చెట్టూర్ శంకరన్ నాయర్ తొలితరం జాతీయోద్యమ నాయకుడు. న్యాయకోవిదుడు, సంస్కర్త. శంకరన్ పేరు ఇప్పటితరానికి తెలియకపోవచ్చు. జలియన్‌వాలా బాగ్ ఘోరకలికి నిరసనగా ఆయన గళమెత్తారు. బ్రిటిష్ సర్కారులో తన ఉన్నత పదవికి రాజీనామా చేశారు. దమనకాండకు కారకులను తీవ్రంగా విమర్శించారు. ఫలితంగా లండన్‌లో న్యాయ విచారణ ఎదుర్కొన్నారు. ఆ రోమాంచిత ఘట్టాన్ని బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ హీరోగా తెరకెక్కించనున్నారు.
సంవత్సరం.. కేరళ (అప్పట్లో మలబార్)లోని మంకర గ్రామంలో జన్మించారు శంకరన్ నాయర్. మద్రాస్ లా కాలేజ్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. ఆ కళాశాల ప్రొఫెసర్లంతా బ్రిటిష్ వాళ్లే. అయినా, విద్యార్థులకు అన్ని విషయాల్లోనూ స్వేచ్ఛ ఉండేది. ఈ వాతావరణమే శంకరన్ అభ్యుదయ భావాలకు రెక్కలు తొడిగింది. పట్టా అందుకున్నాక.. మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. పదేండ్ల పరిమిత కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి మద్రాస్ శాసన మండలికి ఎంపికయ్యారు. భారత జాతీయోద్యమంలో తనదైన పాత్ర పోషించారు.
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆ బాధ్యతలు చేపట్టిన ఏకైక మలయాళీగా చరిత్రలో నిలిచిపోయారు. తదనంతరం, మద్రాస్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌గా కూడా నియమితులయ్యారు. మద్రాస్ ప్రెసి డెన్సీలో ఈ స్థానానికి చేరుకున్న తొలి భారతీయుడు ఆయనే. మరుసటి ఏడాది మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్య్రోద్యమంలో అతివాదాన్ని ఆయన ఇష్టపడలేదు. మతం, రాజకీయాలు కలగాపులగం చేయడం మంచిది కాదని హెచ్చరించారు.
బాల్యవివాహాలు, కుల వ్యవస్థను రద్దు చేయాలని కోరుకున్నారు. పేదలకు విద్య అందుబాటులో ఉండాలని సూచించారు. మహిళలకు పురుషులతో సమాన హక్కులు ఉండాలని వాదించారు. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో శంకరన్ నాయర్ ఏకైక భారతీయ సభ్యుడు. భారతదేశంలో పాలన వ్యవస్థ మెరుగుపరచడానికి ఉద్దేశించిన మాంటేగ్- చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల రూప కల్పనలో ఆయనది ప్రధాన పాత్ర. చట్టసభలకు మరింత మంది భారతీయులు ఎంపికయ్యేందుకు కృషిచేశారు.
1919 ఏప్రిల్ 13న జలియన్‌వాలా బాగ్ దమనకాండలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 400 మంది మరణించారు. అనధికారికంగా ఈ సంఖ్య వెయ్యికిపైగానే ఉంటుంది. ‘ఒక దేశాన్ని పాలించడానికి.. అమాయకుల్ని పొట్టనపెట్టుకోవడం తప్పని సరైతే అలాంటి దేశం సామాన్యులు నివసించడానికి తగినచోటే కాదు’ అంటూ శంకరన్ నాయర్ బ్రిటిష్ అరాచకాలపై నిరసన వ్యక్తంచేశారు. పంజాబ్ దారుణానికి వైస్రాయ్ లార్డ్ చెమ్స్‌ఫర్డ్ ఆమోదం ఉందని నాయర్ బలంగా విశ్వసించారు. నిరసనగా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఢిల్లీ నుంచి మద్రాస్ చేరుకున్న శంకరన్‌కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ సంఘటన బ్రిటిష్ ప్రభుత్వాన్ని కదిలించింది. పత్రికలపై నిర్బంధాలను ఎత్తివేశారు. సైనిక పాలనను రద్దుచేశారు. ‘జలియన్‌వాలా’ దురంతంపై విచారణ కోసం విలియం హంటర్ నేతృత్వంలో ఒక సంఘాన్ని నియమించారు. మారణకాండకు బాధ్యులైన ఓడ్వయర్, డయ్యర్‌కు మాత్రం ఎలాంటి శిక్షలూ పడలేదు. హత్యాకాండకు ప్రధాన కారణం పంజాబ్ గవర్నర్ మైఖేల్ ఓడ్వయర్ అని నాయర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఓడ్వయర్ ఇంగ్లండ్‌లో నాయర్‌పై పరువునష్టం దావా వేశారు.
కేసు విచారణ కోసం శంకరన్ నాయర్‌ను లండన్ పిలిపించారు. కింగ్స్ బెంచ్‌లో బ్రిటిష్ న్యాయమూర్తుల ముందు నిలబెట్టారు. ఐదు వారాలపాటు నడిచిన విచారణ బ్రిటిష్ న్యాయ చరిత్రలోనే అతి సుదీర్ఘమైంది. మెజారిటీ న్యాయమూర్తులు మైఖేల్ ఓడ్వయర్, జనరల్ డయ్యర్ వైపే నిలబడ్డారు. శంకరన్ నాయర్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అయితే, తీర్పులో ఏకాభిప్రాయం లేనందువల్ల మరోసారి విచారణకు కోరవచ్చని న్యాయస్థానం సూచించింది. దీనికి ఆయన ఒప్పుకోలేదు.
‘పన్నెండు మంది దుకాణాదారులు’ వేరేవిధంగా తీర్పు ఇస్తారని తాను అనుకోవడం లేదని వ్యంగ్యంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యాయస్థానం రెండు మార్గాలను ఆయన ముందుంచింది. ఒకటి.. క్షమాపణ అడగటం. రెండు.. లేదంటే 7,500 పౌండ్లు జరిమానా కట్టడం. తలవంచి క్షమాపణ కోరడం ఇష్టం లేని నాయర్ జరిమానా కట్టడానికే సిద్ధపడ్డారు. ‘జలియన్‌వాలా’ సంఘటన తర్వాతే గాంధీ నాయకత్వంలో స్వాతంత్య్రోద్యమం ప్రజా ఉద్యమంగా మారింది. 1947 ఆగస్టు 15న స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది.
శంకరన్ నాయర్ ఉద్యమ జీవితానికి ‘ద కేస్ దట్ షూక్ ది ఎంపైర్’ పేరుతో పుస్తక రూపం ఇచ్చారు ఆయన మునిమనుమడు రఘు పాలత్. ఆ పుస్తకం ఆధారంగా రూపొందుతున్న చిత్రమే ‘ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్
శంకరన్ నాయర్’. అక్షయ్‌కుమార్, అనన్య పాండే కీలకపాత్ర పోషించనున్నారు. మాధవన్ ముఖ్యపాత్రలో
కనిపించనున్నారు.