ఏడు సముద్రాల ఆవల… మూడాకుల మర్రిచెట్టు కొమ్మన ఓ చిలుక. దాని గుండెలో తన ప్రాణం ఉందని నేపాల మాంత్రికుడు రెచ్చిపోతుంటాడు. కానీ, అనగనగా ఓ రాకుమారుడు.. ఇవన్నీ దాటుకొని ఆ చిలుక గొంతు నులిమి.. మాంత్రికుడి ఆట కట్టిస్తాడు. అంత పదిలంగా ప్రాణం దాచుకున్న చిలుక చిరునామా చెప్పడం ఎందుకు? ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎందుకు? కథ రంజుగా సాగడానికి కథకులు చేసిన ప్రయోగం అనుకోండి! మంత్రాలు తెలిసిన మాంత్రికుడి పరిస్థితే తలకిందులైతే.. ఏ మాయామర్మం తెలియని సామాన్య మానవుడు తన ధన, మాన, ప్రాణాలను ఒక్క పాస్‌వర్డ్‌తో అష్టదిగ్బంధనం చేశానని మురిసిపోతుంటాడు. ఇంటిపేరు, వంటిపేరు వచ్చేలా తూతూమంత్రం తాయెత్తు కడితే.. పక్కింటోడో, ఎదురింటోడో, సైబర్ మాయగాడో పక్కాగా పసిగడతాడు. అలాకాకుండా మన పాస్వర్డ్ ఫెయిల్ కావొద్దంటే.. ఈ సూత్రాలు తప్పకుండా పాటించండి..
ఇందాక చెప్పిన కథలో మాంత్రికుడు విలన్ అనుకోండి. హీరో అతని రహస్యం ఛేదించినా ఇంపుగానే ఉంటుంది. అదే హీరోగారి రహస్యం మాంత్రికుడు పసిగడితే… పేదరాసి పెద్దమ్మ కథ ఎప్పుడో మర్చిపోయేవాళ్లం! మన పాస్‌వర్డ్‌ను మర్చిపోతే పోయేదేం లేదు! మళ్లీ రిట్రీవ్ చేసుకోవచ్చు. కానీ, ఎప్పటికీ గుర్తుండాలని సాదాసీదా లాక్ వేస్తేనే సమస్య. పాస్వర్డ్ ఎంపిక సమయంలో కనీసం ఎనిమిది అక్షరాలు ఉండాలనీ, అందులో ఒక క్యాపిటల్ అక్షరం, స్పెషల్ క్యారెక్టర్, న్యూమరిక్ నంబర్, నార్మల్ అక్షరాలు ఉండాలని హెచ్చరికలు వస్తుంటాయి. అయినా.. ‘12345678’, ‘loveyoubaby’, ‘00001111’ తరహా అతీగతీ లేని కోడ్ పెట్టుకుంటారు చాలామంది. నాలుగురోజుల్లో సైబర్‌దాడికి గురై లబోదిబో అంటారు. మరికొందరు అతిజాగ్రత్తపరులు షరతులకు లోబడి మరీ గజిబిజి పాస్వర్డ్ ఎంపిక చేసుకుంటారు. పది నిమిషాల తర్వాత మళ్లీ ట్రై చేస్తే అది వాళ్లకే గుర్తుకురాదు. ఈ సమస్య ఉత్పన్నం కావొద్దంటే మీకు బాగా నచ్చిన పాటలోని నాలుగు అక్షరాలు, మరో సంఖ్యకు చేర్చి, రెండు స్పెషల్ క్యారెక్టర్లు జతచేస్తే సరి. మీ పాస్వర్డ్ నాగబంధం కన్నా గట్టిగా ఉంటుంది.
పాస్వర్డ్ ఎంపిక కోసం కుస్తీ పడాల్సిన పనిలేదు. దీన్నీ చక్కబెట్టడానికి పాస్వర్డ్ మేనేజర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. పాస్వర్డ్ జనరేషన్‌కు, స్టోరేజ్‌కు దీన్ని ఉపయోగించొచ్చు. ఇందులో పాస్వర్డ్ ఎన్‌క్రిప్ట్ అవుతుంది కాబట్టి.. మీ తాళం చెవి సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో పాస్వర్డ్ ఎంపిక చేసుకోవచ్చు. గూగుల్ తరహా ఆన్లైన్ సర్వర్లు కూడా పాస్‌వర్డ్‌ను ప్రొటెక్ట్ చేస్తున్నాయి. వీటినీ నమ్మొచ్చు. కొన్ని రకాల హార్డ్‌వేర్ డివైస్‌లకు పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఇచ్చే సదుపాయం ఉంది. పాస్వర్డ్ మేనేజర్ సాయంతో..
https://lastpass.com/
https://keepass.info/
https://keepersecurity.com/
https://pwsafe.org/
https://dashlane.com/
మన యూజర్‌నేమ్, పాస్వర్డ్ పరుల పరం కావొద్దంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, టూ-స్టెప్ వెరిఫికేషన్ సూత్రాలు గుర్తెరగాలి. ఈ రెండిటి పనితీరూ కాస్త అటూ ఇటూగా ఉన్నా… ఒకే రకమైన ప్రొటెక్షన్ ఇస్తాయి. టూ-స్టెప్ వెరిఫికేషన్‌లో వినియోగదారుడు పాస్వర్డ్ తర్వాత, వన్ టైమ్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్లో ఫేషియల్ స్కాన్, ఫింగర్ ప్రింట్ ప్రొటెక్షన్ అదనపు రక్షణనిస్తాయి. ఒకసారి పాస్వర్డ్ క్రియేట్ చేసి.. అదేదో బ్రహ్మపదార్థమనీ, ఎవరూ దానిని కనిపెట్టలేరనీ చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ, నిర్ణీత కాలపరిమితి తర్వాత పాస్వర్డ్ మార్చడం విధిగా భావించాలి. జటిలమైన పజిల్ కన్నా కఠినంగా ఉండే పాస్వర్డ్ ఎంపిక చేసుకోవడం మంచిది. దానికి సంబంధించి మీ ఇష్టాయిష్టాల నుంచి కూడా మీకు మాత్రమే తెలిసే, ఎవరూ కనిపెట్టలేని కీ పాయింట్ దొరకొచ్చు. మీ పాస్‌వర్డ్‌పై ఎవరి కన్ను అయినా పడిందా అని తెలుసుకోవడానికి గూగుల్ పాస్వర్డ్ చెక్‌ను ఉపయోగించొచ్చు. దీనికోసం ఈ లింక్‌లు ఉపయోగించండి..
https://passwords.google.com/
https://haveibeenpwned.com/
https://snusbase.com/
https://www.avast.com/hackcheck
కాలం కన్నా వేగంగా సాంకేతికత మార్పు చెందుతున్నది. దానికి తగ్గట్టుగానే సైబర్ సెక్యూరిటీ కొత్తపుంతలు తొక్కుతున్నది. బయోమెట్రిక్, మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్, అడ్వాన్స్డ్ పాస్వర్డ్ ఇవన్నీ నయా రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. అదే సమయంలో సైబర్ నేరగాళ్లు కూడా అంతేస్థాయిలో కొత్త అస్ర్తాలు సంధిస్తున్నారు. వారికి చిక్కకుండా పదిలంగా ఉండాలంటే మీ పాస్వర్డ్ ఫెయిల్ కాకుండా పక్కాది ఎంచుకోవడం ఒక్కటే మార్గం.