ప్రపంచీకరణ యుగంలో భూగోళం ఓ కుగ్రామంగా మారిపోయింది. సాంకేతిక రంగ అభివృద్ధి, సమాచార విప్లవం ప్రసార మాధ్యమాలను పరుగెత్తిస్తున్నాయి. కొత్త కొత్త సాంకేతిక ఆవిష్కరణలూ జరుగుతున్నాయి. వీటన్నిటి ప్రభావంతో జర్నలిజం అనేక పుంతలు తొక్కుతూనే ఉంది. వాటన్నిటినీ తొక్కుతూ జర్నలిస్టులు పరుగెత్తాలి. వార్తా సేకరణ, విశ్లేషణకు ఎన్నో అవకాశాలున్నాయి ఇప్పుడు. ప్రసారంలోనూ డిజటల్ ప్లాట్‌ఫామ్స్ పెరిగాయి. వెబ్‌సైట్స్, సోషల్ మీడియా బ్రాడ్కాస్ట్ చానెల్స్ ఎన్నో వచ్చిన తర్వాత వార్తా రచన వేగంతోపాటు వాటికి అనుగుణంగా రాయాల్సిన, విశ్లేషించాల్సిన అవసరం వచ్చింది.
ఇందుకు రాసే టూల్స్, టెలికాస్ట్ యాప్స్ వచ్చాయి. మంచితోపాటే చెడూ ఉంటున్నది. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోవడానికి ఫ్యాక్ట్ చెక్ యాప్స్‌ని వాడటం కూడా ఇప్పటి జర్నలిజంలో భాగమే. సమాచార విప్లవంలో ఎవరెన్ని సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే అన్ని అవకాశాలు. సుదీర్ఘమైన వార్తను సంక్షిప్తంగా ఇస్తున్నట్టే విస్తృతమైన సమాచార విశేషాలను జర్నలిస్టుల కోసం ‘ఆధునిక జర్నలిజం-కృత్రిమ మేధ’ పుస్తకం అందిస్తున్నది. ఏఐ జనరేషన్ జర్నలిస్టులకు ఇది గొప్ప అవకాశం. వృత్తిలో రాణించడానికే కాదు సంచలనాలు సృష్టించడానికీ ఇది మార్గదర్శి.
రచయిత: ముద్దం నరసింహ స్వామి
ప్రచురణ: డీఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్
పేజీలు: 141 ధర: రూ. 220
ప్రతులకు : 70134 14526
– నాగవర్ధన్ రాయల
ప్రపంచంలో వివిధ దేశాల ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రజాస్వామ్య విధానం గొప్ప వ్యవస్థ. ప్రజలు తమను పాలించడానికి, తమ బాగోగులు చూసుకోవడానికి తమ మధ్యనుంచి కొంతమందిని ఎన్నికల ద్వారా నిర్ణీత కాలానికి ఎన్నుకోవడమే ఈ వ్యవస్థ గొప్పతనం. మళ్లీ ఎన్నికల ద్వారా శాంతియుతంగా ప్రభుత్వ మార్పిడి జరిగిపోతుంది. ప్రజాస్వామ్యం నేపథ్యంలో… భాషకు, ప్రజాస్వామ్యానికి, మతానికీ ప్రజాస్వామ్యానికీ, న్యాయవ్యవస్థకు ప్రజాస్వామ్యానికి, సాయుధ విప్లవాలకు, ప్రజాస్వామ్యానికీ మానవవాదానికీ ఉన్న సంబంధాల గురించి సమగ్రమైన వివరణలతో అనిసెట్టి శాయికుమార్ ‘ప్రజాస్వామ్య ప్రస్థానం’ పేరుతో వ్యాస సంకలనం వెలువరించారు.
ఈ రచన కోసం శాయికుమార్.. గతాన్ని విశ్లేషించుకొని, గతం వల్ల ఏర్పడి ఉన్న వర్తమానాన్ని పరిశీలించుకుని మెరుగైన భవిష్యత్తు రూపురేఖలు నిర్దేశించుకునే విధానాన్ని అనుసరించారు. ఈ క్రమంలో ఆయన రాజ్యాంగ పరిధిలో పాలనలో, ప్రభుత్వ విధానాలలో, వ్యవస్థాగత సంస్కరణలకు సంబంధించి మార్పులు చేపట్టి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా వివిధ అంశాలను ఈ పుస్తకంలో పొందుపరచారు. ప్రపంచ ప్రజాస్వామ్యం మొదలుకుని భారతదేశం, తెలుగు రాష్ర్టాల పోకడల వరకు వివిధ కోణాలను ఇందులో ఆవిష్కరించారు. మొత్తం 13 అధ్యాయాల్లో సాగిన ఈ ‘ప్రజాస్వామ్య ప్రస్థానం’ ఒక రకంగా ప్రజాస్వామ్య నిఘంటువుగా భావించవచ్చు.
రచన: అనిసెట్టి శాయికుమార్
పేజీలు: 176; ధర: రూ. 150
ప్రచురణ: స్వేచ్ఛాలోచన ప్రచురణ
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 94407 70531