విలువలు సమున్నతం.. బతుకమ్మ ఔన్నత్యం
ప్రకృతిలో మమేకమైన మానవజాతికి ప్రకృతే ఆదిగురువు, దైవసమానం. ప్రకృతి నుంచే జీవించడం నేర్చుకుంటాడు మనిషి. ఆశ్వయుజ మాసంలో ప్రకృతి అంతా పచ్చనికోక కట్టుకొని, రంగురంగుల పూలను జడలో తురుముకొని, ‘దివినున్న ఆ రంగుల హరివిల్లే భువికి దిగివచ్చెనా!’ అన్నంతగా రమణీయతను అలుముకుంటుంది.
ప్రకృతిలో మమేకమైన మానవజాతికి ప్రకృతే ఆదిగురువు, దైవసమానం. ప్రకృతి నుంచే జీవించడం నేర్చుకుంటాడు మనిషి. ఆశ్వయుజ మాసంలో ప్రకృతి అంతా పచ్చనికోక కట్టుకొని, రంగురంగుల పూలను జడలో తురుముకొని, ‘దివినున్న ఆ రంగుల హరివిల్లే భువికి దిగివచ్చెనా!’ అన్నంతగా రమణీయతను అలుముకుంటుంది. గలగలపారే ఝరులతో, పరిమళాలు వెదజల్లే విరులతో, తీరొక్క వర్ణాల రంగవల్లిలా ముగ్ధమనోహరంగా ముస్తాబవుతుంది అవనిమాత. ఈ మాసంలో వచ్చే పండుగే బతుకమ్మ వేడుక. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. చిన్నాపెద్దా తేడా లేకుండా అత్యంత వైభవోపేతంగా జరుపుకొనే పండుగ ఇది. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ లోకకళ్యాణానికి బతుకమ్మను ప్రార్థిస్తాం. తెలంగాణ కీర్తి ఖండాంతరాలు వ్యాపించిందంటే దానికి కారణం మన బతుకమ్మ ఉత్సవమే. బతుకమ్మ ఆటలో, పాటలో గ్రామీణ జీవన విధానం ఉట్టిపడుతుంది. తెలంగాణ బతుకుచిత్రం ప్రత్యక్షం అవుతుంది. చారిత్రక నేపథ్యాలు, ప్రజల జీవన విధానాలు, నాటి పాలకుల నిర్లక్ష్యాలు, స్త్రీల పట్ల వివక్ష, వీర నారుల విజయగాథలు, మానవ అనుబంధాలు, కుటుంబ విలువలు, ఉద్యమస్ఫూర్తి అన్నీ బతుకమ్మ పాటల్లో నిక్షిప్తమై చరిత్రను కండ్లకు కడతాయి. మహాలయ అమావాస్య మొదలుకొని తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగను చేసుకుంటాం. బతుకమ్మ పండుగ ఆనందాలను, ఆప్యాయతలను పంచడమే కాకుండా విలువలకు అద్దం పడుతుంది. మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం ద్వారా మనిషిలో మానవత్వం పెరిగి, నైపుణ్యాల వృద్ధి జరిగి, విలువల సంప్రోక్షణ సాధ్యమవుతుంది.
స్వీయ క్రమశిక్షణ
తొమ్మిది రోజులు బతుకమ్మ పేర్చి, గౌరీదేవిని నిష్ఠగా పూజించడం వల్ల మనలో క్రమశిక్షణ అలవడుతుంది. ఉదయమే లేవడం, శుచి శుభ్రత తర్వాత అమ్మవారిని భక్తితో కొలవడం, సాయంత్రం నిర్దిష్ట సమయానికి బతుకమ్మ ఆడటం ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం, దానిని సక్రమంగా ఆచరించడం ద్వారా సమయపాలన, స్వీయ క్రమశిక్షణ అభివృద్ధి చెందుతాయి.
నైతిక విలువలు
నీతి అంటే ప్రవర్తనా నియమావళి. ఏది తప్పు, ఏది ఒప్పు అని తర్కించడానికి ఉపయోగపడేది. సత్ప్రవర్తన, ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండటమే నైతికత. మన పూర్వికుల ఆచారాలకు కారణాలు తెలుసుకొని పాటించడం వల్ల అవి మనకు నిజాయతీగా ఉండటం నేర్పుతాయి. మంచి అలవాట్లను పెంపొందిస్తాయి.
సృజనాత్మకత
బతుకమ్మను అందంగా, కనులవిందుగా పేర్చడం ఒక కళ. వెదురుసిబ్బిలో మొదటగా బీర ఆకులను గానీ, సొర ఆకులను గానీ పరచి వాటిపై ఒక్కో వలయంగా పూలను పేర్చుతారు. రకరకాల పూలను ఎలా పేర్చాలో, రంగుల పూలను ఒకదాని తర్వాత ఒకటి ఆకర్షణీయంగా ఎలా అమర్చాలో, రంగుల కలయిక ఎలా ఉండాలో, వైవిధ్యంగా ఎలా తీర్చిదిద్దాలో.. భిన్న కోణాల్లో ప్రయత్నించడం ద్వారా కొత్త ఆలోచనలకు నాంది పడుతుంది. సృజన పెరుగుతుంది.
ఐకమత్యం
వీధిలోని వారంతా ఒకచోట చేరి, అక్కడ ప్రతిరోజూ బతుకమ్మ ఆడతారు. ఆటకు వెళ్లేటప్పుడు ఇరుగుపొరుగు వారిని కలవడం, మాట్లాడుకోవడం, అందరూ కలిసికట్టుగా బయలుదేరడం, కబుర్లతో కాలక్షేపం చేయడం, సంతోషాలను పంచుకోవడం, బాధలను చెప్పుకోవడం ద్వారా మనసు బరువు తేలికై బంధాలు బలపడతాయి. కష్టసుఖాలను పంచుకోవడంతో సుముఖత పెరుగుతుంది. అందరం ఒక్కటనే భావన పెంపొందుతుంది.
సహకార భావం
బతుకమ్మ కోసం పూలను సేకరించడం ద్వారా… ఒకరింటికి ఒకరు వెళ్లడం, సేకరించిన పూలను పంచుకోవడం, ఒకరి దగ్గర ఉన్న పూలను ఇంకొకరికి ఇవ్వడం, కొంతమంది కలిసి పెద్ద బతుకమ్మను పేర్చుకోవడం, ఇలా పేర్చడంలో ఒకరికొకరు సహాయపడటం ద్వారా సహకారభావం పెంపొందుతుంది. ఒకరిపట్ల ఒకరికి గౌరవం కలుగుతుంది.
శారీరక ఆరోగ్యం
మితాహారం, ఉపవాసం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చప్పట్లు కొడుతూ ఆడటం వల్ల నాడులు ఉత్తేజితమవుతాయి. పాటలు పాడటం వల్ల ముఖవ్యాయామం, కోలాటం, గర్బా, దాండియా వల్ల శారీరక వ్యాయామం జరిగి శరీరానికి బలం చేకూరుతుంది. స్థూలకాయులకు అదనపు కొవ్వు తగ్గుతుంది. బతుకమ్మ సద్దులు తినడం ద్వారా శరీరానికి కావలసిన పోషక పదార్థాలు లభిస్తాయి. నువ్వులు, బెల్లం ద్వారా క్యాల్షియం, ఇతర సద్దులు తినడం ద్వారా ఖనిజ లవణాలు, ప్రొటీన్లు లభించి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది.
నాయకత్వ లక్షణం
సామూహికంగా పండుగ నిర్వహించుకోవడం వల్ల.. పనులను విభజించడం, అందరినీ సమన్వయపరచడం, నిర్ణయాలు తీసుకోవడం, కార్యక్రమ నిర్వహణ ద్వారా నాయకత్వ లక్షణాలు చిగురిస్తాయి.
మానవత్వం
ఊరేగింపుగా బతుకమ్మను తీసుకెళ్లడం, నిమజ్జనం చేయడంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే సాయం చేయడం, వయసులో పెద్దవారికి బతుకమ్మ ఎత్తడంలో, నిమజ్జనం చేయడంలో అండగా ఉండటం వల్ల దయ, కరుణ, మానవత్వం, మనుషుల మధ్య సోదరభావం పటిష్ఠమై మానవత్వం పరిమళిస్తుంది. సమాజంలో మానవీయ విలువలు పెరుగుతాయి.
పర్యావరణ పరిరక్షణ
ఒక్కో రకం పువ్వులో ఒక్కో ఔషధ గుణం ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే. వివిధ రకాల పూలను సేకరించడం, వాటిని స్పృశించడం ద్వారా అనేకరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రకృతి వల్ల మనం ఎలాంటి లాభం పొందుతున్నామో తెలుసుకొని ప్రకృతిని కాపాడుకోవలసిన ఆవశ్యకతను అర్థం చేసుకుంటాం. తద్వారా పర్యావరణ పరిరక్షణకు నడుంబిగిస్తాం.
సాంస్కృతిక విలువ
పండుగలు నిర్వహించుకోవడం వల్ల మన సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాలు అవగతమవుతాయి. అలా భావితరాలకు సాంస్కృతిక సంపదను చేరవేసిన వాళ్లమవుతాం. మన సంస్కృతిని కాపాడుకోవాలన్న బాధ్యత తెలిసి
వస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన సమాజ స్థాపనకు పునాది వేయగలుగుతాం. పండుగ నిర్వహణలో ఇంటిల్లిపాదీ కలిసి పనులు చేయడం వల్ల కుటుంబసభ్యుల మధ్య అన్యోన్యత పెరిగి, అనుబంధాలు పటిష్ఠమవుతాయి.
మన పూర్వికులు మనకు వారసత్వంగా ఇచ్చిన పండుగలను నిర్వహించుకుందాం. వాటి పుట్టు పూర్వోత్తరాలు, ప్రాశస్త్యాన్ని తెలుసుకొని, భావి తరాలకు తెలిపి సంస్కృతిని రక్షించుకుందాం.
కళాత్మక నైపుణ్యం
బతుకమ్మ ఆటలో పాటకు అనుగుణంగా లయబద్ధంగా చప్పట్లు కొట్టడం, రాగయుక్తంగా పాటలను పాడటం, వివిధ రీతుల్లో కోలాటం, దాండియా ఆడటం, బతుకమ్మలను పెట్టేచోట ముగ్గులు వేయడం ఇవన్నీ మహిళల కళానైపుణ్యాన్ని వృద్ధిచేస్తాయి. అంతర్గత నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతాయి.
ఆత్మవిశ్వాసం
ఇంట్లో స్వయంగా పండుగ నిర్వహించుకోవడం, సమయపాలన పాటించడం, ఉపవాస దీక్ష ఆచరించడం, సామూహికంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పనైనా చేయగలం అనే నమ్మకం మనసులో నాటుకుంటుంది. దైవారాధన, ఉపవాసం ద్వారా ఏకాగ్రత చేకూరి మానసిక ఆరోగ్యం దృఢమవుతుంది.
అయిత అనిత: ఉపాధ్యాయిని, కవయిత్రి జగిత్యాల
aithaanitha1803@gmail.com
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

