అనగనగా ఓ కోట. ఉన్నది భారతదేశంలోనే అయినా పాశ్చాత్య నిర్మాణశైలిలో విభిన్నంగా కనిపిస్తుంది. చుట్టూ ఉండే నందన వనాలు, లోపలి గదులు, ఫర్నిచర్… అంతా యూరోపియన్ ైస్టెల్లో ఉండేవే. అందుకే ‘బకింగ్ హామ్ ప్యాలెస్ ఆఫ్ ఇండియాగా’ దాన్ని పిలిచేవారు. 300 ఏండ్లనాటి ఆ భవంతి అప్పట్లో ఆ ప్రాంతానికే ప్రత్యేకంగా ఉండేది. కాలంతో పాటు రాజులు రాజ్యాలే కాదు రాజభవనాలూ చరిత్రలో పాత్రలయ్యాయి. కానీ, కోసిం బజార్ ప్యాలెస్ అందుకు భిన్నం!! ఆనాటి చరిత్రకు అద్దమంటి సాక్ష్యం అది. శిథిలాల నుంచి అదరహో అనిపించేదాకా ఆ రాజప్రాసాదపు ప్రయాణం వెనుక ఓ కుటుంబపు ప్రయాస ఉంది.

Cossimbazar Palaceమనకు కథలంటే ఎంతో ఇష్టం. అందులోనూ రాజుల కథలూ, పూర్వపు సంగతులంటే మరింత ఆసక్తి. కోటలు, రాజభవనాలంటే కూడా అంతే. మనం వింటున్నది అచ్చంగా కట్టు కథేం కాదు కాస్తైనా నిజమైనది అని నమ్మించేందుకు మన ముందు కనిపించే కట్టడమే సాక్ష్యం మరి! అందుకే ఎక్కడ ప్యాలెస్‌లు ఉన్నా వాటిని చూసేందుకు తెగ క్యూ కడుతుంటాం. కోసిం బజార్ ప్యాలెస్ కూడా మన దేశానికి చెందిన అలాంటి ఓ భవంతే. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని, ముర్షీదాబాద్‌లో ఉంది. ఒకప్పుడు పట్టు వ్యాపారం చేసే అయోధ్యారామ్ రాయ్ అనే వ్యక్తి ఇక్కడ ఉండేవారు. ఆయనే 1700 సంవత్సరం ప్రాంతంలో తొలుత ఈ ప్యాలెస్‌ని నిర్మాణాన్ని ప్రారంభించారు.

ఆయన ఆసక్తి మేరకే అది ఇండో యూరోపియన్ ైస్టెల్లో రూపుదిద్దుంది. ఆ తర్వాతి కాలంలో దాన్ని అనుసంధానిస్తూ కొత్త భవంతులు, నందనవనాలు, ఆఫీసు, టెన్నిస్ కోర్టు, గుడులు నిర్మించారు. వీరి కుటుంబపు దాతృత్వానికి గౌరవ సూచకంగా బ్రిటిష్ ప్రభుత్వమూ రావ్ బహద్దూర్, రాజా లాంటి బిరుదుల్ని ప్రదానం చేసింది. కానీ, ఆ తర్వాత మారిన పరిస్థితులే ప్యాలెస్‌ను శిథిలావస్థకు చేర్చాయంటారు వాళ్ల వంశానికి చెందిన పల్లవ్ రాయ్.

‘1924 సంవత్సరానికి ఈ ప్యాలెస్ సెక్యూరిటీకి 200 మంది ఉండేవారట. 34 మంది తోటమాలులు పనిచేసేవారు. 9 వంటశాలలు ఉండేవి. అప్పట్లో ఎస్టేట్ సిస్టం ఉండేది. అందుకే మా తాతలను రాజా అని పేరుకు ముందు పిలిచే వారు. అయితే స్వాతంత్య్రానంతరం ఎస్టేట్ వ్యవస్థ పోయాక… మా ఆస్తులన్నీ వేలం వేశారు. 10 తరాలపాటు మేం సొంతంగా సంపాదించుకున్న సొమ్మంతా పోయింది. అదేమీ ప్రభుత్వ గ్రాంటు కాకపోయినా అప్పటి పరిస్థితులు అలాంటివి. ఇక, ఆ ప్యాలెస్‌ను నిర్వహించలేక మా తాతగారు రాజా కమలరంజన్ రాయ్ కుటుంబంతో సహా కలకత్తాకు మారిపోయారు. ఆ తర్వాత 60 ఏండ్ల పాటు వదిలివేయడంతో భవంతి పాడుబడిపోయింది.

మేం కొంత సొమ్ము కూడబెట్టుకున్నాక దాన్ని బాగు చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టాం’అని చెబుతారు పల్లవ్ రాయ్. అడవి మధ్యలో పాడుబడిపోయి, చెదలు పట్టిన ఈ భవంతిని వీళ్ల కుంటుబమే కొన్నేండ్లపాటు కష్టపడి మళ్లీ కొత్త రూపును తీసుకువచ్చింది. పాత ప్యాలెస్‌ను మించిన అందం ఇప్పుడు దీని సొంతం. ప్రభుత్వ గుర్తింపు పొందిన వారసత్వ కట్టడమైన ఇందులో ప్రస్తుతం మ్యూజియంతో పాటు హోటల్‌నూ నిర్వహిస్తున్నారు. ఈ విశాలమైన ప్యాలెస్‌లో ఓ రాత్రి గడపాలనుకుంటే ఇంకా చూడాల్సింది ఏముంది చెప్పండి మంచి ముహూర్తం తప్ప!

