పక్షి గూడు కట్టని చెట్టు ఒంటరి మనిషిలా కనిపిస్తుంది. ఆకుపచ్చని వృక్షానికి అసలైన అలంకారం అందంగా కనిపించే గూళ్లే మరి. ప్రకృతి సహజమైన ఈ అందాన్ని మన ఇంటికీ తెచ్చుకోవచ్చు అంటున్నారు నేటి తరం డిజైనర్లు. అందుకే పక్షి గూళ్లను పోలిన లైట్లు, షాండ్లియర్లు నట్టింట వెలుగులీనుతున్నాయి. ‘బర్డ్ నెస్ట్ లైట్లు’ నెక్ట్స్ లెవెల్ అనిపించేలా కొంగొత్త కళను తీసుకొస్తున్నాయి.
ఇంటిని ఎంత కొత్తగా కట్టుకున్నా ఇంటీరియర్నూ అంతే స్థాయిలో ఎంచుకుంటేనే దాని అందం ఇనుమడిస్తుంది. గదుల్లో కాంతులు నింపే లైట్లది ఇందులో ప్రత్యేక స్థానం. అందుకే అవి కూడా విభిన్న ఆకృతుల్లో రకరకాల వైవిధ్యాలతో రూపుదిద్దుకుంటున్నాయి. మునుపెన్నడూ చూడని చిత్రమైన రూపాల్లో కనువిందు చేస్తున్నాయి. సాధారణంగా వెలుతురు కోసం మాత్రమే కాకుండా, ఇంటి అలంకరణకూ లైట్లను వినియోగించడం ట్రెండ్ అవడంతో ఇవి వింత కాంతులు పోతున్నాయి. పక్షి గూడును పోలిన లైట్లు ఈ కోవలోనివే. వెరైటీ కోరుకునే వారికే కాదు ప్రకృతిని ఆరాధించే వారికీ ఇవి మంచి ఎంపిక.
పక్షుల్లోనూ పిచుకలు, కాకులు పెట్టే గూళ్లు రస్టిక్గా ఉంటాయి. వాటిలాగే, గుండ్రంగా పుల్లలని అమర్చి కట్టినట్టుగా ఉండేలా ఈ ‘బర్డ్ నెస్ట్ లైట్లు’ తయారవుతున్నాయి. అంతేకాదు, సన్నటి గడ్డి పోచలతో అందంగా అల్లి కనిపించే గిజిగాడి గూళ్లూ ఈ తరహా లైట్లలో ఉంటున్నాయి. సీలింగ్ పై నుంచి వేలాడే వాటితో పాటు గోడకు పెట్టేవీ ఈ లైట్లలో వస్తున్నాయి. బర్డ్ నెస్ట్, క్రో నెస్ట్, వీవర్ బర్డ్ నెస్ట్ లైట్లుగా వీటిని పిలుస్తున్నారు. మెటల్ పుల్లలు వచ్చి గూటిలో గుడ్డు మాదిరిగా తెల్లటి లైట్లు ఉంటాయిందులో. గూటి దగ్గర రంగు రంగుల పక్షులు కూర్చున్నట్టుగా, కొమ్మల మీద గూళ్లు ఉన్నట్టుగా విభిన్న మోడళ్లలో వీటిని డిజైన్ చేస్తున్నారు. బంగారం, రాగి, సిల్వర్ రంగుల్లో ఈ గూళ్లు రూపొందుతున్నాయి. మన ఇంటీరియర్, లైట్ ఉంచే గదులను బట్టి వీటిని ఎంచుకోవచ్చు. ఇక, గువ్వా గూడూ ప్రకృతివే కాదు, ప్రకృతి ప్రేమికులవి కూడా!