డబ్బు కావాలంటే ఇంతకు ముందు బ్యాంకుకో, ఏటీఎంకో వెళ్లాల్సిందే. రోజువారీ ఖర్చులన్నీ చేతుల మీది నుంచే జరిగేవి. 2006లో నోట్ల రద్దు లక్షల మందిని డబ్బు విషయంలో ఇబ్బందుల పాలు చేసింది. కానీ ఇప్పుడు పది రూపాయల కొత్తిమీర కట్ట కొన్నా స్కాన్ చేసి చెల్లిస్తున్నాం. బహుశా ప్రపంచంలో మరెక్కడా మన దేశమంత ఎక్కువగా డిజిటల్ చెల్లింపులు జరగడం లేదు. భారత్‌లో ఈ డిజిటల్ చెల్లింపుల విప్లవానికి శ్రీకారం చుట్టింది పేటీఎం సంస్థ. ఇప్పటికీ ఆ విభాగంలో దేశంలోనే ముందంజలో ఉన్న ఈ సంస్థను స్థాపించిన విజయ్ శేఖర్ శర్మ… ఒకప్పుడు తిండికి కూడా ఇబ్బంది పడ్డారనీ, ఇంగ్లిష్ రాక సమస్యలను ఎదుర్కొన్నారనీ తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.
నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే ఇండియాలో డిజిటల్ చెల్లింపుల సేవలు విజయవంతం అవుతాయా… ఓ పెద్ద సందేహం. మామూలు వారికే కాదు మేధావులక్కూడా! వారందరి అంచనాలనూ పటాపంచలు చేస్తూ అసలు చదువే రానివాళ్లు కూడా డిజిటల్ చెల్లింపుల సేవలను చక్కగా వాడుకుంటున్నారు ఇప్పుడు. దానికి కారణం పేటీఎం. సులభమైన పద్ధతుల్లో, వేగవంతమైన విధానాల్లో డిజిటల్ చెల్లింపులు చేసే వ్యవస్థను తీసుకొచ్చిందీ సంస్థ. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చదువుకున్న వారితో పాటు దేశంలోని నిరక్షరాస్యులు కూడా ముందుంటారని నిరూపించింది. దాని వెనుక ఉన్న విజయ్ శేఖర్ శర్మ శ్రీమంతుల కుటుంబం నుంచీ ఏమీ రాలేదు.
కొందరి విజయగాథల్లో ఆకలి కేకలు వినిపిస్తాయి. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మది కూడా ఒకప్పుడు తిండికే కష్టాలు పడ్డ కథే. ‘ఒకానొక సమయంలో దాదాపు రెండేండ్ల పాటు ఒక పూట తిండికి కూడా ఇబ్బంది పడ్డాను. ఆటోలో కాదు బస్సులో వెళ్లడానికి కూడా అవసరమైనంత డబ్బు లేక కొద్ది దూరం నడిచి, బస్సులో వెళ్లేవాడిని. అలాంటి జీవితం గడిపాను కాబట్టే డబ్బుకు విలువ ఇస్తాను. జీవితానికి విలువ ఇస్తాను’ అని చెబుతారాయన. 1978లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు విజయ్. ఆస్తి లేక పోయినా చదువుకు మాత్రం ప్రాధాన్యం ఇచ్చే వారు కుటుంబ సభ్యులు. తండ్రి ఉపాధ్యాయుడు. తరగతిలో చురుగ్గా ఉండే విజయ్‌ని ఆంగ్లం మాత్రం భయపెట్టేది. ఆ కారణంగానే విద్యాభ్యాసమంతా హిందీ మీడియంలోనే కొనసాగించాడు. పుస్తకాలు కొనే స్తోమత కూడా లేకపోవడంతో మిత్రుల వద్ద వాటిని తీసుకొని, ఇంగ్లిష్ నేర్చుకోవడానికి కుస్తీ పట్టేవాడు. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో చదువు పూర్తి చేసుకున్నాక, సొంతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచనలో పడ్డాడు. అలా చాలా అధ్యయనాలు, ప్రయత్నాల తర్వాత తొలుత వన్ 97 పేటీఎం ద్వారా సెల్ ఫోన్ రీచార్జ్, బిల్లులు చెల్లించే సేవలు ప్రారంభించాడు.
వన్ 97 కమ్యూనికేషన్ సంస్థను 2000 సంవత్సరంలో స్థాపించారు. వార్తలు, క్రికెట్ స్కోర్, జోకులు, పరీక్షా ఫలితాల లాంటి మొబైల్ కంటెంట్ పంపించే సంస్థగా ప్రారంభమైంది ఇది. దీని ద్వారానే 2010లో పేటీఎం( పే త్రూ మొబైల్ ) సేవలు ప్రారంభించారు విజయ్. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలో భారత దేశం మొదటి స్థానంలో ఉందని చెబుతున్నది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నివేదిక. దీనిలో పేటీఎంది కీలక పాత్ర. డిజిటల్ చెల్లింపులకే పరిమితం కాకుండా యూపీఐ పేమెంట్స్, ఈ-కామర్స్, టికెట్ బుకింగ్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, స్టాక్ బ్రోకింగ్ వంటి సేవల రంగానికి కూడా విస్తరించారు. పేటీఎంకు 2016లో జరిగిన నోట్ల రద్దు వరంగా మారింది. లక్షలాది మంది డిజిటల్ పేమెంట్లను నమ్ముకోక తప్పని పరిస్థితిని తెచ్చిపెట్టింది. అప్పుడు మనకున్న ఒక మంచి ఆప్షన్ పేటీఎం. ప్రస్తుతం 30 కోట్ల మంది ఈ యాప్‌ను ఉపయోగిస్తుండగా, దాదాపు 2 కోట్ల మంది వ్యాపారులు తమ లావాదేవీల కోసం పేటీఎం సేవలు ఉపయోగించుకుంటున్నారు. 2017లో రెండు బిలియన్ డాలర్లకు పైగా ఆస్తితో యంగెస్ట్ ఇండియన్ బిలియనీర్‌గా రికార్డ్ సృష్టించారు శర్మ. అయితే అంతా సజావుగా ఏ ప్రయాణమూ జరగదు. ఇటీవల సంస్థ పేమెంట్ బ్యాంకు మీద ఆర్బీఐ కొన్ని ఆంక్షలు విధించినా వాటిని తట్టుకొని నిలబడ్డారు విజయ్. అప్పటికి కంపెనీ స్టాక్ బాగానే పడింది కూడా. అయితే తమ కంపెనీ తిరిగి నిలబడుతుంది అని భరోసాగా ప్రకటించారాయన. ఆ దారిలో అడుగులు పడుతున్నాయి కూడా!
ప్రస్తుతం వన్ 97 కు విజయ్ శేఖర్ శర్మ సీఈఓగా ఉన్నారు. ప్రారంభంలో పెట్టుబడుల కోసం నిధుల సమస్య ఎదుర్కొన్న అదే కంపెనీలో ఇప్పుడు అలీబాబా, సాఫ్ట్ బ్యాంకు, వారెన్ బఫెట్‌లాంటి వారు పెట్టుబడి పెట్టే స్థాయికి దాన్ని తీసుకొచ్చారు. ఇక, ఆయన సొంత ఆస్తి విలువ దాదాపు 10 వేల కోట్ల రూపాయలు. అయినా సరే మధ్యతరగతి జీవితం గడపడానికే ఇష్టపడతారు. హిందీలో కపిల్ శర్మ షోలో మాట్లాడుతూ ఎవరైనా నెలకు లక్షన్నర, రెండు లక్షలతో హాయిగా జీవితాన్ని గడపవచ్చు అంటూ చెప్పుకొచ్చారు. తనలా ఉత్సాహంతో స్టార్టప్‌లు ప్రారంభించడానికి ముందుకు వచ్చే వారి ఆలోచనలు నచ్చితే పెట్టుబడి పెడతారు. ఒక సగటు కుటుంబం, సాధారణ చదువుల నుంచీ వేల కోట్ల రూపాయల సంపద దాకా ఆయన్ను నడిపించింది సొంతంగా ఎదగాలన్న తపన మాత్రమే. అది ఉంటే ఈ విజయ్ శేఖర శర్మలాగే ఎవరైనా విజయం సాధించవచ్చు.
– బుద్దా మురళి
98499 98087