‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముంబయి బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవల ‘కింగ్డమ్’ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఈ చిన్నది నటించిన రెండు చిత్రాలు ఈ నెలలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో రామ్‌తో, ‘కాంత’ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో జతకట్టింది. ఇలా వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయిన ఈ హాట్ బ్యూటీ పంచుకున్న కబుర్లు ఇవి..
చిన్నప్పటి నుంచే కళల పట్ల అభిమానం ఉండేది. అందుకే ముంబయి యూనివర్సిటీ నుంచి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశాను. చదువుతో పాటు నటన, డ్యాన్స్‌లోనూ రాణించడానికి ప్రత్యేక కోర్సులు తీసుకున్నా. అవి నటనలో నైపుణ్యం పొందడానికి ఎంతగానో దోహదం చేశాయి.
స్కూల్ డేస్ నుంచే డ్యాన్స్ అంటే ఆసక్తి ఉండేది. కల్చరల్ ఈవెంట్స్‌లో పోటీ చేసేదాన్ని. నాటకానుభవం కూడా ఉంది. స్టేజ్ ముందు కూర్చోవడం కన్నా స్టేజ్ మీద నటించడాన్నే ఇష్టపడేదాన్ని. దాంతో నటన నా జీవితంలో భాగంగా మారింది. ఆ ఆసక్తితోనే సినిమాల్లో అడుగుపెట్టా. క్లాసిక్ బాలీవుడ్ సినిమాలు చూడటం బాగా అలవాటు.
ఒక సినిమా ప్రేక్షకులను మెప్పించడం చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. కథ-కథనం ఆసక్తికరంగా సాగిపోవాలి. నటీనటులు ప్రాణం పెట్టాలి. ఇలా అన్నీ సమపాళ్లలో కుదిరినప్పుడే సినిమా ప్రేక్షకులను రంజింపజేస్తుంది. వీటిలో దేని ప్రత్యేకత దానిదే!
ఏ పని చేసినా మీ పట్ల, మీ అభిరుచి పట్ల నిజాయతీగా ఉండాలి. పరిశ్రమ సవాలుగా ఉండవచ్చు, కానీ పట్టుదల, అంకితభావం కీలకం. ఆర్టిస్టుగా నేర్చుకుంటూ ఎదగాలి. రిస్క్ తీసుకోవడానికి భయపడొద్దు. కలల్ని వదులుకోకుండా నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా అనుకున్నది సాధిస్తారు.
నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించడం, ఆ కథకు ప్రాణం పోసి ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రేకెత్తించడం ఆసక్తిగా గమనించేదాన్ని. నన్ను నేను ఆయా పాత్రల్లో ఊహించుకునేదాన్ని.
ఆ అభిరుచే నటనను కెరీర్‌గా ఎంచుకోవడానికి స్ఫూర్తినిచ్చింది.
తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు నన్నెంతగానో ఆదరించారు. వారి ఆదరాభిమానాలు, ఆశీర్వాదం ఉంటే మరిన్ని సినిమాల్లో నటించి అందరినీ అలరించేందుకు కృషి చేస్తా.
చదవడం, ట్రావెలింగ్ అంటే ఇష్టం. బుక్ రీడింగ్ వల్ల చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రయాణం కొత్త సంస్కృతులు, సంప్రదాయాలు, రుచులను పరిచయం చేస్తుంది. ఇక నన్ను నేను భిన్నంగా వ్యక్తీకరించుకోవడానికి పెయింటింగ్ ఒక మార్గంగా భావిస్తాను.