మద్దిని వృక్షశాస్త్ర పరిభాషలో ‘టర్మినేలియా అర్జున’ అని పిలుస్తారు. ‘అర్జున చెట్టు’ అని ఎక్కువగా పిలుస్తారు. ఇది భారత దేశమంతటా కనిపించే చెట్టు. శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా, కెన్యాలలోనూ విరివిగా కనిపిస్తుంది.
మద్దిలో రెండు రకాల (ప్ర)జాతులున్నాయి. ఒకటి తెల్లమద్ది. రెండోది నల్ల మద్ది. నల్ల మద్ది చాలా బలమైనది. ఉక్కుతో సమానమైనదని చెప్పుకోవాలి. చేద బావులకు అడ్డంగా ఉండే మొద్దు, ఇంటి నిర్మాణంలో స్తంభాలు, దూలాలు, వాసాలకు దీనిని ఉపయోగిస్తారు. రోళ్లు, రోకళ్లు నల్లమద్దితో తయారు చేస్తారు. మద్ది నుంచి స్రవించే జిగురుని కాల్చితే సువాసన వస్తుంది. అందుకే దీనిని గంధపు చెట్టు అని కూడా పిలుస్తారు. టస్సర్ సిల్కుని ఉత్పత్తి చేసే అంతేరియా పఫియా రకం పట్టు పురుగులు మద్ది చెట్టు ఆకులను తింటాయి. ఇవి మద్ది చెట్లపై ఉంటాయి.
మద్ది బెరడులో క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్లు, వాపులను తగ్గించే, సూక్ష్మ క్రిములను హరించే స్వభావం కలిగిన ఔషధ మూలకాలు ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో మద్దికి ప్రాధాన్యం ఉంది. మద్ది చెక్క కషాయం గుండె జబ్బులను నివారిస్తుంది. ఈ కషాయం వల్ల గుండె కండరాలు బలపడతాయి. గుండె పని తీరు మెరుగవుతుంది.
ప్రతి రోజూ మద్ది బెరడు కషాయాన్ని పాలతో కలిపి ఒకటి, రెండుసార్లు తీసుకుంటే అధిక రక్తపోటుని సరిచేస్తుంది. గుండె సంబంధ వ్యాధులతోపాటు అతిసారం, ఆస్తమా, దగ్గుని కూడా మద్ది కషాయం తగ్గిస్తుంది. మద్ది బెరడుని పొడి చేసి, నీళ్లు కలిపి చర్మంపై రాసుకుంటే దద్దుర్లు, దురద, ఎగ్జిమా, సొరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు పోతాయి.
– ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు