Ramaayanam | తల్లులూ – శిక్షలూ!
పిల్లల్ని గారాబం చేయడం మా చిన్నప్పుడు ఇంతలా లేదు. అదటుంచి.. చాలామంది తల్లులు పిల్లలు చేసే అల్లరిని తట్టుకోలేక వారికి భయంకరమైన శిక్షలు విధిస్తుండేవారు. కానీ, దానివల్ల పిల్లలు అల్లరి మానేవారో లేదో తెలియదు.
Ramaayanam | పిల్లల్ని గారాబం చేయడం మా చిన్నప్పుడు ఇంతలా లేదు. అదటుంచి.. చాలామంది తల్లులు పిల్లలు చేసే అల్లరిని తట్టుకోలేక వారికి భయంకరమైన శిక్షలు విధిస్తుండేవారు. కానీ, దానివల్ల పిల్లలు అల్లరి మానేవారో లేదో తెలియదు.
ఏ పిల్లలైనా బడికివెళ్లే విషయంలో తల్లుల్ని బాగా సతాయిస్తారని నాకు తరువాత రోజుల్లో తెల్సింది. కాసేపు గోడల చాటున దాక్కోవడం, ఇంకాసేపు చెట్లెక్కడం, పశువులనూ, గొర్రెలనూ మేపే వాళ్లయితే వాళ్ల తండ్రి, తాతలతోబాటు మెల్లగా గుంపులో కలిసి వెళ్లిపోవడం, ఇంకొందరైతే బజార్లోకి దౌడు తీయడం, నాయనమ్మ, అమ్మమ్మల కొంగుల చాటున తగు రక్షణలో ఉండటం.. ఇలా ఎవరికి అనుకూలమైన విధానంలో వాళ్లు తప్పించుకునేవాళ్లు. తమ పిల్లలు తమలాగా కష్టపడే వృత్తిపనులు, కూలీనాలీ, వ్యవసాయం లాంటివి చేయకుండా బాగా చదువుకోవాలనుకునే తల్లులు మాత్రం తమ పిల్లలను ఎలాగైనా బడికి పంపాలని వెంటబడేవాళ్లు. మా ఇంటికి పక్కన ఓ అయిదిళ్ల అవతల ఓ దంపతులు, వాళ్లకు నలుగురు పిల్లలు ఉండేవాళ్లు. ఆ ఇల్లాలు పొద్దున్నే తప్పనిసరిగా చేయాల్సిన పనుల్లో పిల్లల్ని కొట్టడం ఓ భాగంగా పెట్టుకునేది.
“ఓ అవ్వా కొట్టకే! సస్తనే.. నీ దండం బెడ్తనే! వావ్వో! శెప్పినట్టు ఇంటనే!” అనే హాహాకారాలు వాళ్లింట్లోనుంచి ఉదయాన్నే వినిపిస్తూ ఉండేవి. మధ్యమధ్యలో గిభికీ గిభికీమనే గుద్దుల చప్పుళ్లూ, టపా టపామని వీపు దెబ్బల చప్పుళ్లూ మా చెవులను తాకేవి. “ప్రభాతభేరి మోగుతున్నది” అని మేం అనుకునేవాళ్లం.
మరికొందరు తల్లులు తొమ్మిదింటి సమయంలో పిల్లలను కొట్టుకుంటూ, వాళ్లు కదలకుండా మధ్యలో నిలబడితే ముందుకు నెట్టుకుంటూ బడి దాకా తీసుకెళ్లేవాళ్లు. ఆ క్రమంలో పిల్లలు ఏ చిన్న ఆధారం దొరికినా దాన్ని పట్టుకుని వేలాడేవాళ్లు. వాళ్లను లాగీ పీకీ.. “ఏందిరా! సదూకోకుంటే గాడుదుల కాస్తవారా?! మీ అయ్యలెక్క బర్ల పెండ తీసుకుంట గట్లనే ఉంటవా?! నడు..” అంటూ గొరగొరా గుంజుకు పోయేవాళ్లు.
మా ఇంటి పక్కనే యాదమ్మ, కొమురయ్య దంపతులు ఉండేవారు. వాళ్లకు ఓ కొడుకు, ముగ్గురు ఆడపిల్లలు. మా ఇంట్లో కొన్నాళ్లు యాదమ్మ పనిచేసింది కూడా. కొమురయ్య బియ్యం గిర్నీలో హమాలీగా చేసేవాడు. యాదమ్మ పొద్దున మా ఇంటినుంచి పట్టుకెళ్లిన వాటితోబాటు తను వండిన వంట పిల్లలకు పెట్టి, తను తిన్నాక మొగుడి కోసం అన్నం, కూర, పులుసు లాంటివి తీసిపెట్టి తను కూలికి వెళ్లేది. తీరా కొమురయ్య బండ చాకిరీ చేసి ఇంటికి వచ్చి తిందామని చూసేసరికి గిన్నెలు ఖాళీ! ఆ పిల్లలు, వాళ్ల పెదనాయిన పిల్లలు కలిసి మొత్తం ఖతం చేసేవారన్న మాట. యాదమ్మ ఇంటికి రాగానే ఆమె భర్త ఆకలి మంట, కోపం మంట మిక్స్ అయిపోయి.. ఆమెను ఉరికిచ్చి ఉరికిచ్చి దబాదిబా బాదేవాడు. పాపం ఆమె మాత్రం ఏం చేస్తుంది ? మా ఇంటికి పరిగెత్తుకొని వచ్చి అన్నం, కూరో, పచ్చడో అడిగి తీసుకెళ్లి మొగుడికి పెట్టేది. పిల్లలు అక్కడో ఇక్కడో కొంతసేపు గడిపి ఇంటికి చేరేవారు.
ఇంటి దగ్గర వాళ్లకోసం ‘బ్యాండ్ బాజా’ ఎదురు చూస్తూండేది. యాదమ్మ శక్తివంచన, పక్షపాతం లేకుండా నలుగురు పిల్లల్నీ నాలుగైదు విధాలుగా కొట్టేది. వీళ్లను ప్రేరేపించిన ఆమె యారాలు పిల్లలు మాత్రం.. వాళ్లింటి గోడచాటున నక్కి తమాషా చూస్తూండేవారు.
మరికొందరు తల్లులు తమ పిల్లలు సకల గుణాభిరాములే గానీ పక్కవాళ్ల పిల్లలే విలన్లు అనుకునేవారు. పిల్లలు ఏవైనా వస్తువులు కొట్టేసి తెచ్చినా, ఇతరుల ఆటవస్తువులు లాగేసుకున్నా, ఎవరింటికైనా వెళ్లినపుడు బీభత్సమైన అల్లరి చేసినా.. వాళ్లు ఏమీ ఎరగనట్టు చిద్విలాసంగా ఉండేవారు. “మీ పిల్ల మా ఇంట్లకెల్లి దువ్వెన తెచ్చింది. మీ పిల్లగాడు మావోని పెన్ను గుంజుకొచ్చిండు. మీ బిడ్డ మా బిడ్డయి రిబ్బెన్లు ఎత్కచ్చింది. అయ్యో! గీ అద్దం మాదే! దీని మీద ఇగో.. గిట్ల గీత పడ్డది సూడు.. గీడికెట్ల ఒచ్చింది?!” అనేలాంటి మాటలు విన్నప్పుడు మాత్రం ఆ చోరాంశ కలిగిన పిల్లల తల్లికి వీరావేశం పూని అక్కడికక్కడే పిల్లాణ్ని ఓ రెక్క పట్టి ఒంటి చేత్తో గొరగొరా గుంజుకుపోయి బ్యాండువాడు ఓ చేత్తో పట్టుకుని మరో చేత్తో వాయించినంత లాఘవంగా వాణ్ని కొడుతూ.. ఆ నిందారోపణ చేసినవాళ్ల మీద కసినంతా పిల్లాడి మీద చూపించేది.
చెవులు రక్తం వచ్చేంత ఎర్రగా అయేదాకా పిండటం, వాతలు తేలేంతగా చెంపలు, వీపు వాయగొట్టడం, కొట్టాక.. “ముయ్! ముయ్!” అంటూ నోట్లోంచి శబ్దం రాకుండా నిరోధించేలా బెదిరించడం ఆడపిల్లలకు విధించే ప్రత్యేక శిక్షలు. ఉమ్మడి కుటుంబాల్లో పొరబాటున ఏ పెంకి పిల్లకో, మొండి పిల్లాడికో హఠం చేస్తారని ఓ లడ్డూ ఎక్కువ వేస్తే.. అది చూసి మరో పిల్ల అడిగిందనుకోండి.. ఇక దానికి మూడినట్టే!
“నీకెందుకిస్తరు?! నువ్వేమన్న గార్వాల గంటెవా?! ముద్దుల ముత్యమా?! నోరు మూసుకొని పెట్టింది తిను!” అంటుంది తల్లి. లడ్డూల (మరొకటో) పైన అధికారం ఇంటి పెద్దావిడది కదా! ఆ పిల్ల తన భవిష్యత్తు తెలుసుకోలేక.. “ఊఁ.. ఊఁ.. నాకు కావాలె! ఇప్పుడే కావాలె!” అని ఏడుస్తుంది. “ఆహాఁ.. ఇప్పుడే కావాల్నా?!” అని తల్లి తన పిల్లవీపుపైన ఒకటేమిటి.. పది లడ్డూలిచ్చేది. అప్పుడు కళ్ల బట్టవిప్పిన గాంధారి నానమ్మ.. “అయ్యో! ఎందుకమ్మా పిల్లను గట్ల కొట్టుడు? అయిపాయె తియ్యి.. నేనిస్త రా!” అంటూ తెచ్చిచ్చేది. ఈలోగా మిగతా పిల్లలు ‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప! పోరాడితేనే ఏదైనా వచ్చేది’ అని తెలియజేసిన ఆ పిల్లవైపు గొప్ప ఆరాధనగా చూసి తామూ ఉద్యమించడానికి సిద్ధపడేవారు. ఆ తల్లి మాత్రం దీన్నంతా పెద్ద అవమానంగా భావించి.. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత అరిచినా కేంద్ర ప్రభుత్వ గ్రాంటు డైరెక్టుగా లబ్ధిదారుడికి చేరినట్లు.. ఆ లడ్డూను అందుకుని ఆ పిల్ల నోట్లో మొత్తం ఒకేసారి కుక్కి.. “ఊఁ.. ఏడ్చినవుగద. తినకుంటె చస్తవు గద! తిను..” అంటూ పోరాడి సాధించుకున్న దాన్ని పొందడంలో ఆనందం ఏ మాత్రం దక్కకుండా తినిపించేది.
కొందరు తల్లుల డిక్షనరీల్లో మరీ తీవ్రమైన శిక్షలుండేవి. కళ్లలో కారం పెట్టడం, ఇనుప గంటె లేదా కర్రు కాల్చి వాతపెట్టడం, గుంజకు కట్టేసి కొట్టడం వంటివి చేసేవారు. చిత్రమేమిటంటే.. ఇలాంటివి జరుగుతున్నప్పుడు పిల్లల తండ్రులు ఆ చుట్టుపక్కలకు రాకుండా ఉండేవారు లేదా డైలాగుల్లేని పాత్రల్లా నిమిత్తమాత్రంగా ఉండేవారు తప్ప.. “హేమిటీ.. హీ అన్యాయం? నేను కనుక్కుంటానుండు!” అనేవారు కారు. పిల్లలు ఉమ్మడి ఆస్తి అయినా వాళ్లను పెంచడం, వండి పెట్టడం, మంచీ చెడ్డా చూడటం ఆవిడ డిపార్ట్మెంటే అనుకునేవాళ్లేమో అప్పట్లో చాలామంది మరి!!
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

