ఏ పేరు వింటే భారతీయుల హృదయం దేశభక్తితో ఉప్పొంగిపోతుందో.. ఎవరిని తలచుకుంటే భారత యువతలో అణువణువు సామ్రాజ్యవాదంపై కసితో రగిలిపోతుందో… అతనే విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్. దేశం కోసం, ప్రజల కోసం, దేశప్రజల స్వేచ్ఛ కోసం తృణప్రాయంగా ప్రాణాలను త్యాగం చేసిన ఆ మహనీయుడు ఇప్పటికీ, ఎప్పటికీ మన హృదయాలను ప్రేరేపిస్తూనే ఉంటాడు.
ప్రతిఏడాది గుడ్ ఫ్రైడే నాడు క్రిస్టియన్ మిషనరీ కళాశాలల్లో ‘శిలువధారి ఏసుక్రీస్తు’ అంశాన్ని విద్యార్థులు బహిరంగ రూపకంగా ప్రదర్శిస్తుంటారు. సరిగ్గా అదే పద్ధతిలో ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా ‘మా గమ్యం (భగత్ సింగ్ స్ఫూర్తి)’ రూపకాన్ని బాల కళాకారులు ప్రదర్శించారు. దేశభక్తి ఉట్టిపడేలా రక్తి కట్టించారు. ‘ఏమి నేల తల్లి ఇది పనికి రాని బీడు ఎటుల జరిగెనమ్మ ఈ ఘోర దారుణంబు ఇది రత్నగర్భ కాదు సమాధి రాళ్ల బీడు అది పలుకలేని భాష నూరేళ్ల దీన ఘోష’ అని పాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాద చెరలోని భారతమాత దైన్యాన్ని అభినయం ద్వారా కళ్లకు కట్టారు. వెనువెంటనే ఆనాడు దేశమంతటా అలుముకున్న ‘సైమన్ గో బ్యాక్ ఉద్యమం’ రంగస్థలంపై ఆవిష్కృతం అవుతుంది.
‘బోలో స్వతంత్ర భారత్ కీ… జై’, ‘వందే మాతరం’ నినాదాలు మిన్నంటుతాయి. ‘స్వరాజ్యం మా జన్మహక్కు’ అని నినదించిన లాలాలజపతి రాయ్‌పై పోలీసుల లాఠీలు విరుచుకుపడతాయి. రాయ్ నేలకొరుగుతాడు. ‘మనం… మన నాయకత్వాన్ని రక్షించుకోలేనంత పిరికివాళ్లం కాదని చాటుదాం’ అని విప్లవ వీరులు నిర్ణయించుకుంటారు. బ్రిటిష్ పోలీస్ అధికారి జేమ్స్ స్కాట్‌ని హత్యచేసి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతినబూనుతారు. ఆ ప్రణాళిక అమలులో.. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ సాండర్స్‌పై విప్లవకారులు తుపాకీతో కాల్పులు జరుపుతారు. సాండర్స్ అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడు ‘పరదేశపు పాలనపై పిడికిలెత్తి లేచెను… దాస్య శృంఖలాలను ధ్వంసించగ నెంచెను’ అన్న పాట మార్మోగుతుంది.
దేశ ప్రజలకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను నిరసిస్తూ భగత్ సింగ్ పార్లమెంటులో పొగబాంబులు విసురుతాడు. కరపత్రాలు వెదజల్లుతాడు. పార్లమెంట్ దద్దరిల్లేలా.. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ నినదిస్తాడు. ‘ఈ బాంబులతో చెవిటి వానికి శంఖం వినిపించడమే తప్ప. ప్రాణాలు హరించాలనే లక్ష్యంతో కాదు’ అని భగత్ సింగ్ కోర్టులో స్పష్టం చేస్తాడు. భగత్‌సింగ్‌కి కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. బాధపడుతున్న మిత్రులతో భగత్‌సింగ్… ‘కామ్రేడ్స్! విప్లవ పథంలో అడుగిడినప్పుడే దేశం కోసం నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధమయ్యాను. దేశ స్వాతంత్య్రం, సౌభాగ్యం కన్నా నా ప్రాణాలు గొప్పవి కావు. ఇక నా ప్రాణవాయువు దేశమంతటా వ్యాపిస్తుంది’ అని సగర్వంగా చెబుతాడు. ‘విప్లవం ప్రపంచ నియమం. మానవాళి ప్రగతికి అది ఆధారం. మనిషిని మనిషి దోచుకునే పద్ధతిని అంతం చేయడమే విప్లవ లక్ష్యం’ అని భగత్ సింగ్ విస్పష్టంగా ప్రకటిస్తాడు.
ఉరితాడు బిగించే ముందు.. మేజిస్ట్రేట్‌తో ‘సార్! మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఒక భారతీయ విప్లవకారుడు తన మహత్తర విప్లవ ఆశయ సాధన కోసం చిరునవ్వుతో ప్రాణాలెలా అర్పిస్తాడో మీరు ప్రత్యక్షంగా ఇప్పుడు చూడబోతున్నారు’ అని హాయిగా చెబుతాడు భగత్‌సింగ్. ఉరిశిక్ష అమలవుతుంది. ‘నీ మార్గం మా గమ్యం నిరంతరం ఉద్యమం… అందుకే అందుకో మా ఉద్యమ లాల్ సలాం’ అన్న నేపథ్య గీతంతో రూపకం ముగుస్తుంది.
ముప్పై నిమిషాల నిడివితో సాగే ఈ రూపకంలో సన్నివేశాలు గేయ నేపథ్యంతో చకచకా సాగిపోతాయి. పాటలన్నీ బృందగానాలే. పాత్రధారుల అభినయం సెట్ డిజైన్, ప్రాపర్టీస్, మేకప్, ఆహార్యం, మైక్ సిస్టమ్ తదితర బాధ్యతలన్నీ బాలకళాకారులే నిర్వర్తించారు. బాలల సమష్టి నిర్వహణ ఒక ప్రయోగం. ఈ రూపకం ఆకట్టుకోవడానికి ముఖ్య కారణం 32 మంది కళాకారుల్లో కనిపించిన ఐకమత్యం, సహకారాలే!
రూపకం పేరు : మా గమ్యం (భగత్ సింగ్ స్ఫూర్తి)
ప్రదర్శకులు : ఎనిమిదో తరగతి విద్యార్థులు, క్రాంతి హైస్కూల్, కొండపల్లి
రచన, రూపకల్పన : శైలి
నిర్వహణ: నారాయణ, ఐనాక్ (జాషువా సాంస్కృతిక కేంద్రం)
సమర్పణ: అమ్మాజీ, మురళి