Sholay | షోలే అంటే నిప్పు.. ఆ నిప్పు రాజుకొని యాభై ఏండ్లు అయింది. ఇప్పటికీ ఏదో టీవీలో ‘షోలే’ ప్రసారమవుతూనే ఉంటుంది. ఎక్కడో అక్కడ సెల్ఫోన్లో గబ్బర్ డైలాగులు వినిపిస్తూనే ఉంటాయి. 1975లో విడుదలై అఖండ విజయం సాధించిన ‘షోలే’కు 2025 స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ ఏడాది ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ.. ఏదో రూపంలో వసూళ్లు రాబడుతూనే ఉందన్నది సత్యం!
‘సోజా బేటా.. సోజా.. నహీతో గబ్బర్ ఆజాయేగా’ అని భయంగా చెప్పి ఓ తల్లి బిడ్డను పడుకోబెట్టింది. ఆ బిడ్డ.. తల్లయ్యాక తన చిట్టితల్లినీ ఇలాగే బెదిరించి బజ్జోబెట్టింది. ఆ చిన్నారి అమ్మయ్యాక… తన అల్లరి పిల్లాడికీ ఇదే మాట చెప్పి నిద్రపుచ్చింది. యాభై ఏండ్లుగా ఇదే తంతు! ఇన్ని తరాలను గడగడలాడించిన గబ్బర్‌సింగ్ చుట్టూ నడిచే కథ ‘షోలే’. రామ్‌గఢ్‌ను వణికించిన గబ్బర్ పాత్రలో జీవించిన అంజద్ఖాన్కు ఇది తొలి చిత్రం. మొదట ఈ పాత్రకు డానీ డెంజోంగ్పాను అనుకున్నారు దర్శకుడు రమేశ్ సిప్పి. కానీ, ఫిరోజ్‌ఖాన్ దర్శకత్వంలో ‘ధర్మాత్మ’ సినిమాతో డానీ బిజీగా ఉండటంతో ఆ పాత్ర అంజద్‌ను వరించింది. గబ్బర్‌గా ఆయన చేసిన అభినయం విలనిజానికి నిఘంటువుగా మారిపోయింది.
‘షోలే’లో వీరు, జయ్ పాత్రలు హీరోలుగా అనుకుంటాం. కానీ, అసలు హీరోలు మాత్రం ఠాకూర్, గబ్బర్లే! వీరుగా నటించిన ధర్మేంద్ర కథ విన్నాక ఠాకూర్ రోల్ వేస్తానని దర్శకుణ్ని కోరాడట. కానీ, బసంతి వేషం వేసిన హేమామాలిని అంటే ధర్మేంద్రకు వల్లమాలిన ప్రేమ. వీరు పాత్ర ఎంచుకుంటే ఆమెకు దగ్గర కావొచ్చనే నెపంతో తన పంతం మానాడట ధర్మేంద్ర. మరోవైపు అమితాబ్ ధరించిన జయ్ పాత్రకు ముందుగా శత్రుఘ్న్ సిన్హాను అనుకున్నారట దర్శక, నిర్మాతలు.. చివరికి అది అమితాబ్‌ను వరించింది.
గబ్బర్‌గా అంజద్ఖాన్ను ఎంపిక చేయడం ఈ సినిమాకు కథ అందించిన సలీమ్-జావెద్‌లకు నచ్చలేదు. అంజద్ వాయిస్ పీలగా ఉందనీ, గబ్బర్ పాత్రకు న్యాయం చేయలేకపోతున్నాడని అసహనం వ్యక్తం చేశారట! ఆ విషయం అంజద్ చెవిలో పడింది. మొదటి సినిమా కావడంతో అప్పటికేం మాట్లాడలేదు. ‘షోలే’ విడుదలైంది. ఆ సినిమా కన్నా గబ్బర్ సింగ్ ఇంకా హిట్టయ్యాడు. అంజద్ స్టార్ అయిపోయాడు. తన గురించి పేలవంగా మాట్లాడిన సలీమ్-జావెద్ కథ అందించిన సినిమాల్లో ఆయన మరెన్నడూ నటించలేదు.
మొదట అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం ైక్లెమాక్స్‌లో గబ్బర్‌సింగ్‌ను ఠాకూర్ చంపేస్తాడు. అలాగే షూటింగ్ కూడా చేశారు. కానీ, ఉద్యోగం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఓ సిన్సియర్ పోలీస్ అధికారి.. ఇలా రివెంజ్ తీర్చుకోవడం సబబుగా లేదన్నారట సెన్సార్ బోర్డు సభ్యులు. దీంతో గబ్బర్ను చావబాది, పోలీసులకు అప్పగించి కథ ముగించాడు దర్శకుడు.
షోలే షూటింగ్ కోసం లొకేషన్లు వెతకడానికే చాలాకాలం పట్టిందట. మధ్యప్రదేశ్‌లో ఎన్నో ప్రదేశాలు చూశాడట దర్శకుడు రమేశ్ సిప్పి. అయినా ఆయనకు సంతృప్తి కలగలేదు. చివరికి బెంగళూరు సమీపంలోని రామనగర ప్రాంతం ఆయనకు ఎంతగానో నచ్చింది. అక్కడి కొండలు, పరిసరాలు కథకు సూటవుతాయని భావించాడు. దీంతో.. అక్కడే రామ్‌గఢ్ విలేజ్ సెట్‌ను వేసి, షూటింగ్ చేశారు.
ఈ సినిమా విజయంలో కథ, కథనం, మాటలు, నటవర్గం అందరికీ సమాన వాటా దక్కుతుంది. ఆర్డీ బర్మన్ సంగీతం ‘షోలే’ను మరోస్థాయికి తీసుకెళ్లింది. పాటలన్నీ ఒకెత్తు అయితే.. బర్మన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌నే మార్చేసింది. అలా సినిమా విజయాన్ని అందరూ పంచుకున్నారు.
1975 ఆగస్టు 15న ‘షోలే’ విడుదలైంది. గబ్బర్ను పట్టిస్తే ‘పూరే పచాస్ హజార్’ ఇనామ్ ఇస్తామని సినిమాలో పోలీసుల మాట. వెండితెర మీద మాత్రం షోలే ‘పూరే పైంతీస్ (35) కరోడ్ రుపయా’ వసూలు చేసింది. విడుదలయ్యాక మొదటి రెండుమూడు రోజులు పెద్దగా టాక్ ఏం రాలేదు. దర్శకుడు వాకబు చేస్తే ‘ప్రేక్షకులు సైలెంట్‌గా బయటికి వస్తున్నారని’ చెప్పారట. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అన్నాడట రమేశ్ సిప్పి. ఆయన అనుకున్నట్టే వారం గడిచే సరికి ‘షోలే’ దావానలం అయింది.
వారాలు గడుస్తున్నా.. రద్దీ తగ్గలేదు. వంద రోజులు దాటినా అదే జోరు. దాదాపు వంద థియేటర్లలో పాతిక వారాలు ఆడింది. అరవై థియేటర్లలో గోల్డెన్ జూబ్లీ (50 వారాలు) సెలెబ్రేట్ చేసుకుంది. సుమారు రూ.3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.35 కోట్ల పైచిలుకు రాబట్టింది. ప్రతి దశకంలోనూ షోలే ఎక్కడో ఓ చోట మళ్లీ విడుదల అవుతూనే ఉంది. ఇప్పటి దాకా దాదాపు 25 కోట్ల టికెట్లు తెగాయంటే.. ‘షోలే’ ఏ రేంజ్ హిట్ సినిమానో అర్థం చేసుకోవచ్చు. తరాలు మారినా.. ఇప్పటికీ గబ్బర్ మాటలు నమ్ముకొని పొట్టపోసుకుంటున్న మిమిక్రీ ఆర్టిస్టులు ఎందరో! షోలే స్పూఫ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాను దున్నేస్తున్న కళాకారులు మరెందరో!