డా. సి. నారాయణరెడ్డి తన బాల్యాన్ని మూలవిరాట్‌తో పాటు శిల్పకళా సౌందర్యనందనమైన వేములవాడ భీమేశ్వర దేవాలయం చెంత గడిపారు. విద్యార్థిగా దక్కన్ నేల మీద వెలుగు లీనిన అజంతా ఎల్లోరా కుహరాల్లోని శిల్పసంపదను తనివితీరా ఆస్వాదించి కవిత్వం రాశారు. ఆ స్ఫూర్తితో 1954లో “అజంతా సుందరి” గేయనాటికను ఆకాశవాణి కోసం రాశారు. 1955లో సినారె విలక్షణ గేయకథా కావ్యం “నాగార్జున సాగరం” వెలువడింది, ఇందులోని నాయకుడు శిల్పి. 1959లో “రామప్ప” సంగీత రూపకాన్ని ఆకాశవాణి కోసం కూర్చారు. అది తర్వాత అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమై.. ఏకకాలంలో జాతీయ రూపకంగా ప్రసారమైంది. యాదృచ్ఛికంగా ఇందులోని “మబ్బులో ఏముంది” గీతం ‘లక్షాధికారి’ చిత్రంలో, ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’ గీతం ‘అమరశిల్పి జక్కన్న’ చిత్రంలో పాటలుగా అలరించాయి.
ఈ నల్లనిరాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో
పాపాలకు, తాపాలకు బహుదూరములో నున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి
పైన పేర్కొన్న సినారె కావ్యాలు, రూపకాలతో పాటు ‘అమరశిల్పి జక్కన్న’ చిత్రంలోని కథ శిల్పులకు, శిల్పాలలకు సంబంధించింది. ‘రాలలో హృదయాలు వెలిసిన రాసకేళీశాల’ది. ‘ఈ నల్లనిరాలలో’ గీతాన్ని ఆకాశవాణి కోసం పాలగుమ్మి విశ్వనాథం తొలుత స్వరపరచగా, అందులోని నాయక పాత్రధారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గంభీరంగా గానం చేశారు. ఈ గీతాన్ని డి.ఎల్.నారాయణ సలహా మేరకు దర్శక నిర్మాత బి.ఎస్.రంగా సినిమా కోసం ఉన్నదున్నట్టుగా స్వీకరించారు. గతంలో గజళ్లు, ఇతరాలు కూడా సినిమాలో ప్రవేశపెట్టారు సినారె. దీనిని అమరగాయకులు ఘంటసాల గానం చేయగా, ఎస్.రాజేశ్వర రావు స్వరపరిచారు. అందులోనూ కవి ఊహ ఎంత చక్కనిదో చూడండి. అదీ ఆయన కవిగా రాస్తూ, శిల్పి దృష్టితో చూశారు. కాబట్టే ఆయనకు నల్లని రాళ్లలో దాగిన కళ్లు, బండల మాటున వినిపించిన గుండెల ఊసులు తెలిశాయి. ఇంకా ఇందులో ‘అవి కేవలం శిలా శిల్పాలు కావు, సజీవ మూర్తులు’ అన్న భావం దాగి ఉంది.
రాతిని రమణీయంగా చెప్పిన సినారె అవి పాపాలకు, తాపాలకు దూరంగా ఉండడమే కాకుండా మునుల లాగా అన్నింటికి అతీతంగా ఉన్నాయని చెబుతారు. ఇందులో ఇంకో అర్థం కూడా నిగూఢంగా ఉంది. రాళ్లు కదలకుండా ఒకచోట జడత్వతో పడి ఉండొచ్చు. కానీ, నిపుణుడైన శిల్పి ఉలి తగిలితే ఆ రాయి నాగినై నర్తిస్తుంది, రమణీయ ఆకృతియై నిలుస్తుంది. కింది పాదాల్లో దానిని చెబుతారు కవి.
కదలలేవు మెదలలేవు
పెదవి విప్పి పలకలేవు
ఉలి అలికిడి విన్నంతనే… ॥2॥
జలజలమని పొంగిపొరలు ॥ఈ నల్లని॥

పైన కఠిన మనిపించును
లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న
శిలలే నయమనిపించును
ఈ నల్లనిరాలలో…
ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున
ఏ గుండెలు మ్రోగెనో… ఓ.. ఓ..
ఉలి అలికిడితో రాళ్లు రాగాలు పలుకుతాయి, చక్కని శిల్పి చేతిలో పడితే నల్లని రాళ్లు రమణీయకృతులై, ఆకృతులై వికసిస్తాయి. అదీ ‘జలజలమని’ పొంగిపొరలుతాయంటారు సినారె. ‘ఆత్మలను పలికించేదే అసలైన భాష’ అన్న గజల్లో లాగా ఇందులోనూ వ్యంగ్యంగా ప్రాణమున్న మనుషులకంటే ప్రాణంలేని శిలలే నయమంటారు. దీనిని గురించి చెబుతూ కవి సినారె “…మొండి మనుషుల మీద మనకు విసుగొస్తే వాళ్లకంటే బండలే నయం అని విసుగులో ఓ విసురు విసిరే వ్యధితమానవ చిత్తవృత్తిని అలా అభివ్యక్తం చేశాను” అంటారు. ఇది మోహనరాగంలో కూర్చిన సమ్మోహన గీతం.
‘అమరశిల్పి జక్కన్న’ చిత్రంలో కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు, కథానాయిక బి.సరోజాదేవి. అమరశిల్పి జక్కన్న పేరు వినగానే శిల్పకళా ప్రియుల మదిలో బేళూరులో ఈ మహాశిల్పి మలిచిన చెన్నకేశవ దేవాలయం, హలిబేడులోని హొయసలేశ్వర దేవాలయాలు జ్ఞాపకం వస్తాయి. మూడు తరాల శిల్పుల వంశం జక్కన్నది. ఈయన తండ్రి మల్లన్న శిల్పి, తండ్రి నుంచి శిల్పకళను వారసత్వంగా నేర్చుకున్న రెండో తరం శిల్పి జక్కన్న. ఈయన కొడుకు ఢంకన్న. ఇతను తండ్రిని ఎదిరించి నిలవడం చిత్రంలోని కథ. మూడుతరాల శిల్పుల అజరామరగాథ ‘అమరశిల్పి జక్కన్న’ చిత్రం. ఈ గీతం ఇటు ఆకాశవాణి సంగీత రూపకంలోనూ, అటు చలనచిత్రం లోనూ ప్రసిద్ధి చెందింది. అంతే స్థాయిలో వేలాది వేదికలపైన వినిపించింది కూడా! ఒక్కమాటలో చెప్పాలంటే ఘంటసాల పాటకు బ్రాండ్‌గా కూడా నిలిచింది!