ఉదయం ఐదున్నరకే నిద్రలేచింది చంద్రకళ. చకచకా వంట చేసేసింది. భర్త, పిల్లలకు లంచ్‌బాక్సులు రెడీ చేసింది. పిల్లలు స్కూలుకు, భర్త ఆఫీసుకు వెళ్లిపోయారు. ఇంట్లో పనంతా అయిపోయాక, నడుం వాల్చింది. ఇంతలో ఫోన్‌కి వాట్సాప్ నోటిఫికేషన్. చూస్తే.. ‘ఇంట్లో ఉండే నెలకి వేలల్లో సంపాదించొచ్చు’ అని సారాంశం. పని బడలికంతా పరారైంది. ఎక్కడలేని హుషారొచ్చింది. గాల్లో ఏవో లెక్కలు వేసింది. ముఖం వెలిగిపోయింది. మళ్లీ మెసేజ్ ఓపెన్ చేసి.. వర్క్‌ఫ్రం హోంలో రిజిస్టర్ అయింది. వాళ్లు చెప్పిన పని చప్పున చేయడం మొదలుపెట్టింది. నెల తిరిగేసరికి చంద్రకళ ఖాతాలో పాతికవేలు క్రెడిట్ అయ్యాయి. తన శ్రీమతి అంతలా ఉత్సాహంగా ఎందుకు ఉందో ఆమె భర్తకు అర్థం కాలేదు.
Home Phishing | నెల గడిచింది.. లైకులు కొట్టడం, కామెంట్లు పెట్టడం దాటేసింది చంద్రకళ. ఇన్వెస్ట్మెంట్లోకి దిగింది. స్టాక్స్ ట్రేడింగ్ గురించి తెలుసుకుంది. మన కరెన్సీ దాటేసి.. క్రిప్టోకరెన్సీ అంటూ నట్టింట్లో నుంచి నెట్టింట్లోకి వెళ్లిపోయింది. ఈసారి గాల్లో కాకుండా.. పేపర్ పై లెక్కలేసింది. వేలు కాస్త లక్షలు చేసేద్దాం అనుకుంది. ఎన్నోఏండ్లుగా దాచుకున్న డబ్బును ఇన్వెస్ట్మెంట్గా, స్టాక్స్ ట్రేడింగ్‌లోనూ పెట్టేసింది. లక్షల్లో లాభాలు వచ్చేస్తాయ్ అని.. తనలో తనే మురిసిపోయింది. తన చేష్టలు చూస్తున్న భర్తకు కన్ఫ్యూజన్.. ఎక్కడో తేడా కొడుతుంది అనుకున్నాడు. రోజులు గడిచాయి.. ట్రేడ్ చేసిన వస్తువులు రాలేదు! పెట్టుబడులన్నీ ఉట్టికెక్కినట్టు తోచింది. ఏ మెసేజ్ వచ్చినా.. సదరు సంస్థ నుంచి తన ఖాతాలో డబ్బులు క్రెడిట్ అయ్యాయేమో అని భ్రమపడింది. వారం గడిచింది.. నెల అయింది.. నో సందేశం. ఆమెకు సందేహాలు పతాక స్థాయికి చేరాయి. భర్తకు తెలియకుండా ఏకంగా రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేసింది మరి! నానాటికీ చంద్రకళ ముఖంలో కళ తప్పింది. ఎవరికి చెప్పాలో తెలియదు. గాల్లో వేసిన లెక్కలన్నీ.. నీటిమీద రాతలయ్యాయి. అదే చేతులతో పెన్ను, పేపర్ అందుకుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ ఏదో రాసింది. వంటింట్లో గ్యాస్ లీకైన వాసన! చంద్రకళ కథ విషాదాంతమైంది. ఆమె కష్టమంతా హ్యాకర్ విలాసాలకు ఖర్చయింది!!
ఇది ఏదో డైలీ సీరియల్ కథ కాదు. నెట్టింట్లో జరిగే ఆన్లైన్ మోసానికి ఓ ఉదాహరణ. వీటినే వర్క్ ఫ్రం హోం ఫిషింగ్ ఫ్రాడ్స్ అంటారు. దేశంలో ఇప్పుడిదో నయా డిజిటల్ మోసం. హోం మేకర్స్ లక్ష్యంగా వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలంటూ హ్యాకర్లు విసురుతున్న వల. క్రిప్టోకరెన్సీ పేరుతో మన కరెన్సీ దోచేస్తున్నారు. ముందు చాలా సున్నితంగా ‘సోషల్ మీడియా ఎంగేజ్మెంట్’ పేరుతో దగ్గరవుతారు. లైక్‌లు కొడితే చాలు డబ్బులిచ్చేస్తాం అంటారు. కామెంట్స్ పెడితే కాసులు కురుస్తాయ్ అని చెబుతారు. అకౌంట్లో వేతనంలా డబ్బులు క్రెడిట్ చేస్తారు. ఇది నమ్మకాన్ని పెంచేందుకు వేసే గాలం. దానికి చిక్కితే చాలు. తర్వాతి స్టేజ్‌లో చుక్కలు చూపిస్తారు.
చిన్న పెట్టుబడి.. పెద్ద లాభం అంటూ స్కీములు పరిచయం చేస్తారు. అది నిజమనేలా ఫేక్ విజయగాథల్ని షేర్ చేస్తారు. ఎవరెవరు, ఎంతలేసి లాభాలు పొందారో చెబుతూ ఆశల్ని రేకెత్తిస్తారు. క్రిప్టో కరెన్సీ అంటూ డిజిటల్ మనీకి ఆకర్షితుల్ని చేస్తారు. భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తారు. దొంగ రేటింగులు ఇస్తారు. ఫేక్ రివ్యూలు కూడా ఉంటాయి. ఆలసించిన ఆశాభంగం అనుకునేలా చేస్తారు. ముందుచూపు లేకుండా పొదుపు మంత్రం పఠించే గృహిణులు వీళ్ల ఉచ్చులో ఇట్టే చిక్కుకుంటారు. ఫేక్ అనే అనుమానమే రాదు. నెల తిరిగాక అకౌంట్ చూస్తే.. అందులో రూపాయి ఉండదు. డిస్కౌంట్ మీద కొన్న వస్తువులైనా వస్తాయా అంటే.. అదీ ఉండదు. ఇలా ఆశల వలలో చిక్కుకొని నిరాశగా మిగిలిపోతున్న వాళ్లు ఎందరో!! ఆన్లైన్లో ఈ తరహా మోసాలు ఇప్పుడు బాగా ఊపందుకున్నాయి. భారీ మొత్తంలో డబ్బుని పోగొట్టుకుని సైబర్ పోలీసుల్ని ఆశ్రయిస్తున్న వాళ్లు ఎందరో ఉంటున్నారు. దీనికి ఒక్కటే పరిష్కారం. అవగాహన పెంచుకోవడం. స్వీయ నియంత్రణ పాటించడం. ఆన్లైన్ ప్రపంచంలో తామరాకు మీద నీటి బిందువులా ఉన్నంత కాలం… మీరు సేఫ్జోన్లో ఉన్నట్టే!