, డెబిట్ కార్డు ఎక్స్పైరీ డేట్, క్రెడిట్ కార్డు పిన్ ఇలా దొరికనంత సమాచారం దోచుకునే దొంగలు ఆన్లైన్లో పొంచి ఉంటారు. అదెలా సాధ్యం అంటారా! ఉదాహరణకు గూగుల్‌లో ఎస్ఐపీ క్యాలిక్యులేటర్ సెర్చ్ చేశారే అనుకుందాం. ఆ సెర్చింగ్ పూర్తికాక ముందే మీపై హంటింగ్ మొదలవుతుంది. వరుసగా ఫోన్లు వస్తుంటాయి. ఫోన్ ఎత్తి హలో అని స్పందించకముందే.. ‘హలో! ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారా?’ అని బాదేస్తుంటారు. మన జీమెయిల్, ఫోన్ నెంబర్‌కు లింకై ఉన్న బ్రౌజర్ నుంచి సెర్చులు చేస్తే.. సమాచార చోరులు ఆ మాత్రం తెలుసుకోలేరా? స్మార్ట్ యుగం కల్పించిన సౌకర్యాలను వాడుకోవడం మనకు ప్రయోజనం చేకూర్చాలి. అంతేగానీ, మన వ్యక్తిగత సమాచారం లూటీ అయితే సమస్యే!
ఆన్లైన్లో విహరించడానికి ముందు లక్ష్మణ రేఖ గీసుకోవాలి. సాధారణ జీవితంలోనూ మనం చాలా విషయాల్లో గోప్యత పాటిస్తూ ఉంటాం. పడకగది ముచ్చట్లు పక్కరూమ్లోకి కూడా వినిపించకుండా జాగ్రత్త పాటిస్తాం. హాల్లో చర్చలు పక్కింటి వ్యక్తి చెవిన పడకుండా సంయమనం పాటిస్తాం. ఆన్లైన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం వెనకాముందూ చూసుకోకుండా వ్యవహరిస్తుంటాం. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించడం అత్యవసరం. ఏ విషయం ఎవరికి చెప్పాలి? ఏ సమాచారం షేర్ చేయాలి? ఎవరితో మాట్లాడాలి? సామాజిక మాధ్యమాల్లో ఎవరిని ఫాలో కావాలి? ఏ యాప్‌లు ఇన్స్టాల్ చేసుకోవాలి? వేటికి దూరంగా ఉండాలి? ఇవన్నీ ఒకటికి రెండుసార్లు చర్చించుకొని ముందడుగు వేయాలి. అలాకాకుండా ఏ యాప్ పడితే అది డౌన్లోడ్ చేస్తూ… అడిగిన పర్మిషన్లన్నీ ఇచ్చేస్తూ పోతే మీ సమాచారానికి అపచారం చేసినట్టే అవుతుంది.
1 కాన్ఫిడెన్షియల్ డేటాను పకడ్బందీగా నిర్వహించాలి. స్మార్ట్ డివైజెస్‌లోని మీ ఫోల్డర్లను, ఫైల్స్‌ను సులభంగా కనుగొనగలిగే విధంగా బైఫర్కేషన్ చేయాలి. ఆఫీస్‌లో మీరు ఉపయోగించే డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్‌ను మీ వ్యక్తిగత డేటాను భద్రపర్చుకోవడానికి ఉపయోగించొద్దు. పర్సనల్ ఫైల్స్ ఏమైనా ఉన్నా.. వాటిని సులువుగా గుర్తించే విధంగా ఫోల్డర్లను నిర్వహించుకోవాలి.
2 మీ వ్యక్తిగత డివైజ్‌లను, ఫైల్స్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడం చాలా అవసరం. ఏదైనా డేటా క్లౌడ్‌లో భద్రపరచడానికి ముందు దానిని ఎన్‌క్రిప్ట్ చేయడం మర్చిపోవద్దు. అయితే వీటిని డిక్రిప్ట్ చేయడానికి పాస్వర్డ్ గుర్తుంచుకోవడం తప్పనిసరి. పాస్వర్డ్ మర్చిపోతే మాత్రం ఇది సాధ్యం కాదు. ఈ విధంగా చేయొచ్చు..
a. డేటా ఎన్క్రిప్షన్: Windows: Settings -> Update & Security ->
b. డివైజ్ ఎన్క్రిప్షన్: Macintosh: System Preferences -> Security & Privacy -> File Vault
c. ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు పాస్‌కోడ్ ఉపయోగించడంతోనే అందులోని మీ డేటా ఆటోమేటిక్‌గా ఎన్‌క్రిప్ట్ అవుతుంది.
3. అన్ని ఇ-మెయిల్, సోషల్ మీడియా అకౌంట్లు పాస్వర్డ్ మేనేజర్‌ను ఉపయోగించాలి. టూఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను ఎనేబుల్ చేయాలి. క్లౌడ్ యూజర్ అయినట్లయితే ఎస్సెమ్మెస్ లేదా టోకెన్ అప్లికేషన్ ద్వారా టూఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేయొచ్చు.
4. మీ ఫోన్‌ను గానీ, ల్యాప్‌టాప్‌ను గానీ ఇతరులు ఎవరూ యాక్సెస్ చేయకుండా జాగ్రత్తపడాలి. ట్రాకింగ్, మాల్వేర్, జ్యూస్ జాకింగ్ నుంచి డేటా చౌర్యం జరగకుండా అప్రమత్తతతో వ్యవహరించాలి.
5. పబ్లిక్ వైఫై వినియోగిస్తున్నప్పుడు వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) ఉపయోగించుకోవాలి.
6. మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.
7. నాణ్యమైన యాంటీ వైరస్, మాల్వేర్ సిస్టమ్స్‌ను ఉపయోగించడం వల్ల మీ సిస్టమ్ భద్రంగా ఉంటుంది. మాల్వేర్స్, ప్రమాదకరమైన వెబ్సైట్లు, ఇతర వైరస్ల నుంచి రక్షణ లభిస్తుంది.
అన్నిటినీ మించి పబ్లిక్ డొమైన్లో, సామాజిక మాధ్యమాల్లో ఏ విషయాన్ని, ఎంతవరకు షేర్ చేయాలో స్పష్టత కలిగి ఉండాలి. అప్పుడే మీ డేటా జరంత భద్రంగా ఉంటుంది.
ఫ్రాడ్స్టర్లు, సైబరాసురులకు మించి సోషల్ మీడియా వినియోగదారుల వ్యక్తిగత జీవితాన్ని నట్టేట ముంచుతున్నది. సోషల్ మీడియాలో ఒక్క పోస్టు చేయగానే.. వానకాలంలో దోమలదండు దండయాత్ర చేసినట్టు సదరు పోస్టుకు లింకైన సంస్థలన్నీ వినియోగదారుణ్ని కాంటాక్ట్ అవుతున్నాయి. అంటే, మన సోషల్ మీడియా అకౌంట్ ఎంత భద్రంగా ఉందో అంచనా వేసుకోవచ్చు. మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. కింద పేర్కొన్న లింకులను ఉపయోగించి మీ డేటాకు రక్షణ కవచం తొడగండి.
https://support.google.com/legal/answer/10769224?hl=en
https://takeout.google.com/settings/takeout?pli=1
https://gdpr.twitter.com/en.html
https://www.facebook.com/business/gdpr
https://business.safety.google/compliance/
https://privacy.linkedin.com/gdpr