Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా మూడో సెషన్లోనూ భారీ నష్టాలతో ముగిశాయి. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలతో ముడిచమురు ధరలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ (Investers Centiment) ను దెబ్బతీశాయి. దాంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 715.06 పాయింట్లు (0.92 శాతం) పతనమై 76,755.05 వద్ద ముగిసింది. నిఫ్టీ 191.45 పాయింట్లు (0.79 శాతం) కోల్పోయి 23,996.25 వద్ద స్థిరపడింది.
అదేవిధంగా నిఫ్టీ సూచీ కూడా కీలకమైన 24,000 పాయింట్ల కంటే దిగువకు పడిపోయింది. మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీకి 24,200 స్థాయి కీలక నిరోధంగా మారింది. ఈ స్థాయిని దాటితేనే మార్కెట్లో మళ్లీ కొనుగోళ్ల జోరుపెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు 24,000 దిగువన కొనసాగితే మరింత అమ్మకాల ఒత్తిడి పెరిగి నిఫ్టీ 23,900-23,800 స్థాయిల వరకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిఫ్టీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 1.09 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.54 శాతం చొప్పున పడిపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియల్టీ, మీడియా సూచీలు చెరో 2.6 శాతం క్షీణించాయి. ఐటీ, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లు కూడా దాదాపు ఒక శాతం మేర నష్టపోయాయి.